AKP: ఎస్.రాయవరం మండలం పెదగుమ్ములూరులో పునర్నిర్మించిన నూకాంబిక అమ్మవారి ఆలయ విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. గ్రామంలో అమ్మవారి విగ్రహాన్ని సాంస్కృతిక కార్యక్రమాల మధ్య ఊరేగించి, మహిళలు కలశాలతో భక్తిశ్రద్ధతో పాల్గొన్నారు. మాజీ ఎంపీపీ ఏజెర్ల వినోద్ రాజు, గ్రామ పెద్దలు నవీన్ రాజు తదితరులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.
KRNL: మాజీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మంగళవారం వైసీపీ నేత జోగి రమేశ్ నివాసానికి వెళ్లారు. ఇటీవల జోగి రమేష్ ఇంటిపై జరిగిన దాడి వివరాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. అనంతరం బుగ్గన మాట్లాడుతూ.. అన్యాయంగా కేసులు నమోదు చేయడం, ఇంటిపై దాడికి పాల్పడటం అత్యంత హేయమైన చర్యని పేర్కొన్నారు. ఇలాంటి దాడులు ప్రజాస్వామ్యానికి విరుద్ధమని హెచ్చరించారు.
CTR: చిత్తూరు తాలూకా పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న ఏఎస్ఐ మనోహరన్ హఠాన్మరణం చెందారు. విధులకు వెళ్తూ దారిలో ఆయన కళ్లు తిరిగి కిందపడిపోయారు. చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా, పరిస్థితి విషమించడంతో అక్కడ నుంచి తిరుపతి రూయాకు తరలించారు. తిరుపతిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కొన్ని నెలలుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నట్లు సమాచారం.
W.G: కులం పేరుతో దూషించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మోటుపల్లి రామభాస్కరరావుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు మొగల్తూరు ఎస్సై జి. వాసు మంగళవారం తెలిపారు. వారతిప్ప గ్రామంలో మురుగు కాలువ గట్టుపై పాక వేసుకుని నివసిస్తున్న మల్లవరపు యేసు కుటుంబంపై రామభాస్కరరావు దాడి చేసి, కులం పేరుతో దూషించినట్లు బాధితుడు ఫిర్యాదు చేశారు.
NDL: చంద్రగ్రహణం వీడడంతో నందవరం చౌడేశ్వరి మాత భక్తులకు దర్శనమిచ్చారు. బుధవారం తెల్లవారుజామున ఆలయ ఈవో శ్రీనివాసరెడ్డి, ఛైర్మన్ పీవీ నాగార్జున రెడ్డి ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు ఆలయ శుద్ధి, పుణ్యాహవచనం అనంతరం నిత్య పూజలైన రుద్రాభిషేకం, కుంకుమార్చన, మహామంగళహారతి పూజలు చేశారు. అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు.
PLD: కారంపూడి మండలం పెదకోదమగుండ్లలో విద్యుత్ శాఖ నిర్లక్ష్యం వల్ల వికలాంగుడిగా మారిన వర్ల సాగర్ బాబు, న్యాయం కోసం గత 172 రోజులుగా పోరాడుతున్నాడు. తనను ఆదుకోవాల్సింది పోయి, ప్రమాదంతో తమకు సంబంధం లేదని రాతపూర్వకంగా రాసివ్వాలని అధికారులు ఒత్తిడి చేస్తున్నారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. బాధ్యులపై చర్యలు తీసుకుని, తమకు న్యాయం చేయాలని మంగళవారం కోరారు.
తూ.గో: రాజమండ్రి రూరల్ కొంతమూరు సబ్‌స్టేషన్ పరిధిలో RDSS పనుల కోసం బుధవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఈఈ శామ్యూల్ తెలిపారు. అంబేద్కర్ పేట, బ్రాహ్మణ అగ్రహారం, క్వారీ ఏరియా, అఫీషియల్ కాలనీ ప్రాంతాల్లో విద్యుత్ అందుబాటులో ఉండదు. మరమ్మతులు సకాలంలో పూర్తి చేయడానికి వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.
TPT: శ్రీకాళహస్తి మండలం అక్కుర్తి జడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థులు వైష్ణవి, జీవనరేఖ, మీనాక్షి ఇన్‌స్పైర్ అవార్డులకు ఎంపికయ్యారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడం గర్వకారణమని HM జయ కుమారి తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ ప్రతిభావంతులైన విద్యార్థులు ఉన్నారని, సరైన మార్గదర్శకత్వం అందితే అద్భుత విజయాలు సాధిస్తారన్నారు.
VSP: చీపురుపల్లి మండలం సంకుపాలెం నుంచి కరకాం మీదుగా పెరిపి రోడ్డు అధ్వాన్నంగా మారింది. ఈ రోడ్డు మూడు సంవత్సరాలకు పైగా 3.5 కిలోమీటర్ల పొడవున పనులు ప్రారంభించారు. మిగతా పనులు మధ్యలో విడిచిపెట్టడం వల్ల రాళ్లు పైకి తేలుతున్నాయి. ఈ దారి గుండా ప్రయాణించే ప్రయాణికులు, విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ రహదారి పనులు పూర్తి చేయాలని స్థానికులు, వాహనదారులు కోరుతున్నారు.
CTR: చిత్తూరు నగరానికి చెందిన 20 ఏళ్ల యువతి అదృశ్యంపై కేసు నమోదు చేసినట్లు చిత్తూరు రెండో పట్టణ సీఐ నెటికంటయ్య తెలిపారు. స్థానిక రిలయన్స్ మార్ట్‌లో పనిచేస్తున్న యువతి మంగళవారం ఇంట్లో నుంచి వెళ్లి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వివరించారు.
TPT: పెరిమిడి పాండురంగస్వామి ఆలయం వద్ద 84వ సంవత్సర ఆనంద అగ్నిగుండ మహోత్సవాన్ని ఇవాళ నిర్వహిస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు. ప్రతి ఏటా పలుణ మాసం పౌర్ణమి నాడు నిర్వహించే ఈ వేడుకలను ఆదివారం సంప్రదాయ బద్ధంగా ప్రారంభించారు. సోమవారం ధ్వజారోహణ, మంగళవారం కంకణ ధారణ నిర్వహించనట్లు తెలిపారు.
కృష్ణా: గన్నవరం మండలం చిక్కవరంలో పండగపూట విషాద చోటుచేసుకుంది. హోలీ ఆడి చేతులు కడుగుకునేందుకు చెరువు వద్దకు వెళ్లిన ముగ్గురు విద్యార్థులు ప్రమాదవశాత్తు కాలుజారి చెరువులో పడటంతో మృతి చెందారు. మృతులు దుప్పల నవీన్ కుమార్ (11), వెంకట జోసఫ్ (16), సాయి (16)గా గుర్తించారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
VZM: భారత దేశానికి అత్యున్నతమైన రాజ్యాంగాన్ని రచించి ప్రపంచ దేశాలకు ప్రజాస్వామ్య విలువలను తెలియజేసిన ప్రపంచ మేధావి అంబేద్కర్ అని మాజీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్ రావు అన్నారు. జొన్నవలస గ్రామంలో జిల్లా దళిత సమ్మేళన సదస్సులో ఆయన పాల్గొన్నారు. అనంతరం అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు లోగిశ రామకృష్ణ పాల్గొన్నారు.
ASR: పెదబయలు మండలం జామిగూడ పంచాయతీ దుర్గం గ్రామంలో త్రాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. సదుపాయాలు లేక ప్రజలు దూర ప్రాంతాలకు వెళ్లి కాలువల్లోని కలుషిత నీటినే వాడుతున్నట్లు స్థానికులు తెలిపారు. దీనివల్ల మహిళలు, వృద్ధులు, పిల్లలు నానా అవస్థలు పడుతున్నారన్నారు. వేసవిలో ఈ కష్టాలు మరింత పెరిగే ప్రమాదం ఉందని, అధికారులు స్పందించి సురక్షిత త్రాగునీరు అందించాలని గ్రామస్థులు కోరుతున్నారు.