శ్రీకాకుళం జిల్లాలో మహిళల భద్రతను బలోపేతం చేయడం, సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన పెంపొందించడమే లక్ష్యంగా ఆదివారం రాత్రి జిల్లాలో పలు పోలీస్ స్టేషన్ పరిధిలో “నారి శక్తి” కార్యక్రమాలు నిర్వహించారు. పోలీసులు గ్రామాల్లో సమావేశాలు నిర్వహించి మహిళలు, యువతతో ముచ్చటించారు. అపరిచిత లింకులు క్లిక్ చేయకూడదని, అనుమానాస్పద కాల్స్‌కు స్పందించవద్దని వివరించారు.
VZM: జిల్లా ఎస్పీ ఆదేశాలతో బాణాసంచా పేలుడు దృష్టిలో పెట్టుకొని కొత్తవలస సీఐ షణ్ముఖరావు, ఎస్సై జోగారావుతో కలసి ఆదివారం తనిఖీలు నిర్వహించారు. బాణాసంచా లైసెన్స్, పరిమితి, బాణాసంచా తయారుచేసే విధానాన్ని సిబ్బంది వివరాలు, సీసీ కెమెరాల పనితీరును పరిశీలించి, యాజమాన్యానికి పలు సూచనలు చేశారు. పరిమితి కంటే నిల్వలు ఉంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
TPT: పదో తరగతి విద్యార్థులకు రానున్న 16 నుంచి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో సోమవారం నుంచి గ్రాండ్ టెస్టులు ప్రారంభమయ్యాయి. ఇవి 12వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. ముఖ్యంగా పదో తరగతి విద్యార్థులకు సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నలను ఈ పరీక్షల ద్వారా విద్యార్థులకు సందిగ్ధత లేకుండా అవగాహన కల్పించనున్నారు.
KDP: రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టును తక్షణమే పూర్తి చేయాలని కడప ఎంపీ YS అవినాష్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం కడప మేడా కన్వర్షన్ హాలులో రాయలసీమ లిఫ్ట్ రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఆయన మాట్లాడుతూ 90% పూర్తయిన రాయలసీమ లిఫ్ట్‌ను కావాలనే ఆపేశారని ఆరోపించారు. పోలవరం స్పీల్ వే వరకు పూర్తి చేస్తే, పోలవరం ఆశలను సైతం చంద్రబాబు సమాధి చేశారన్నారు.
NLR: మాజీమంత్రి కాకాణి తనపై అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి అన్నారు. కాకాణి గోవర్ధన్రెడ్డిది కాకిగోల అని విమర్శించారు. నిద్రపట్టక పిచ్చి కూతలు కూస్తున్నారని ఎద్దేవా చేశారు. కాకాణి మంత్రిగా సంపాదించిన అక్రమ సంపాదనను తాను బయటపెట్టానని అన్నారు. మొదటి నుంచి నిరాధార ఆరోపణలు చేయడం ఆయనకు పరిపాటిగా మారిందని సోమిరెడ్డి మండిపడ్డారు.
ఏలూరులో దేవ తెలకుల రాష్ట్ర సంఘం కార్యదర్శి కాశిన సత్యనారాయణ ఆదివారం మీడియా సమావేశం నిర్వహించారు. మండపేట (M) ద్వారపూడిలో జరిగిన పరువు హత్యలో తమ సామాజిక వర్గానికి చెందిన సూర్యప్రకాష్ అన్యాయంగా బలయ్యాడని ఆవేదన వ్యక్తం చేశారు. మృతికి బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించి, బాధిత కుటుంబానికి రూ. కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ATP: కూడేరు మండలంలోని పెన్నహోబిళం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లో నీటి మట్టం క్రమంగా తగ్గుతోంది. ఆదివారం నాటికి జలాశయంలో 3.75 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ఇరిగేషన్ అధికారులు తెలిపారు. హంద్రీనీవా నుంచి 300 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండగా, ధర్మవరం కాలువ, తాగునీటి ప్రాజెక్టులకు కలిపి 685 క్యూసెక్కుల అవుట్ ఫ్లో కొనసాగుతోంది.
GNTR: రాజధాని అమరావతిలో రూ. 210 కోట్లతో నిర్మించిన హైకోర్టు న్యాయమూర్తుల నివాసాలను సుప్రీంకోర్టు సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ ఆదివారం ప్రారంభించారు. అదే విధంగా, హైకోర్టు అతిథి గృహం, జ్యూడిషియల్ అకాడమీ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ తదితరులు పాల్గొన్నారు.
కోనసీమ: యానాంలో శ్రీ భూ సమేత మీసాల వేంకటేశ్వర స్వామి రథోత్సవం సోమవారం అత్యంత వేడుకగా జరగనుంది. చారిత్రక నేపథ్యం ఉన్న ఈ ఆలయం నుంచి న్యూ బస్టాండ్ వరకు స్వామివారి రథయాత్ర సాగనుంది. మీసాలతో దర్శనమిచ్చే స్వామివారిని దర్శించుకునేందుకు పరిసర ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలిరానున్నారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు
KRNL: పెద్దకడబూరులో ఆదివారం ప్రమాదవశాత్తు గడ్డివాము దగ్ధమై సుమారు రూ. 50,000 మేర నష్టం సంభవించింది. గ్రామానికి చెందిన కోటేకల్లు రాజన్న రైతు ZPHS పాఠశాల సమీపంలో తన వృషభాల కోసం నిల్వ ఉంచిన గడ్డికి అకస్మాత్తుగా మంటలు అంటుకుని పూర్తిగా కాలిపోయింది. ఏఎస్ఐ శివరాములు పోలీసు సిబ్బందితో ఇతర గడ్డివాములకు మంటలు వ్యాపించకుండా మంటలను ఆర్పేశారు.
ప్రకాశం: గిద్దలూరు పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో సోమవారం ప్రజా దర్భార్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఏమ్మెల్యే అశోక్ రెడ్డి తెలిపారు. ప్రజా సమస్యలను స్వయంగా ఎమ్మెల్యే తెలుసుకొని అర్జీలను స్వీకరిస్తారు. కావున గిద్దలూరు నియోజకవర్గంలోని ప్రజలు ఈ ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని సద్వినియోగపరుచుకోవాలని ఆయన కోరారు.
PLD: అంగన్‌వాడీలకు న్యాయం చేసింది చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీ ప్రభుత్వమేనని చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. అంగన్‌వాడీల 9 ప్రధాన డిమాండ్లను కూటమి ప్రభుత్వం నెరవేర్చిందని గుర్తు చేశారు. రూ. 75 కోట్లతో 58 వేలకు పైగా సిబ్బందికి 5G స్మార్ట్‌ఫోన్లు అందజేసి, వారిని స్మార్ట్ వర్క్ వైపు మళ్లించామని ఆయన పేర్కొన్నారు.
TPT: చంద్రగ్రహణం నేపథ్యంలో తిరుపతి జిల్లాలోని అన్ని ఆలయాలు మూసివేయనున్నారు. తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు TTDకి చెందిన కపిలతీర్థం, శ్రీనివాసమంగాపురం, తిరుచానూరు, అప్పలాయగుంట, సూళ్లూరుపేట చెంగాళమ్మ ఆలయాలను మంగళవారం ఉదయం 9 గంటలకు క్లోజ్ చేస్తారు. రాత్రి 7:30కి తెరిచి శుద్ధి చేస్తారు. శ్రీకాళహస్తి ఆలయం ఒక్కటే తెరిచి ఉంచుతారు.
AKP: భవన నిర్మాణ కార్మికులకు ఈనెల 9వ తేదీ నుంచి కొత్త రేట్లు అమలులోకి రానున్నట్లు పాయకరావుపేట తాపీ మేస్త్రీల సంఘం అధ్యక్షుడు ఎం నారాయణ రావు తెలిపారు. ఆదివారం స్థానిక సంఘం కార్యాలయంలో కార్మికులతో సమావేశం ఏర్పాటు చేసి కరపత్రాలను విడుదల చేశారు. తాపీ మేస్త్రికి రోజుకు రూ.900, మగ కూలికి రూ.750, పడ కూలికి రూ.600 చెల్లించాలన్నారు.
CTR: చిత్తూరు కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదివారం తెలిపారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కలెక్టరేట్‌లోని నూతన సమావేశపు మందిరంలో ఈ కార్యక్రమం ఉంటుందన్నారు. జిల్లా అధికారులు తప్పక హాజరుకావాలని ఆదేశించారు.