SRCL: ఎల్లారెడ్డిపేట మండల రెడ్డి సంఘం అధ్యక్షునిగా కుంబాల సుధాకర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్బంగా కుంభాల సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ.. మండలంలో సంఘ అభివృద్ధికి పాటు పడతానని సంఘం పురోభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మండలములోని అన్ని గ్రామాల రెడ్డి కుల బాంధవులకు, తన ఎన్నికకు సహకరించిన వారందరికీ సుధాకర్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు
NZB: రంజాన్ పండుగను పురస్కరించుకొని మోతే గ్రామంలో ఉప సర్పంచ్ పరంజ్యోతి ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో అన్ని మతాలకు చెందిన ప్రజలు పాల్గొని మత సామరస్యాన్ని చాటారు. ఈ సందర్భంగా పరంజ్యోతి కుమార్ మాట్లాడుతూ.. భారతదేశం ఒక లౌకిక దేశమని, ఇక్కడ ప్రతి మతానికి సమాన గౌరవం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రఫీ, సలీం, జయవర్ధన్, ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.
NRPT: జిల్లా నూతన కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన ప్రతీక్ జైన్‌ను ఎస్పీ డాక్టర్ వినీత్ శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. కలెక్టర్ ఛాంబర్‌లో ఆయనకు పూలమొక్క అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీస్, రెవెన్యూ శాఖలు సమన్వయంతో పనిచేస్తూ, జిల్లా అభివృద్ధికి సమష్టిగా కృషి చేద్దామని వారు ఆకాంక్షించారు.
MDCL: ఘట్‌కేసర్ ప్రాంతం వైపు రియల్ ఎస్టేట్ గత 3 నెలలుగా పుంజుకుంటున్నట్లుగా ‘రేరాసేమ్’ సర్వేలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఉప్పల్ నుంచి నారపల్లి మార్గంలో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం కొనసాగుతుండగా, ఇది పూర్తయితే ఘట్‌కేసర్ నుంచి హైటెక్ సిటీ వెళ్లడం కేవలం గంటన్నర సమయం పడుతుందని, ఈ నేపథ్యంలో ఈ ప్రాంత నివాసితులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొంది.
MNCL: జైపూర్ మండలంలోని కిష్టపూర్ గ్రామంలో శుక్రవారం ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో గంజాయి, మాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ ఎస్సై శంకర్ మాట్లాడుతూ.. గంజాయి, మాదకద్రవ్యాల వల్ల ఎన్నో అనర్థాలు జరుగుతున్నాయన్నారు. వాటికి దూరంగా ఉండి ఆరోగ్యకరమైన జీవనం గడపాలని సూచించారు.
MHBD: తొర్రూరు మండలంలోని దుబ్బతండా, కర్రెబీక్య తండా అంగన్వాడి కేంద్రాలపై HIT TVలో ప్రచురితమైన వార్త కథనానికి సీడీపీవో కమలాదేవి శుక్రవారం అంగన్వాడి కేంద్రాలలో తనిఖీలు నిర్వహించారు. లబ్ధిదారులకు పాలు, గుడ్లు, పౌష్టికాహారం తప్పనిసరిగా అందించాలని, టీచర్లు హాజరుకాకపోతే చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అంగన్వాడి టీచర్ గైర్హాజరుపై వివరాలు సేకరించారు.
JGL: మెట్‌పల్లి కోర్టు ప్రాంగణంలో సీనియర్ సివిల్ జడ్జి డి. నాగేశ్వర్ రావు కోర్టు భవనాల సూచిక బోర్డును ప్రారంభించారు. కోర్టుకు వచ్చే ప్రజలకు ఇది ఉపయోగకరమని తెలిపారు. బార్ అసోసియేషన్ సహకారం అభినందనీయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో జూనియర్ జడ్జి నారం అరుణ్ కుమార్, జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు.
NRML: ప్రభుత్వ అనుమతి లేకుండా ఇసుక అక్రమ రవాణా చేసినా, డంపింగ్ చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని భైంసా ఇంఛార్జ్ ఏఎస్పీ సాయికిరణ్ హెచ్చరించారు. భైంసాలోని పలు ప్రాంతాల్లో అక్రమంగా నిల్వ ఉంచిన ఇసుక డంపులను భైంసా టౌన్ సీఐతో కలిసి ఆయన తనిఖీలు చేపట్టారు. అనంతరం అక్రమ ఇసుక నిల్వలపై సంబంధిత రెవెన్యూ అధికారులకు సమాచారం అందించి ఫిర్యాదు చేశారు.
MBNR: కౌకుంట్ల మండలం ఇస్రంపల్లిలో ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఆదేశాల మేరకు ముస్లిం మహిళలకు రంజాన్ కానుకలను పంపిణీ చేశారు. మండల పార్టీ అధ్యక్షుడు రాఘవేంద్ర రెడ్డి, సర్పంచ్ కృష్ణయ్య కలిసి మైనారిటీలకు నూతన వస్త్రాలు అందజేశారు. ప్రభుత్వం పేదల పండుగ సంతోషం కోసం ఈ తోఫాను అందిస్తోందని వారు పేర్కొన్నారు.
KNR: ప్రజా వ్యతిరేక చట్టాల రద్దుకు ఈనెల 24న కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించనున్నట్లు సీపీఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవ రెడ్డి అన్నారు. జమ్మికుంటలో నిర్వహించిన మండల కమిటీ సమావేశంలో జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ప్రజా వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలన్నారు.
PDPL: మంథని- రచ్చపల్లి ఆర్అండ్ఆర్ కాలనీ, ఖమ్మంపల్లి ప్రధాన రహదారిపై సూరయ్యపల్లి గ్రామ శివారులోని వంతెన ప్రమాదకరంగా మారింది. రహదారిపై పలుచోట్ల భారీ గుంతలు ఏర్పడటంతో పాటు, వంతెన రెండు వైపులా రైలింగ్ ధ్వంసమైందని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిత్యం రాకపోకలు సాగే ఈ మార్గంలో ముఖ్యంగా రాత్రి వేళల్లో ప్రమాదాలు జరిగే అవకాశముందన్నారు.
MNCL: జనగణన- 2027 తొలి విడతలో భాగంగా ఇళ్ల గణన విధులను సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం నస్పూర్ కలెక్టరేట్‌లో జనగణన ప్రక్రియ, యాప్ నిర్వహణపై నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి యాప్ ద్వారా ఖచ్చితంగా జనగణన చేపట్టాలని ఆయన సూచించారు.
SDPT: బెజ్జంకి మండలం లక్ష్మీపూర్ గ్రామ ప్రాథమిక పాఠశాలలో నూతన ముఖద్వారం ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ మండలాధ్యక్షుడు ముక్కీస రత్నాకర్ రెడ్డి స్వంత నిధులతో నిర్మించిన ఈ ద్వారాన్ని సర్పంచ్ ముక్కీస కవిత పరిశీలించి అభినందించారు. పాఠశాల అభివృద్ధికి పూర్వ విద్యార్థులు ముందుకు రావాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ హరీశ్, కార్యదర్శి అనూష, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
NLG: రాష్ట్ర బడ్జెట్‌లో మహాత్మా గాంధీ యూనివర్సిటీకి నిధులు కేటాయించకపోవడాన్ని నిరసిస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో బడ్జెట్ కాపీలను దహనం చేశారు. విద్యారంగానికి కేవలం 8% నిధులిచ్చి ప్రభుత్వం చేతులు దులుపుకుందని, వర్సిటీ నియామకాలపై స్పష్టత లేదని నేతలు విమర్శించారు. ఓయూ మినహా ఇతర వర్సిటీలను విస్మరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
SRD: పటాన్చెరు నియోజకవర్గం వెలిమల గ్రామంలో బీఆర్ఎస్ నేత రాజ్‌కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇఫ్తార్ విందుకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి హాజరయ్యారు. రంజాన్ సందర్భంగా ముస్లింలకు కానుకలు పంపిణీ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించగా, ఉపవాస దీక్షలు విరమించారు. ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.