MDK: రామాయంపేట మండలం ఆర్ వెంకటాపూర్ గ్రామంలో ఆదివారం పారిశుధ్య కార్మికులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా ప్రజలకు సేవలు అందిస్తున్న పారిశుధ్య కార్మికులను సర్పంచ్ ఉమా సంజీవరెడ్డి సన్మానం చేశారు. గ్రామంలో పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల ఆరోగ్యానికి అండగా ఉంటున్న కార్మికుల సేవలు మరువలేనివని అన్నారు.
SRPT: నేరేడుచర్ల మండలం పెంచికల్ గ్రామంలోని ఊర చెరువు నీటిని చాపల వేట పేరుతో వృధా చేయవద్దని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ చెరువు కింద సుమారు 70 ఎకరాల్లో వరి సాగు జరుగుతుండగా, ప్రస్తుతం పంట పొట్ట దశలో ఉందని రైతులు తెలిపారు. కీలక సమయంలో చేపల వేట కోసం తూము ద్వారా నీటిని వదిలేస్తుండటంతో పంటలు ఎండిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
MBNR: కౌకుంట్ల మండల కేంద్రంలో సాగు చేస్తున్న యాసంగి పంటలు నీరు లేక ఎండిపోతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న సర్పంచ్ ఉల్లి నరేశ్ కుమార్ తక్షణమే స్పందించి, పంటలను కాపాడేందుకు పెద్ద చెరువు నుంచి సాగునీటిని విడుదల చేశారు. దీంతో తమ పంటలు దక్కుతాయని రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కిషన్ రావు పాల్గొన్నారు.
ADB: రైతులకు ఆసరాగా ఉన్న రైతుబంధును వెంటనే విడుదల చేయాలనీ లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ భరత్ చౌహన్ డిమాండ్ చేశారు. ఆయన ఆదివారం ఉట్నూర్ మండలంలోని కొత్తగూడ గ్రామంలో పర్యటించి రైతులతో సమావేశం నిర్వహించారు. రైతులు ఎదుర్కుంటున్న సమస్యలతో పాటు అస్తవ్యస్తంగా ఉన్న విద్యుత్తు తీగలను బాగు చేయాలన్నారు.
BDK: దేశవ్యాప్తంగా వంటగ్యాస్ సరఫరా తగ్గిపోవడంతో ప్రజలు, హోటల్ నిర్వాహకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సీపీఐ పార్టీ నాయకులు, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఇవాళ ఓ ప్రకటనలో తెలిపారు. గ్యాస్ ధరలు నిరంతరం పెరుగుతుండటంతో సామాన్య ప్రజలపై ఆర్థిక భారం మరింత పెరుగుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
WNP: ఓ కేసు దర్యాప్తును నిబంధనలకు విరుద్ధంగా చేశారన్న ఫిర్యాదుపై చిన్నంబావి ఎస్సై నాగరాజును జిల్లా ఎస్పీ సునీత రెడ్డి సస్పెండ్ చేసినట్లు తెలిపారు. వివరాలు.. మోసం చేశారని ఆ మండలంలోని ఓ వ్యక్తిపై మహిళ ఇచ్చిన ఫిర్యాదు విషయంలో ఎస్సై సదరు వ్యక్తికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని బాధితురాలు ఆరోపణ చేసింది. విచారణ చేపట్టి ఎస్సైను సస్పెండ్ చేసినట్లు పేర్కొన్నారు.
BHNG: ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆదివారం నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండనున్నారు. పెద్ద అంబర్‌పేటలోని తన క్యాంపు కార్యాలయంలో ఆదివారం (నేడు) మధ్యాహ్నం 1 నుంచి సా. 6 గంటల వరకు ఉండి ప్రజల వినతులు స్వీకరిస్తారని ఆయన వ్యక్తిగత సహాయకులు తెలిపారు. స్థానిక సమస్యలను నేరుగా ఎంపీ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవచ్చని పేర్కొన్నారు.
కామారెడ్డి పట్టణ కేంద్రంలోని మదిన గ్రౌండ్‌లో ఓల్డ్ సిటీ యూత్ ఆధ్వర్యంలో ఆదివారం రోజున దావతే ఇఫ్తార్ మరియు విందు ఏర్పాటు చేయడం జరుగుతుందని ఓల్డ్ సిటీ యూత్ నిర్వాహకులు తెలిపారు. దావతే ఇఫ్తార్ మరియు విందు ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. కావున పట్టణ కేంద్రంలోని ముస్లిం సోదరులు పెద్ద ఎత్తున పాల్గొనాలన్నారు
NGKL: అచ్చంపేటలోని ఎన్టీఆర్ స్టేడియంలో ఆదివారం వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. ఓ ఆసుపత్రి నిర్వాహకుడు లింగాచారి, ఓ డయాగ్నొస్టిక్ సెంటర్ నిర్వాహకుడు సైదులు వాకర్స్ సభ్యులకు వైద్య పరీక్షలు చేసి తగు సూచనలు చేశారు. ప్రతిరోజూ కనీసం పదివేల అడుగులు నడవడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని వారు పేర్కొన్నారు.
ADB: ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యుడు గోడం నగేశ్‌ను ఆదివాసి సంఘం నాయకులు పట్టణంలోని MP నివాసంలో ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. మతం మారిన గిరిజనులను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని కోరుతూ ఈ నెల 23, 24, 25 తేదీలలో ఢిల్లీలో నిర్వహించనున్న కార్యక్రమం వాల్ పోస్టర్లను MP ఆవిష్కరించారు. నాయకులు గంగాధర్ రావు, వెంకన్న, రమేష్, వామన్, చంద్రకాంత్ తదితరులున్నారు.
మిర్యాలగూడ పట్టణంలోని 47వ వార్డ్ ఇస్లాంపురం నందుమాజీ కౌన్సిలర్ ఘని మరియు కౌన్సిలర్ ఫరూక్ ఆధ్వర్యంలో రంజాన్ పర్వదినం 24వ రోజు ఉపవాస దీక్షలలో భాగంగా నిర్వహించిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్ విందు స్వీకరించారు. ప్రశాంత వాతావరణంలో రంజాన్ నిర్వహించుకోవాలని కోరారు.
ASF: ఈనెల 16 నుంచి ఒంటి పూట బడులు ప్రారంభం కానున్నాయని జిల్లా విద్యాధికారి లలిత ఒక ప్రకటనలో తెలిపారు. ఒంటి పూట బడుల సమయంలో ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలన్నారు. ప్రేయర్ సమయంలో విద్యార్థులు ఎండలకు అస్వస్థతకు గురి కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, వడ దెబ్బ తగలకుండా చర్యలు చేపట్టాలని సూచించారు.
భద్రాద్రి: ఇల్లందుకు తాగునీరు అందించే ఇల్లందులపాడు చెరువు చెత్తాచెదారంతో కలుషితమవుతోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చెరువులో వ్యర్థాలు పేరుకుపోవడంతో నీటి నాణ్యతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని చెరువును శుభ్రపరచాలని ప్రజలు కోరుతున్నారు. అలాగే చెరువు వద్ద రాత్రి వేళల్లో జరిగే మందుబాబుల హంగామాను అరికట్టాలన్నారు.
KMR: ఎండల తీవ్రత దృష్ట్యా జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో రేపటి నుంచి ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నట్లు డీఈవో రాజు తెలిపారు. పదో తరగతి పరీక్షా కేంద్రాలు ఉన్న పాఠశాలలు మాత్రం, పరీక్షలు జరిగే రోజుల్లో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తారని స్పష్టం చేశారు.
WGL: జిల్లాలో కొత్త రకమైన డిజిటల్ మోసాలు జరుగుతున్నాయని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. కొందరు మోసగాళ్లు ఫోన్ కాల్స్ చేసి తాము పోలీసు, ప్రభుత్వ అధికారులమని చెబుతూ డిజిటల్ అరెస్ట్ చేస్తామని బెదిరిస్తున్నారని పేర్కొన్నారు. ఈ విధంగా ప్రజలను భయపెట్టి డబ్బులు వసూలు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. అలాగా ఎవరైనా కాల్ చేస్తే 1930 సంప్రదించాలని కోరారు.