»Occultist Crime Saying That He Will Leave The Ghost Is Terrible Woman Is Killed By Stepping On Her Throat
Occultist Crime: దెయ్యాన్ని వదిలిస్తానని చెప్పి దారుణం..మహిళ గొంతుపై కాలుతో తొక్కి హత్య
భూతవైద్యం పేరుతో ఓ మానసిక రోగిని తాంత్రికుడు హింసించి చంపాడు. మహిళ మెడపై కాలుతో తొక్కి హత్య, ప్లాస్టిక్ పైపుతో ఆమెను దారుణంగా కొట్టడంతో ప్రాణాలు విడిచింది. ప్రస్తుతం పోలీసులు ఆ తాంత్రికుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
టెక్నాలజీతో అందరూ ముందుకు వెళ్తుంటే కొందరు ఇంకా మూఢనమ్మకాలనే నమ్ముకుంటున్నారు. దెయ్యం వదిలిస్తానని నమ్మించిన ఓ తాంత్రికుడు మహిళను చిత్రహింసలకు గురి చేసి హత్య చేశాడు. ఆ మహిళ మెడపై కాలేసి తొక్కి, నీటి పైపుతో బలంగా కొట్టడంతో ఆ మహిళ ప్రాణాలు విడిచింది. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ లోని ఇటావా జిల్లాలో చోటుచేసుకుంది. ఘటనపై కొత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలోని పత్వారియా ప్రాంతంలో కేసు నమోదైంది.
పోలీసుల వివరాల మేరకు..పత్వారియా ప్రాంతానికి చెందిన 40 ఏళ్ల మహిళ ప్రియా సక్సేనకు ఆరేళ్ల క్రితం వివాహం అయ్యింది. భర్తతో గొడవల కారణంగా గత కొంత కాలంగా ఆమె వేరుగా జీవిస్తున్నా ఆమెను మానసిక సమస్యలు వెంటాడాయి. దీంతో ఆమె పుట్టింటి వారు ఓ క్షుద్రపూజలు చేసే వ్యక్తి వద్దకు తీసుకెళ్లడా ఆ తాంత్రికుడు ప్రియాకు దెయ్యం పట్టిందని తెలిపాడు. ఆ దెయ్యాన్ని వదిలిస్తానని ప్రియా తల్లిదండ్రులను నమ్మించాడు. శనివారం హోమం కూడా చేశాడు.
హోమం తర్వాత భూతవైద్యం పేరుతో ఆ తాంత్రికుడు ప్రియను చిత్రహింసలకు గురి చేశాడు. తాంత్రిక పూజలో భాగంగా ఆమె మెడపై కాలు వేసి తొక్కడమే కాకుండా నీటిపైపుతో ఆమె దారుణంగా కొట్టాడు. ఆ చిత్రహింసలు భరించలేని ప్రియా అప్పటికే మరణించింది. అయితే ప్రియా ఏడు రోజుల్లో స్పృహలోకి వస్తుందని, ఆ తర్వాత ఆమెకున్న మానసిక సమస్యలన్నీ నయమైపోతాయని తాంత్రికుడు చెప్పడంతో ప్రియాను ఇంటికి తీసుకొచ్చేశారు.
ఒక రోజు గడిచినా కూడా ప్రియలో ఎటువంటి కదలికలు లేకపోవడంతో అనుమానం వచ్చింది. వెంటనే తాంత్రికుడిని పిలిపించారు. ప్రియను పరీక్షించిన ఆ భూతవైద్యుడు కాసేపట్లో ఆమెకు స్పృహ వస్తుందని చెప్పి వెళ్లిపోయాడు. ఆ తర్వాత ఎంతసేపటికీ ఆమెకు స్పృహ రాకపోవడంతో ప్రియ చనిపోయినట్లుగా కుటుంబ సభ్యులు గుర్తించారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారించారు. కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం తాంత్రికుడి కోసం ముమ్మరంగా గాలిస్తున్నట్లు ఎస్పీ కపిల్ దేవ్ సింగ్ వెల్లడించారు.