గ్యాంగ్‌స్టర్ ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి చెందారు. గ్యాంగ్‌స్టర్ నుంచి రాజకీయ నాయకుడిగా ఎదిగి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అన్సారీ 2005 నుంచి జైలు శిక్ష అనుభవిస్తున్నారు.
Mukhtar Ansari: గ్యాంగ్‌స్టర్ ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి చెందారు. గ్యాంగ్‌స్టర్ నుంచి రాజకీయ నాయకుడిగా ఎదిగి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అన్సారీ 2005 నుంచి జైలు శిక్ష అనుభవిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని బాందా జైలులో ఆయన శిక్ష అనుభవిస్తున్నారు. నిన్న సాయంత్రం జైలులో ఒక్కసారిగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వాంతులు చేసుకుని అపస్మారక స్థితిలోకి వెళ్లారు. దీంతో జైలు అధికారులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. వైద్యులు వెంటనే చికిత్స ప్రారంభించినప్పటికీ గుండెపోటుతో చనిపోయారు.
ఎలాంటి పరిస్థితులు రాకుండా ఉత్తరప్రదేశ్‌లో 144 సెక్షన్ విధించారు. ఆ ఆసుపత్రి పరిసరాల్లో పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. బాందా, మౌ, ఘాజీపుర్, వారణాసి జిల్లాల్లో అదనపు పోలీసు బలగాలను ఏర్పాటు చేశారు. రెండు రోజుల క్రితం అన్సారీ అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొంది డిశ్చార్జి అయ్యారు. ఆయనకు జైలులో విషపూరిత ఆహారం ఇచ్చారని ఇటీవలే ఆయన సోదరుడు, ఘాజీపుర్ ఎంపీ అఫ్జల్ అన్సారీ ఆరోపించారు. అయితే ముఖ్తార్ ఆరోగ్యం బాగా లేకపోవడంతో మరుగుదొడ్డిలో పడిపోయారని జైలు అధికారులు తెలిపారు. వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించినట్లు తెలిపారు.
యూపీలోని మౌకు చెందిన అన్సారీపై మొత్తం 61 కేసులు నమోదయ్యాయి. అందులో 15 హత్య కేసులు ఉన్నాయి. 1980ల్లో గ్యాంగ్ సభ్యుడిగా చేరిన అన్సారీ 1990ల్లో సొంతంగా గ్యాంగ్‌ను ఏర్పాటు చేసుకున్నారు. 2004లో అన్సారీ వద్ద మెషిన్ గన్ బయటపడడంతో పోలీసులు అప్పటి ఉగ్రవాద నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి జైలుకు తరలించారు. భాజపా ఎమ్మెల్యే కృష్ణానంద్ రాయ్ హత్య కేసులో గతేడాది ఏప్రిల్‌లో కోర్టు ఆయనకు 10 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. 1990లో నకిలీ తుపాకీ లైసెన్స్ కలిగి ఉన్నారన్న అభియోగాల నేపథ్యంలో ఈ నెల 13న కోర్టు జీవితఖైదు విధించింది.