HNK: బీఫార్మసీ (CBCS) ఫస్ట్ సెమిస్టర్ పరీక్షల షెడ్యూల్‌ను కాకతీయ యూనివర్సిటీ విడుదల చేసింది. ఈ పరీక్షలు మార్చి 24 నుంచి ప్రారంభమై 30 వరకు ప్రతిరోజూ మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. వరంగల్, హనుమకొండ సహా పలు కేంద్రాల్లో నిర్వహణకు ఏర్పాట్లు అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు.
WNP: రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని ఇవాళ పెబ్బేరు మండలంలోని పేద ముస్లిం సోదరులకు మున్సిపల్ ఛైర్మన్ అక్కి శ్రీనివాస్ గౌడ్ రంజాన్ తోఫాను అందజేశారు. ప్రజలందరూ సంతోషంగా పండుగ జరుపు కోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ‘రంజాన్ తోఫా’ను అందజేస్తోందని ఆయన పేర్కొన్నారు. అనంతరం 9వ వార్డు లబ్ధిదారులకు రంజాన్ తోఫా కిట్లను పంపిణీ చేశారు.
BDK: పాల్వంచ మండలం జగన్నాథపురం పెద్దమ్మ తల్లి ఆలయ హుండీ లెక్కింపు శుక్రవారం నిర్వహించారు. గత 162 రోజులకు గాను భక్తులు సమర్పించిన కానుకల ద్వారా రూ.42,84,648 ఆదాయం సమకూరినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. దేవస్థానం కార్యనిర్వహణ అధికారి రజనీకుమారి, డివిజన్ పరిశీలకులు బేల్‌సింగ్ సమక్షంలో అత్యంత పారదర్శకంగా ఈ లెక్కింపు ప్రక్రియ జరిగిందని అధికారులు తెలిపారు.
MDCL: ప్రతి ఒక్కరు తప్పనిసరిగా స్వచ్ఛ ఆటోకు మాత్రమే చెత్త వెయ్యాలని జోనల్ కమిషనర్ రాధిక గుప్తా ప్రజలకు సూచించారు. ఘట్‌కేసర్ వ్యాప్తంగా అనేకచోట్ల విస్తృతంగా పర్యటించి, స్వచ్ఛ ఆటోలకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. నేడు గ్రౌండ్ లెవెల్ అధికారులు పర్యవేక్షించి, తగిన చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. రోడ్లపై చెత్త వేస్తే జరిమానా కఠినంగా ఉంటుందన్నారు.
SRPT: రంజాన్ పండుగ సందర్భంగా జిల్లా ప్రజలకు కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పవిత్ర మాసం సహనాన్ని, సేవాభావాన్ని పెంపొందిస్తుందని ఆయన పేర్కొన్నారు. రంజాన్ శాంతి, ఐక్యతకు ప్రతీక అని, ప్రతి ఒక్కరూ మత సామరస్యంతో ఆనందంగా పండుగను జరుపుకోవాలని సూచించారు. సమాజంలో సోదరభావం మరింత బలపడాలని కలెక్టర్ ఆకాంక్షించారు.
NLG: చిట్యాల పురపాలక సంఘం పరిధిలోని రైతులకు మేలు చేకూర్చేలా విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారి (NH-65) పక్కన కూరగాయలు, పండ్ల దుకాణాల సముదాయాన్ని నిర్మించాలని చిట్యాల రైతు సంఘం కోరింది. ఈ మేరకు చిట్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యదర్శి జానయ్యకు శుక్రవారం వినతిపత్రం అందజేశారు. హైవేపై మార్కెట్ నిర్మిస్తే స్థానిక రైతులకు ప్రయోజనం కలుగుతుందని అన్నారు.
JN: ఆరు గ్యారెంటీలను అమలు చేయాలని కోరుతూ జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝాకు బీజేపీ నేతలు వినతిపత్రం అందజేశారు. రాష్ట్ర అధికార ప్రతినిధి దశమంత్ రెడ్డి,జిల్లా అధ్యక్షుడు సౌడ రమేష్ మాట్లాడుతూ.. ఆరు గ్యారెంటీలను అమలుపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ప్రజా సమస్యలను ప్రభుత్వం సత్వరమే పరిష్కరించి ప్రజా సంక్షేమంపై శ్రద్ధ చూపించాలన్నారు.
MHBD: తొర్రూరు మండలంలోని అమ్మాపురం 9వ వార్డులో డ్రైనేజ్ కాలువ చెత్త చెదారంతో నిండిపోయి మురుగునీరు నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ సమస్యను వార్డు ప్రజలు స్థానిక సర్పంచ్ ముద్ధం సునీత వీరారెడ్డి దృష్టికి తీసుకెళ్లగా, వెంటనే స్పందించి జేసీబీ సహాయంతో డ్రైనేజీ కాలువను శుభ్రం చేయించారు.
BHNG: వలిగొండ మండల కేంద్రంలో సీపీఎం జిల్లా కమిటీ ఇంటింటి సీపీఎం సర్వే కార్యక్రమానికి చేపట్టారు. ఈ కార్యక్రమానిక రాష్ట్ర నాయకులు ఎండీ జహంగీర్ హాజరై మాట్లాడుతూ.. రాష్ట్ర అసెంబ్లీలో సీఎంతో పాటు ప్రతిపక్ష పార్టీకి చెందిన నాయకులు రాజకీయ విలువలను కోల్పోయి దుర్భాషలాడుకోవడం దుర్మార్గమని అన్నారు. ఇది రాజకీయాల్లో ప్రజా ప్రతినిధుల గౌరవాన్ని తగ్గిస్తుందని పేర్కొన్నారు.
NZB: కమ్మర్ పల్లి మండల కేంద్రంలో రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేసుకునేందుకు అనువుగా స్థానిక గ్రామ పంచాయితీ ఆధ్వర్యంలో ఈద్గా వద్ద శుక్రవారం శ్రమదానం కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులతో ఈద్గా పరిసరాలను శుభ్రం చేయించారు. పరిసరాల్లోని చెత్తాచెదారాన్ని ఊడ్చి, పిచ్చి మొక్కలను తొలగించారు.
WGL: FSSAI 2026 ఏప్రిల్ బ్యాచ్ ఇంటర్న్‌షిప్‌కు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఫుడ్ టెక్నాలజీ, న్యూట్రిషన్ చదువుతున్న ఫుల్‌టైమ్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు అర్హులు. గరిష్ఠంగా 6 నెలల పాటు ఇంటర్న్‌షిప్ ఉండగా, నెలకు రూ.10,000 స్టైపెండ్ అందుతుంది. యువత ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని వరంగల్ ఫుడ్ సేఫ్టీ అధికారి ఆకారపు బ్రహ్మాజీ సూచించారు.
ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ OBC సెల్ అధికార ప్రతినిధిగా చిక్కుల వెంకటేష్ నియమితులయ్యారు. వెంకటేష్‌కు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పైడాకుల అశోక్ నియామక పత్రాన్ని అందజేశారు. ములుగు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని వెంకటేష్‌కు అశోక్ సూచించారు.
SRCL: చందుర్తి మండలం సనుగుల గ్రామంలోని గంగిరెద్దుల కాలనీని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు మర్రిపల్లి చందన దత్తత తీసుకున్నారు. ఆమె మాట్లాడుతూ.. కాలనీలోని పిల్లలకు మెరుగైన విద్య, ఆరోగ్యం, రక్షణ సేవలు అందించడంపై ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు. అలాగే బాల్య వివాహాలు, బాల కార్మికత్వం నివారణకు ప్రత్యేక చర్యలు చేపడతామని ఆమె పేర్కొన్నారు.
KNR: జిల్లా ఆసుపత్రుల్లో పరిశుభ్రతతో పాటు రోగులకు అందించే వైద్య సేవలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ సూచించారు. ఇల్లందకుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా సందర్శించి వ్యాక్సిన్ గది, ఫార్మసీ, ల్యాబ్, లేబర్ రూమ్‌లను పరిశీలించారు. ఆసుపత్రిలో మందుల సరఫరా నిరంతరంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి ఆదేశించారు.
ADB: జనగణన ప్రక్రియను అత్యంత ఖచ్చితత్వంతో నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అధికారులకు సూచించారు. శుక్రవారం టీటీడీసీ భవనంలో టెక్నికల్ అసిస్టెంట్లు, ఛార్జ్ క్లర్కులకు ఏర్పాటు చేసిన మూడు రోజుల శిక్షణ తరగతులను ఆయన ప్రారంభించారు. గణనలో సాంకేతిక అంశాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని స్పష్టం చేశారు.