KRNL: కృష్ణగిరి మోడల్ స్కూల్లో నేడు ఆరో తరగతి ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ నిర్మలాకుమారి ఓ ప్రకటనలో తెలిపారు. పరీక్షకు సంబంధించి 113 మంది విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నారన్నారు. విద్యార్థులు ఉదయం 9 గంటలలోపు పాఠశాలకు చేరుకోవాలని, పరీక్ష ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటుందని, హాల్టికెట్, ఆధార్‌తో రావాలన్నారు.
CTR: జిల్లాలోని ఏపీ మోడల్ స్కూల్‌లో ఆరవ తరగతి ప్రవేశానికి ఇవాళ ఎంట్రన్స్ ఎగ్జామ్ నిర్వహిస్తున్నట్లు డీఈవో రాజేంద్రప్రసాద్ తెలిపారు. ఇందుకోసం మొత్తం 7 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు నిర్దేశించిన సమయాన్ని కంటే అర్దగంట ముందుగా చేరుకోవాలని చెప్పారు. పరీక్షా కేంద్రాల వద్ద అన్ని ఏర్పాట్లు చేశామన్నారు.
ATP: అమరావతి రాజధాని పేరుతో సీఎం చంద్రబాబు ప్రభుత్వం భారీ దోపిడీకి పాల్పడుతోందని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి విమర్శించారు. కేంద్రీకృత అభివృద్ధి వల్ల రాయలసీమ ప్రాజెక్టులకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రాప్తాడులో పేరూరు డ్యాంకు నీళ్లు రాకుండా ఎమ్మెల్యే పరిటాల సునీత అడ్డుకుంటున్నారని ఆరోపించారు.
KKD: ప్రభుత్వాల ఆదేశాల మేరకు సామర్లకోటలో పేద ప్రజలు, వలస కూలీలకు చోటా సిలిండర్లను అందిస్తున్నట్లు గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు శనివారం తెలిపారు. గ్యాస్ సిలిండర్ కొరత కారణంగా కార్మికులు పేద ప్రజలు ఇబ్బందులకు గురవుతున్న తరుణంలో ప్రధాన గ్యాస్ కంపెనీలు ఐదు కేజీల సిలిండర్లు సరఫరా చేపట్టాయి. ఏదేని ఒక గుర్తింపు ఉంటే ఐదు కేజీల సిలిండర్‌ను అందిస్తామన్నారు.
W.G: రాష్ట్రంలో త్వరలో నంది అవార్డులు, నంది నాటకోత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్లు సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేశ్ ప్రకటించారు. పాలకొల్లులోని అల్లూరి సీతారామరాజు నేషనల్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ శిక్షణ తరగతులను ఆయన ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ.. తెలుగు సంస్కృతిలో భాగమైన రంగస్థల కళలను ప్రోత్సహించేందుకు నాటకోత్సవాలను నిర్వహిస్తామన్నారు.
ప్రకాశం: కంభం మండలం రావిపాడు గ్రామంలో మద్యం మత్తులో తిరుగుతున్నాడని అడపాల గోపాల్ అనే వ్యక్తిని గ్రామస్తులు కొందరు చితకబాదారు. దీంతో గోపాల్‌కు గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం కంభం ప్రభుత్వ వైద్యశాలకు తీసుకొని వెళ్ళగా డాక్టర్ ప్రథమ చికిత్స చేసి చెవుల నుంచి రక్తం వస్తున్నదని, మెరుగైన వైద్యం కోసం మార్కాపురం ప్రభుత్వ వైద్యశాలకు పంపారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
ఎన్టీఆర్: విజయవాడలో ఆదివారం మాంసం ధరలు సామాన్యులకు భారంగా మారాయి. చికెన్ స్కిన్‌లెస్ కేజీ రూ.220 పలుకుతుండగా, మటన్ కేజీ రూ.900కు చేరింది. చేపలు రకాన్ని బట్టి కిలో రూ.220 వరకు విక్రయిస్తున్నారు. 30 కోడి గుడ్ల ధర రూ.135గా ఉంది. సెలవు రోజు కావడంతో మార్కెట్ల వద్ద రద్దీ కనిపిస్తున్నప్పటికీ, పెరిగిన ధరలపై వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
SKLM: అకాల వర్షానికి నష్టపోయిన టమాటా రైతులను ఆదుకోవడానికి చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అశోక్ బాబు అన్నారు. శనివారం కంచిలి M బెంకిలి, జింకి భద్ర, పలాసపురం పంచాయతీల పరిధిలో నష్టం జరిగిన టమాటా పంట పొలాలను పరిశీలించారు. సమస్యను రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు దృష్టికి తీసుకెళ్లి పరిహారం అందేలా చర్యలు చేపడతామన్నారు.
AKP: కసింకోట మండలం విసన్నపేటలో గౌరీ పార్వతి కిరాణా దుకాణంలో రూ. 69,000 నగదును దొంగలించిన ఘటనలో ఇద్దరు వ్యక్తులను శనివారం అరెస్టు చేసినట్లు ఎస్సై మనోజ్ కుమార్ తెలిపారు. అదే గ్రామానికి చెందిన డీ.నవీన్, ఎన్. వీరబాబు కలిసి దొంగతనానికి పాల్పడినట్లు గుర్తించామన్నారు. వీరిని శనివారం అరెస్టు చేసి దొంగలించిన నగదును స్వాధీనం చేసుకున్నామన్నారు.
VZM: రాష్ట్రంలో వివిధ కోర్టులలో సివిల్ జడ్జ్ సీనియర్ డివిజన్‌లుగా పనిచేస్తున్న15 మందికి జిల్లా సెషన్స్ జడ్జిలుగా పదోన్నతి కల్పించారు. ఈ మేరకు చీపురుపల్లికి చెందిన బంకపల్లి నిర్మలకు విజయనగరం జిల్లా సెషన్స్ జడ్జిగా పదోన్నతి లభించింది. దీనిపై గ్రామస్థులతో పాటు పలువురు హర్షం వ్యక్తం చేశారు. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో జడ్జిగా పని చేస్తున్నారు.
NDL: యాగంటి ఉమామహేశ్వరస్వామి ఆలయాభివృద్ధిపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది. సౌకర్యాలు లేక భక్తులు అవస్థలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి BC జనార్దన్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని నిధులు మంజూరు చేయించారు. వాహనాల పార్కింగ్ కోసం ఇటీవల 8ఎకరాలు అభివృద్ధి చేశారు. తాజాగా విడుదలైన రూ.5.8 కోట్లతో పలు అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు.
SS: రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమం, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్. సవిత అమరావతిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కలిశారు. తన శాఖల ద్వారా అమలవుతున్న వివిధ సంక్షేమ పథకాలు, భవిష్యత్ కార్యాచరణపై సీఎంతో చర్చించారు. ప్రభుత్వం చేపట్టిన ‘జలధార’, ‘స్వచ్ఛాంధ్ర’ వంటి కార్యక్రమాల్లో మంత్రులంతా భాగస్వామ్యం కావాలని సీఎం సూచించారు.
KKD: మాజీ ఆర్థిక మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడుని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పరామర్శించారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యుల సూచన మేరకు యనమలకు స్టంట్ వేయించగా, ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు శనివారం ఫోన్ ద్వారా యనమల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు.
ATP: అనంతపురం నగరంలో మైనర్ డ్రైవింగ్ అరికట్టేందుకు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. అర్బన్ డీఎస్పీ వి.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మైనర్ల తల్లిదండ్రులకు పరేడ్ మైదానంలో కౌన్సెలింగ్ నిర్వహించారు. గత పది రోజుల్లో 215 మంది మైనర్లను గుర్తించి ఈ అవగాహన కల్పించారు. చిన్న వయసులో వాహనాలు ఇవ్వడం వల్ల ప్రాణాపాయం ఉంటుందని డీఎస్పీ హెచ్చరించారు.
ELR: పీఆర్ 126 రకం ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్ కోరారు. శనివారం భీమడోలు మండలం గుండుగొలను కొనుగోలు కేంద్రం వద్ద ఎమ్మెల్యే ధర్మరాజును రైతుసంఘం నాయకులు కలిసి సమస్యలు వివరించారు. పీఆర్ 126 రకం అధిక దిగుబడులు ఇస్తుందని, రైతులు సాగు చేస్తున్నప్పటికీ కొనుగోలు నిలిపివేయడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు.