HNK. వరి వేస్తే ఉరే అని నాటి పెద్దలు చెప్పారని, నేటి ప్రభుత్వం వరి వేసిన రైతులకు మద్దతు ధరతో పాటు సన్న వడ్లు వేసిన వారికి రూ.500 బోనస్ ఇస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆర్ట్స్ కళాశాల గ్రౌండ్‌లో రైతు మేళాలో మంత్రి మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వమని, రైతును రాజు చేయడమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు.
KMR: గాంధారి మండల కేంద్రంలోని కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రంలో ఇవాళ HPV వాక్సినేషన్ ప్రారంభించినట్లు మెడికల్ ఆఫీసర్ డా. సాయి కుమార్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. సర్వికల్ క్యాన్సర్ వ్యాధి నిరోధానికి 14సం. రాల లోపు పిల్లలకు HPV వ్యాక్సినేషన్ తప్పనిసరిగా వేయించాలని, తల్లిదండ్రులు వ్యాక్సినేషన్ పట్ల అవగాహన కలిగి ఉండాలని అన్నారు.
ADB: జైనథ్ మండల కేంద్రానికి చెందిన బొగ్గుల వైభవ్ అనే యువకుడు ఇటీవల విడుదలైన రైల్వే మెడికల్ డిపార్ట్మెంట్ పరీక్ష ఫలితాల్లో వెస్టర్న్ రైల్వే జోన్‌లో (RRB అహ్మదాబాద్)నందు హెల్త్ ఇన్స్పెక్టర్‌గా ఉద్యోగాన్ని సాధించాడు. వ్యవసాయ కూలీ కుటుంబం నుంచి వచ్చిన వైభవ్ ఎటువంటి కోచింగ్ లేకుండా సొంతంగా కష్టపడి చదువుకొని సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం సాధించాడు.
WGL: కేఎంసీ బీఎస్సీ నర్సింగ్ కాలేజీలో సీనియర్ విద్యార్థులు జూనియర్‌పై ర్యాగింగ్‌కు పాల్పడిన ఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది. బస్సు డీజిల్ ఖర్చుల కోసం డబ్బులు సేకరించాలని ప్రిన్సిపల్ సూచించడంతో జూనియర్ విద్యార్థి సీనియర్లను సంప్రదించగా, వారు ఆగ్రహంతో అతడిని వేధించినట్లు సమాచారం. ఘటనపై స్పందించిన కాలేజీ యాజమాన్యం చర్యలు చేపట్టింది.
SRPT: బక్రీద్ పండుగ సందర్భంగా మత పెద్దలు, గోరక్షణ సంఘాలతో పోలీసులు సమావేశమయ్యారు. పశువుల అక్రమ రవాణా నిరోధానికి సరిహద్దుల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేసినట్లు డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఎవరూ చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకూడదని, అనుమానిత సమాచారాన్ని పోలీసులకు అందించాలని కోరారు. పండుగను అందరూ ప్రశాంతంగా, సామరస్యంగా జరుపుకోవాలని ఆయన సూచించారు.
NZB: జిల్లాకు వ్యవసాయ విశ్వవిద్యాలయం మంజూరు చేయడం హర్షించదగ్గ విషయమే అయినప్పటికీ తెలంగాణ విశ్వవిద్యాలయంలో దీన్ని ఏర్పాటు చేయడం ఇబ్బందులకు దారితీస్తుందని NSUI, SFI టీయూ అధ్యక్షులు శ్రీశైలం, దీపిక అన్నారు. వ్యవసాయ విశ్వవిద్యా లయానికి టీయూ భూములు కేటాయించవద్దని కోరుతూ.. వర్సిటీ రిజిస్ట్రార్ యాదగిరికి వినతిపత్రం అందజేశారు.
MBNR: శ్రీ కురుమూర్తి స్వామి దేవస్థానానికి నూతన పాలకమండలిని ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు మంగళవారం ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి నూతన కార్యవర్గానికి నియామక ఉత్తర్వులు (జీవో) అందజేశారు. ఆలయ అభివృద్ధికి పాలకమండలి సభ్యులు సమిష్టిగా కృషి చేయాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో నూతన ఛైర్మన్ గౌని గోవర్దన్ రెడ్డి, పాలకమండలి సభ్యులు, ఇతర నాయకులు పాల్గొన్నారు.
WNP: యూపీఎస్సీ సివిల్స్ పరీక్షలకు ఉచిత శిక్షణ అందిస్తామని మైనార్టీస్ వెల్ఫేర్ ఆఫీసర్ ముజాహిద్ ఖాన్ తెలిపారు. పార్సి, బుద్ధ, జైన్, ముస్లిం, క్రిస్టియన్, సిఖ్ అభ్యర్థులు ఈ శిక్షణకు అప్లై చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఆన్‌లైన్‌లో http://cet.cgg.gov.in/tmeries వెబ్సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని ఈనెల 31వ తేదీ లోపు అభ్యర్థులు తమ దరఖాస్తులను పంపించాల్సి ఉంటుందన్నారు.
GDWL: గద్వాలలో నిర్వహించిన ప్రభుత్వ నర్సింగ్ కళాశాల వీడ్కోలు సభలో జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా, ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. నర్సింగ్ పూర్తి చేసిన విద్యార్థులు ఉద్యోగాల్లో చేరాక రోగుల పట్ల మానవత్వం, సహానుభూతితో వ్యవహరించాలని కోరారు. క్రమశిక్షణతో పనిచేసి జిల్లా ప్రతిష్టను నిలబెట్టాలని ఆయన పిలుపునిచ్చారు.
GDWL: అయిజలో బయటపడ్డ నకిలీ పత్రాలు, స్టాంపుల దందాలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. తీగ లాగితే డొంక కదిలింది అన్న చందంగా ప్రింటింగ్ ప్రెస్ పై దాడి చేస్తే ఏపీ, కర్ణాటక రాష్ట్రాలకు ఇక్కడి నుంచే నకిలీ సర్టిఫికెట్లు తయారుచేసినట్లు పోలీస్, రెవెన్యూ అధికారులు గుర్తించారు. ప్రింటింగ్ ప్రెస్ నిర్వాహకుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
BHNG :భువనగిరి శివారులోని శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయానికి ఇవ్వాళ భక్తులు భారీగా తరలివచ్చారు. దీంతో ఆలయ పరిసర ప్రాంతాలు భక్తులతో సందడిగా మారాయి. భక్తులు క్యూ లైన్ల ద్వారా అమ్మవారిని దర్శించుకుని తమ మొక్కులు తీర్చుకుంటున్నారు. ఆలయానికి వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు.
BDK: పాల్వంచ నవ లిమిటెడ్, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీస్ కార్యక్రమంలో భాగంగా నిర్మించిన వాక్సిన్ రూమ్, అర్బన్ హెల్త్ సెంటర్ ను DMHO డాక్టర్ తుకారాం రాథోడ్ ఇవాళ ప్రారంభించారు. ఈ సమావేశంలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కృష్ణ కుమారి మాట్లాడుతూ.. నవ లిమిటెడ్ వారిని అడిగిన వెంటనే 3 నెలలలోనే వ్యాక్సినేషన్ రూమ్‌ను నిర్మాణం చేసి నేడు అప్పగించడం సంతోషమన్నారు.
HNK: కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో భూములు కోల్పోయిన వారికి ఉద్యోగాలను ఇవ్వాలని CPM మండల కార్యదర్శి సాంబయ్య, జిల్లా నాయకులు ఉపేందర్ అన్నారు. కోచ్ ఫ్యాక్టరీ వద్ద భూ-నిర్వాసితులతో కలిసి CPM నేతలు నిరసన చేపట్టారు. భూములు కోల్పోయిన వారికి, స్థానిక యువతకు కోచ్ ఫ్యాక్టరీలో ఉద్యోగాలు కల్పించాలని, లేకపోతే నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.
MNCL: బెల్లంపల్లి మండలం అంకుశం గ్రామంలో “రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు” మంగళవారం కార్యక్రమం నిర్వహించారు. శాస్త్రవేత్త డా. ఎన్. మహేష్ పాల్గొని రైతులకు యూరియా వినియోగంపై అవగాహన కల్పించారు. యూరియాను సమతుల్యంగా, అవసరానికి అనుగుణంగా వాడాలని సూచించారు. అలాగే ప్రస్తుత మార్కెట్ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని సన్నరకం వంటి వరి రకాల సాగు చేయాలని రైతులకు సూచించారు.
JN: ఈనెల 10వ తేదీన జరిగే ప్రధానమంత్రి మోడీ బహిరంగ సభను విజయవంతం చేయాలని పాలకుర్తి మండల BJP అధ్యక్షుడు రవికుమార్ కోరారు. మంగళవారం మండలకేంద్రంలో నిర్వహించిన కార్యకర్తల సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రధానమంత్రి తెలంగాణ అభివృద్ధి ధ్యేయంగా వేల కోట్ల నిధులను మంజూరు చేసి, తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉన్నారని తెలిపారు.