CTR: వి.కోట మండల కేంద్రంలో ఆదివారం తేనెటీగల దాడిలో 20 మంది గాయపడ్డారు. వి.కోటకు చెందిన వెంకటరమణ కుటుంబ సభ్యులు స్థానిక మునీశ్వరస్వామి ఆలయం వద్ద మునిదేవర కార్యక్రమం నిర్వహిస్తున్న సమయంలో చెట్టుపై ఉన్న తేనెటీగలు అగరబత్తుల పొగకు ఒక్కసారిగా రెచ్చిపోయి అక్కడున్న వారిపై దాడి చేశాయి. గాయపడిన వారిని చికిత్స కోసం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
W.G: తాడేపల్లిగూడెం మండలం ఆరుగొలను డాక్టర్ బీ.ఆర్ అంబేడ్కర్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 5వ తరగతి, జూనియర్ ఇంటర్, ఐఐటీ-నీట్ తర్ఫీదు ఇచ్చే కళాశాలలో ప్రవేశానికి ఆదివారం పరీక్ష నిర్వహించారు. ఐదవ తరగతికి 66మందికి గాను 49 మంది, జూనియర్ ఇంటర్ లో 95 మందికి గాను 89, ఐఐటీ-నీట్ 81మందికి గాను 76మంది మొత్తం 214మంది హాజరైనట్టు ప్రిన్సిపల్ ఎం. దుర్గారావు వివరించారు.
కోనసీమ: జిల్లా పెన్షనర్స్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీగా మామిడికుదురు మొగలికుదురుకు చెందిన అబ్దుల్ మున్నీర్ ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. అమలాపురంలోని పెన్షనర్స్ భవనంలో ఆదివారం జరిగిన ఈ సమావేశంలో తనను జాయింట్ సెక్రటరీగా ఎన్నుకొన్నట్లు ఆయన తెలిపారు. సంఘం అభివృద్ధికి పెన్షనర్స్ సంక్షేమం కొరకు తన వంతు కృషి చేస్తానని మున్నీర్ పేర్కొన్నారు.
SKLM: నియోజకవర్గ కేంద్రం పాతపట్నం ప్రధాన రహదారి పక్కన కొలువైయున్న శ్రీ పాతపట్నం నీలమణి అమ్మవారు చతుర్దశి సోమవారం ప్రత్యేక అలంకరణతో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శించేందుకు వందలాదిమంది భక్తులు తెల్లవారుజామున దర్శించి ప్రత్యేక పూజలు చేపట్టారు. దేవదాయ శాఖ పరిశీలనలో కార్యక్రమాలు జరిగాయి.
TPT: తిరుపతి కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు అధికారులు అర్జీలు స్వీకరించి, ప్రజల సమస్యలను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటారని పేర్కొన్నారు. జిల్లా వాసులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు.
KRNL: చరిత్రలో తొలిసారిగా అంగన్వాడీలకు రెండుసార్లు వేతనాలు పెంచిన ఘనత సీఎం చంద్రబాబు నాయుడుకే దక్కుతుందని ఎమ్మెల్యే గిత్త జయసూర్య ఆదివారం పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అంగన్వాడీ కేంద్రాలకు మౌలిక సదుపాయాలు కల్పించి, ప్రతి కేంద్రానికి నిధులు కేటాయించిందన్నారు. కార్యకర్తలకు స్మార్ట్ ఫోన్లు అందజేశామని తెలిపారు.
బద్వేల్ లక్ష్మిపాలెంలో మూడవ రోజు నిర్వహిస్తున్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు భక్తి శ్రద్ధల మధ్య ఆదివారం ఘనంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారు సింహ వాహనంపై అలంకారప్రదంగా దర్శనం ఇచ్చి భక్తులను అనుగ్రహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన భరతనాట్యం ప్రదర్శనలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
NDL: డోన్ పట్టణంలో అనారోగ్యంతో నడవలేని స్థితిలో ఉన్న హుస్సేన్పిర కుటుంబానికి చేయూత స్వచ్ఛంద సేవా సమితి ఆధ్వర్యంలో రూ. 25 వేల ఆర్థిక సహాయం అందించారు. డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డా. రాజేంద్రప్రసాద్ రెడ్డి, యశోద హాస్పిటల్ అధినేత డా. సుంకన్న, చంద్రశేఖర్ ఈ సహాయాన్ని ఆదివారం అందజేశారు. ఆపదలో ఉన్నవారికి చేయూతనివ్వాలని దాతలు పిలుపునిచ్చారు.
KRNL: ఉమ్మడి కర్నూలు జిల్లాలోని శ్రీశైలం, మహానంది, యాగంటి, కొత్తూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తదితర ఆలయాలను చంద్రగ్రహణం కారణంగా రేపు వేకువజాము నుంచి మూసివేస్తున్నట్లు ఈవోలు తెలిపారు. శ్రీశైలంలో రేపు రాత్రి 9కి భక్తులకు దర్శనం కల్పిస్తారు. మిగతా ఆలయాల్లో బుధవారం వేకువజామున సంప్రోక్షణ, శుద్ధి కార్యక్రమాలు చేపడతారు.
ATP: గుత్తి మండలం కొత్తపేట గ్రామంలోని చెరువు కట్టపై వెలసిన హజరత్ యాదుల్లాహ్ భాష ఖాదిరి రహమతుల్లా అలైహి 175వ ఉరుసు ఉత్సవాలు సోమవారం భక్తిశ్రద్ధలతో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల సందర్భంగా స్వామివారికి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. స్వామివారి గ్రంధాన్ని గ్రామంలో ఊరేగింపు నిర్వహించి స్వామికి సమర్పించారు.
ELR: పడమటిపాలెం మెయిన్ రోడ్డు వెంబడి ఉన్న నిద్రగన్నేరు చెట్టుకు ఆదివారం సాయంత్రం ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న కైకలూరు ఫైర్ ఆఫీసర్ క్రాంతికుమార్ సిబ్బందితో చేరుకుని మంటలను అదుపు చేశారు. ఎవరైనా నిర్లక్ష్యంగా పొగతాగి విసిరేయడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.
E.G: గతంలో వైసీపీకి ఓటు వేసిన వేలాదిమంది 2024లో తన గెలుపుకు కృషి చేశారని అనపర్తి MLA నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆదివారం పేర్కొన్నారు. కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం కాంట్రాక్టర్లకు నిధులు ఇవ్వలేదని, ప్రస్తుతం స్వయంగా CM దృష్టికి తీసుకెళ్లి అభివృద్ధి పనులు కొనసాగిస్తున్నామని వెల్లడించారు.
AKP: నక్కపల్లి మండలం ఉపమాక వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి పండిత సదస్యం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో కళ్యాణ వేదికపై ఉభయదేవేరులను అదిష్టింప చేసి ప్రత్యేక పూజలు చేసి హారతులు ఇచ్చారు. ప్రధాన అర్చకులు ప్రసాదాచార్యులు ఆధ్వర్యంలో పలువురు వేతపండితులను ఘనంగా సత్కరించారు.
శ్రీకాకుళం నగరంలో ఆదివారం నాటికి మొత్తం కేసుల సంఖ్య 214కు చేరినట్లు వైద్యారోగ్యశాఖ అధికారులు ప్రకటించారు. 116 మంది కోలుకుని ఇంటికి చేరుకోగా ప్రస్తుతం 94 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. డయేరియా ప్రభావిత ప్రాంతాలలో ఇప్పటి వరకు 135 కేసులు నమోదైనట్లు, 89 మంది పూర్తిగా కోలుకున్నారని పేర్కొన్నారు.
VZM: అంగన్వాడీల వర్కర్స్,హెల్పర్స్ సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని చీపురుపల్లి ఎమ్మెల్యే కళా వెంకటరావు తెలిపారు.గత ప్రభుత్వాల హయాంలో రెండుసార్లు అంగన్‌వాడీల జీతాలు పెంచిన ఘనత సీఎం చంద్రబాబు నాయుడు ప్రభుత్వానిదే అన్నారు. అంగన్‌వాడీ కార్యకర్తలకు 50 కోట్ల రూపాయలతో G5 స్మార్ట్‌ఫోన్‌లు అందించారు. ఆధునీకరణకు 50 కోట్లు మంజూరు చేశారని అన్నారు.