PDPL: మంథని పట్టణ పరిధిలోని గాడుదుల గండి గుట్ట మలుపు వద్ద ఇసుక లారీ బోల్తా పడింది. కొయ్యూరు వైపు నుంచి మంథని వైపు వచ్చే లారీ గుట్ట దిగేటప్పుడు అదుపు తప్పి ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని, లారీ డ్రైవర్‌ను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరిపించుకున్నారు.
SRD: పటాన్‌చెరు నియోజకవర్గం అమీన్‌పూర్ మాజీ కో-ఆప్షన్ సభ్యులు యూనుస్ ఆధ్వర్యంలో మంగళవారం ఇఫ్తార్ విందు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ కోఆర్డినేటర్ ఆదర్శ్ రెడ్డి ఫాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి, రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఇస్లాం మతం శాంతిని బోధిస్తుందన్నారు.
NGKL: వట్టెంలో వెలసిన శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయ బ్రహ్మోత్సవాలు అత్యంత వేడుకగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం యజ్ఞాచార్యులు సముద్రాల శ్రీమన్నారాయణ చార్యుల ఆధ్వర్యంలో వేద మంత్రోచ్ఛరణల మధ్య గరుడ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఉత్సవమూర్తులకు పల్లకి సేవ నిర్వహించి, భక్తులకు గరుడ ప్రసాదాన్ని పంపిణీ చేశారు.
VSP: రాష్ట్ర వినియోగదారుల సంఘాల సమైక్య వైస్ ఛైర్మన్‌గా విశాఖకు చెందిన పేర్ల భాస్కరరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. విజయవాడలో నిర్వహించిన నూతన కార్యవర్గ ఎన్నికల్లో 29 జిల్లాల ప్రతినిధులు పాల్గొన్నారు. అలాగే ఆర్గనైజింగ్ సెక్రటరీగా పంపాన వెంకటేశ్వరరావు ఎంపికయ్యారు.
AKP: ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్ సంయుక్తంగా చేస్తున్న దాడులను తక్షణమే ఆపేయాలని భారత సాంస్కృతిక సహకార స్నేహ సంఘం రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి ఎం ఎ. మాధవరావు డిమాండ్ చేశారు. మంగళవారం ప్రపంచం శాంతిని కోరుతూ అనకాపల్లి పట్టణం సీపీఐ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. అనంతరం యుద్ధంలో కన్నుమూసిన మానవాళికి అశ్రృ నివాళులర్పించారు.
KNR: శంకరపట్నం మండలం కొత్తగట్టు కాంగ్రెస్ గ్రామ యూత్ అధ్యక్షుడు ఎడ్ల రాజు (35) అనారోగ్యానికి గురయ్యారు. కుటుంబ సభ్యులు కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యం అందిస్తుండగా, చికిత్స పొందుతూ ఆయన మంగళవారం మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. యువ నాయకుడు మృతి చెందడంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు యూత్ కాంగ్రెస్ జెండా కప్పి అంత్యక్రియలు నిర్వహించారు.
SRPT: సంక్షేమ పథకాలు ప్రతి అర్హుడికి అందేలా బీఆర్ఎస్ కార్యకర్తలు కృషి చేయాలని హుజూర్నగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ గుగులోతు వేముల నాయక్ అన్నారు. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సహకారంతో గరిడేపల్లి మండలంలోని గారకుండా తండా గ్రామపంచాయతీ పరిధిలో వికలాంగుడైన శంకర్‌కు ఆయన స్కూటీ అందజేశారు.
MNCL: కోటపల్లి మండలంలోని అన్నారం గ్రామంలో మంగళవారం జరిగిన అగ్నిప్రమాదం బాధాకరమని పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ అన్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే స్పందించి స్థానిక ఎస్సైతో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలకు తక్షణ సహాయం అందించేందుకు అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ పరంగా సహాయాన్ని అందించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
E.G: కడియంలో వాటర్ ట్యాంక్ మరమ్మతుల కారణంగా మార్చి 4 నుంచి మూడు రోజుల పాటు నీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు కార్యదర్శి శ్రీనివాసరెడ్డి మంగళవారం తెలిపారు. అయితే ఉదయం వేళ గోదావరి నీరు అందుబాటులో ఉంటుందని, అత్యవసరమైతే ట్యాంకర్ల ద్వారా నీరు పంపిస్తామని చెప్పారు. కావున ప్రజలు ఈ మార్పును గమనించి తమకు సహకరించాలని కోరారు.
ASF: తిర్యాణి మండలంలో SP నితికా పంత్ ఆదేశాల మేరకు మంగళవారం పోలీసులు విస్తృతంగా వాహన తనిఖీలు చేపట్టారు. కమ్యూనిటీ పోలీసింగ్‌లో భాగంగా SI వెంకటేష్ ఆధ్వర్యంలో డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించారు. మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించి పోలీసులకు సహకరించాలని కోరారు.
TG: రాష్ట్రంలో విద్యావ్యవస్థలో నెలకొన్నఅవ్యవస్థ, పరిపాలనలో చోటుచేసుకుంటున్న వైఫల్యాలపై BRS ఎమ్మెల్సీ దాసోజ్ శ్రవణ్‌కుమార్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఉస్మానియా ‘లా’ పరీక్షల నిర్వహణలో రేవంత్ సర్కార్ ఘోర వైఫల్యం చెందిందని.. ఒకే పేపర్‌తో రెండు పరీక్షలా..? అంటూ రేవంత్ సర్కార్‌పై మండిపడ్డారు.
కడప నగరంలో గంజాయి సేవనం, బహిరంగ మద్యపానం, అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులు ప్రత్యేక దాడులు చేపట్టారు. ఎస్పీ విశ్వనాథ్ ఆదేశాల మేరకు డీఎస్పీ వెంకటేశ్వర్లు పర్యవేక్షణలో టూ టౌన్ సీఐ ప్రసాదరావు ఆధ్వర్యంలో స్పెషల్ పార్టీ సిబ్బంది డ్రోన్ కెమెరాలతో నిఘా ఉంచి అనుమానితులను గుర్తిస్తున్నారు. చట్టవ్యతిరేక చర్యలకు కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
NRML: ఖానాపూర్ మండలంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఖానాపూర్ మండలంలోని బీర్నంది శివారులో గల వ్యవసాయ బావిలో కారు అదుపుతప్పి బావిలో పడిపోవడంతో కడెం మండలంలోని నర్సాపూర్ గ్రామానికి చెందిన గ్రోమోర్ మేనేజర్ శ్రీనివాస్ అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
KMM: రెండు వేర్వేరు గంజాయి కేసుల్లో నిందితుడికి ఒక్కొక్క కేసులో ఏడాది జైలు శిక్ష, రూ.10 వేల జరిమానా విధిస్తూ మొదటి అదనపు జిల్లా,సెషన్స్ కోర్టు న్యాయమూర్తి ఉమాదేవి తీర్పు చెప్పారు. పెనుబల్లి(M)నికి చెందిన వ్యాపారి బోయిన వెంకటరమణ (62) పై 2024, 2025లో V.Mబంజరా పోలీస్ తనిఖీలలో గంజాయితో పట్టుబడ్డాడు. ఈరోజు కోర్టులో హాజరు పరచగా పై విధంగా తీర్పునిచ్చారు.
NLG: మర్రిగూడ మండలం చర్లగూడెం (శివన్న గూడెం) శ్రీ నీలకంఠ రామ స్వామి బ్రహ్మోత్సవాలను నిర్వాహకులు మంగళవారం ఘనంగా నిర్వహించారు ఆలయ కమిటీ చైర్మన్ సిరి ప్రగడ ఆనందరావు ఆధ్వర్యంలో స్వామి వారి రథోత్సవాన్ని పురోహితుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. అదేవిధంగా శివన్నగూడ గ్రామ సర్పంచ్ రాపోలు యాదగిరి సమక్షంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.