ADB: ఉట్నూర్‌లోని ఐటీడీఏ కార్యాలయంలో ప్రజావాణి సందర్భంగా గిరిజన సంక్షేమ శాఖ ఉపసంచాలకులు అంబాజీ ప్రజల నుంచి ఆర్జీలను స్వీకరించారు. ఏజెన్సీ ప్రాంతంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలతో వచ్చి తమ సమస్యలు పరిష్కరించాలని వినతి పత్రం అందించారు. దీంతో గిరిజనులు తెలిపిన సమస్యలపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకుని పరిష్కరించాలని డీడీ ఆదేశించారు.
NRPT: జిల్లాలో వేసవి దృష్ట్యా తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడుతూ.. ప్రతి ఇంటికీ నీరు అందేలా చూడాలని, నీటి ట్యాంకులను ఎప్పటికప్పుడు శుభ్రం చేయించాలని సూచించారు. సరఫరాలో ఎలాంటి ఆటంకాలు కలగకుండా పర్యవేక్షించాలని స్పష్టం చేశారు.
MNCL: రాష్ట్ర ప్రభుత్వం గ్రామ స్వరాజ్యాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా పంచాయతీరాజ్ వ్యవస్థ మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దెందుకు కృషి చేస్తుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రలోనూతన సర్పంచుల శిక్షణ కార్యక్రమానికి హాజరయ్యారు. సర్పంచ్‌లకు గ్రామ పాలన, అభివృద్ధి, ప్రజాసేవ విధానాలపై అవగాహన కల్పించేందుకు శిక్షణ ఇస్తున్నామన్నారు.
KMR: మహిళల ఆత్మగౌరవం, ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం వడ్డీలేని రుణాలు అందిస్తోందని ఎల్లారెడ్డి ఆర్డీఓ పార్థ సింహారెడ్డి తెలిపారు. స్థానిక ముత్యపు రాఘవులు పెంటయ్య పంక్షన్ హాల్లో మెప్మా ఆధ్వర్యంలో మున్సిపల్ పరిధిలోని మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాల చెక్కులు, మహిళా శక్తి చీరలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మహిళలు, పలువురు అధికారులు పాల్గొన్నారు.
మహబూబ్ నగర్ కార్పొరేషన్ పరిధిలోని హౌసింగ్ బోర్డు కాలనీ డివిజన్ పరిధిలో పోచమ్మ దేవాలయ అభివృద్ధి కోసం దాదాపు 4 లక్షల రూపాయలను యువ కాంగ్రెస్ పార్టీ నాయకులు గుమ్మాల్ శ్రీను సోమవారం వితరణ చేశారు. ఈ సందర్భంగా కాలనీవాసులు అంతా కూడా పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేశారు. దేవాలయ అభివృద్ధికి తనవంతుగా సహాయ సహకారాలు అందిస్తానని శ్రీను తెలిపారు.
NLG: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు అన్యాయం చేసిన ప్రభుత్వం, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లోనూ 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయకుండా మోసం చేసిందని బీసీ జేఏసీ మిర్యాలగూడ పట్టణాధ్యక్షుడు వెంకటేశ్వర్లు అన్నారు. సోమవారం మిర్యాలగూడలోని మహాత్మా జ్యోతిరావ్ పూలే విగ్రహం వద్ద బీసీ జేఏసీ ఆధ్వర్యంలో కళ్లకు నల్ల గంతలు కట్టుకుని...
NRPT: ఊట్కూర్ మండలం బిజ్వార్లో పర్యావరణాన్ని కాపాడాల్సిన అటవీ అధికారులే భక్షకులుగా మారుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. అధికారుల అండతో వ్యాపారులు భారీ వృక్షాలను యథేచ్ఛగా నరికివేస్తున్నట్లు గ్రామస్థులు మండిపడుతున్నారు. గత కొద్దిరోజులుగా చెట్ల నరికివేత కొనసాగుతున్నా, అధికారులు పట్టించుకోకపోవడంపై పర్యావరణ ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
KMM: తెలంగాణ ప్రెస్ అకాడమీ ఛైర్మన్ కె. శ్రీనివాసరెడ్డి వైరా రిజర్వాయర్‌ను నిన్న సందర్శించి, ఏపీ-తెలంగాణ రాష్ట్రాలు నీటి వాటాల సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని అన్నారు. నైజాం కాలం నాటి ఈ పురాతన ప్రాజెక్టు ద్వారా 30 వేల ఎకరాలకు సాగునీరు అందుతోందని ఆయన తెలిపారు. ప్రభుత్వం ఈ రిజర్వాయర్‌కు కృష్ణా, గోదావరి జలాలను అనుసంధానం చేసిందని తెలిపారు.
KNR: చొప్పదండికి చెందిన గుజ్జేటి అశ్విత జాతీయ స్థాయి ఫుట్ బాల్ క్రీడా పోటీలకు ఎంపికైంది. దీంతో ఈనెల 21న మణిపుర్‌లోని ఇంఫాల్‌లో జరగనున్న జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొననుంది. ఈ సందర్భంగా జాతీయ స్థాయి ఎంపికైన క్రీడాకారిణిని బీజేపీ పట్టణ అధ్యక్షుడు చిల్ల శ్రవణ్ కుమార్ అభినందించారు. అశ్వితకు ప్రయాణ ఖర్చులకు రూ. 10 వేలు ఆర్థిక సాయం అందించి సన్మానించారు.
NLG: నల్లగొండ పట్టణాన్ని ప్రమాద రహిత పట్టణంగా మార్చేందుకు అరైవ్ అలైవ్ కార్యక్రమానికి ప్రజలు, యువత పూర్తిగా సహకరించాలని వన్ టౌన్ సీఐ ఏమిరెడ్డి రాజశేఖర్ రెడ్డి కోరారు. సోమవారం స్థానిక భాస్కర్ టాకీస్ చౌరస్తా వద్ద వాహనాదారులకు సురక్షిత ప్రయాణంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
జగిత్యాలలో రూ. 23.5 కోట్లతో ఏర్పాటు చేసిన క్రిటికల్ కేర్ యూనిట్ ప్రారంభంతో అత్యవసర వైద్య సేవలు విస్తరించనున్నాయని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి తక్షణమే ప్రాణ రక్షణ చికిత్స అందేలా ఈ యూనిట్ కీలకంగా మారుతుందని చెప్పారు. డయాలసిస్ సేవలు, అత్యవసర ప్రసూతి శస్త్రచికిత్సలు, మూడు ఆపరేషన్ థియేటర్లు అందుబాటులోకి రానున్నాయన్నారు.
GDWL: జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని ఈవీఎంల స్ట్రాంగ్ రూమ్‌ను కలెక్టర్ సంతోష్ సోమవారం అధికారులతో కలిసి తనిఖీ చేశారు. ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం నెలకు ఒకసారి నిర్వహించే సాధారణ తనిఖీల్లో భాగంగా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించి, ఎక్కడా లోపాలు లేకుండా పటిష్టంగా ఉండాలని అధికారులను ఆదేశించారు.
NRPT: నారాయణపేట పట్టణంలోని సుభాష్ రోడ్ నుంచి కొండారెడ్డిపల్లి చెరువు వరకు గల ప్రమాదకర ప్రాంతాలను డీఎస్పీ లింగయ్య సోమవారం పరిశీలించారు. అనంతరం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతూ.. మద్యం తాగి వాహనాలు నడపరాదని హెచ్చరించారు. ప్రమాదాల నివారణకు అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
MDK: మాఘ అమావాస్య సందర్భంగా ఏడుపాయల వనదుర్గమ్మ ఆలయానికి రూ.16.87 లక్షల ఆదాయం సమకూరింది. దర్శనాలు, ప్రసాదాలు, అద్దె గదుల ద్వారా ఈ మొత్తం వచ్చినట్లు ఈవో చంద్రశేఖర్ తెలిపారు. గత ఏడాది (రూ. 13.13 లక్షలు) కంటే ఈసారి రూ. 3.74 లక్షల ఆదాయం అదనంగా పెరిగింది. భక్తుల రద్దీ పెరగడంతో ఆదాయం గణనీయంగా వృద్ధి చెందిందని అధికారులు వెల్లడించారు.
GDWL: తెలంగాణ స్టేట్ మైనారిటీస్ ఎంప్లాయిస్ సర్వీస్ అసోసియేషన్ (TS MESA) జిల్లా నూతన సంవత్సర క్యాలెండర్‌ను సోమవారం కలెక్టరేట్లో ఆవిష్కరించారు. అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ ముఖ్య అతిథిగా హాజరై క్యాలెండర్‌ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు బషీర్ అహ్మద్, కార్యదర్శి ఖలీమ్, ఇతర సభ్యులు పాల్గొన్నారు.