W.G: రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి, నేషనల్ కెరీర్ సర్వీస్ సంస్థ ఆధ్వర్యంలో భీమవరం ఎంపీడీవో కార్యాలయంలో ఈ నెల 28న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి పి.లోకమాన్ తెలిపారు. ఈ మేళాలో 90 మందికి ఉద్యోగ అవకాశం కల్పిస్తామన్నారు. అభ్యర్థులు 10, ఐటీఐ, ఇంటర్, డిగ్రీ, పీజీలలో ఉత్తీర్ణులై ఉండాలన్నారు. 18 నుంచి 35 ఏళ్ల వయసు వారు అర్హులన్నారు.
TG: TET పరీక్ష హాల్ టికెట్లు విడుదలయ్యాయి. https://tgtet2024.aptonline.in/tgtet/ వెబ్సైట్ నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. జనవరి 2 నుంచి 20 వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. అయితే పలు సాంకేతిక సమస్యల వల్ల జనవరి 11 ఉదయం, 20న మార్నింగ్, మధ్యాహ్నం సెషన్లకు హాజరుకానున్న అభ్యర్థుల హాల్ టికెట్లు రేపటి వరకు అందుబాటులో ఉండనున్నట్లు విద్యాశాఖ తెలిపింది.
ఐపీఓకు వచ్చిన ఐదు కంపెనీలు ఇవాళ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయ్యాయి. అందులో మమతా మెషినరీ 147% ప్రీమియంతో రూ.600 వద్ద లిస్ట్ అవగా.. ఇష్యూ ధర రూ.243. ట్రాన్స్ రైల్ లైటింగ్ 37% ప్రీమియంతో రూ.590 వద్ద ట్రేడింగ్ ప్రారంభించగా.. ఇష్యూ ధర రూ.432. కాగా.. డ్యామ్ క్యాపిటల్ అడ్వైజర్స్ 39%, సనాతన్ టెక్స్టైల్స్ 32%, కాంకర్డ్ ఎన్విరో 18% ప్రీమియంతో లిస్ట్ అయ్యాయి.
వరుసగా మూడో రోజు బంగారం ధరల్లో పెరుగుదల నమోదైంది. నిన్నటితో పోల్చితే ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.270 పెరగటంతో రూ.78,000 ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.250 పెరిగి రూ.71,500 ఉంది. కాగా.. కిలో వెండి ధర లక్ష రూపాయలు ఉంది.
విశాఖ నగరంలోని మహారాణిపేట ఎన్ఎసీ కేంద్రంలో ఈ నెల 28వ తేదీన జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి చాముండేశ్వరరావు శుక్రవారం వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జాబ్ మేళా రాష్ట్ర నైపుణ్యం అభివృద్ధి శిక్షణ శాఖ ఆధ్వర్యంలో జరుగుతుందని పేర్కొన్నారు. అనంతరం పలు ప్రైవేటు కంపెనీలు యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నాయని తెలిపారు.
దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 409 పాయింట్లు బలపడి 78,881 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 132 పాయింట్లు లాభపడి 23,883 దగ్గర కొనసాగుతోంది. డాలర్తో పోల్చితే రూపాయి మారకం విలువ 85.34గా ఉంది. కాగా, అంతర్జాతీయంగా మిశ్రమ సంకేతాలు ఉన్నా.. మదుపర్ల కొనుగోళ్ల నేపథ్యంలో సూచీలు లాభాల్లో కొనసాగుతున్నాయి.
KMM: జిల్లాలోని బొమ్మ ఇంజనీరింగ్ కాలేజీలో శనివారం మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కాలేజీ ఛైర్మన్ బొమ్మ రాజేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేళాలో 16కంపెనీల బాధ్యులు పాల్గొని ఉద్యోగాలకు అర్హులను ఎంపిక చేస్తారని వెల్లడించారు. ఈమేరకు 2020 నుండి ఇప్పటి వరకు బీటెక్, బీ పార్మసీ, ఏదైనా డిగ్రీ పూర్తిచేసిన పాల్గొనవచ్చని తెలిపారు.
HYD: జేఎన్టీయూ యూనివర్సిటీ పరిధిలో నేడు జరగబోయే అన్ని పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు యూనివర్సిటీ రిజిస్ట్రార్ వెంకటేశ్వరరావు వెల్లడించారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణించడంతో నేడు యూనివర్సిటీతో పాటు యూనివర్సిటీ అఫిలియేటెడ్ కాలేజీలకు కూడా సెలవు ప్రకటించినట్లు ఆయన తెలిపారు. వాయిదా పడిన పరీక్షలకు సంబంధించి తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని ఆయన అన్నారు.
KNR: శాతవాహన యూనివర్సిటీ పరిధిలో సెమిస్టర్ పరీక్షలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే నేడు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి సంతాప సూచకంగా రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించగా నేటి మొదటి సెమిస్టరు పరీక్షను వాయిదా వేసినట్లు యూనివర్సిటీ అధికారులు తెలిపారు. రేపటి నుంచి జరగాల్సిన యూనివర్సిటీ పరీక్షలు యథావిధిగా జరుగుతాయాన్నారు.
MNCL: బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డిగ్రీ విద్య అభ్యసిస్తూ విద్యా సంవత్సరం పూర్తి చేయకుండా మధ్యలో ఆపేసిన విద్యార్థులు 2, 4, 6వ సెమిస్టర్లలో రీ అడ్మిషన్ పొందడానికి అవకాశం కల్పిస్తున్నామని ప్రిన్సిపల్ శంకర్ తెలిపారు. ప్రిన్సిపల్ మాట్లాడుతూ.. జనవరి 3లోగా కళాశాలలో సంప్రదించి కాకతీయ విశ్వవిద్యాలయం రీ అడ్మిషన్ అనుమతి పొంది విద్యను కొనసాగించవచ్చన్నారు.
W.G: కైకలూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని నైపుణ్య శిక్షణ కేంద్రంలో ఈనెల 28న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి ఎన్.జితేంద్ర గురువారం తెలిపారు. వరుణ్ మోటార్స్, మెడ్స్ ఫార్మసీ వంటి సంస్థల్లో 100 మంది నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు చెప్పారు. పదో తరగతి ఇంటర్, ఐటీఐ, డిగ్రీ, పీజీ, ఫార్మశీ అర్హులు.
PPM: జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పదో తరగతి విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధను కనబరచాలని కలెక్టర్ ఏ.శ్యామ్ ప్రసాద్ మండల విద్యా శాఖాధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాలు నుంచి కలెక్టర్ ఎంఈవోలతో సమీక్షించారు. ప్రతి ఏడాది లానే ఈ ఏడాది కూడా పదో తరగతి ఉత్తీర్ణతలో జిల్లా ప్రథమ స్థానంలో నిలవాలని అన్నారు.
KDP: ఈనెల 30 నుంచి జరగాల్సిన యోగి వేమన యూనివర్సిటీ, అనుబంధ పీజీ కళాశాల మొదటి సెమిస్టర్ పరీక్షలు 2025 జనవరి 21వ తేదీ నుంచి జరుగుతాయని ప్రిన్సిపాల్ ఎస్ రఘునాథరెడ్డి తెలిపారు. విద్యార్థుల ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ మార్పు చేశామన్నారు. MA, Mcom, Msc, Mped పస్ట్ సెమిస్టర్ల విద్యార్థులు ఈ మార్పును గమనించాలని సూచించారు.
ప్రకాశం: సంతనూతలపాడులో నిరుద్యోగ మహిళలకు బ్యూటీషియన్ కోర్సుల్లో ఉచిత శిక్షణ అందిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి జె. రవితేజ యాదవ్ తెలిపారు. 15 నుంచి 45 ఏళ్లలోపు మహిళలు మూడు నెలల పాటు తర్ఫీదునిస్తామన్నారు. దీన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పూర్తి వివరాలకు 99630 05209ను సంప్రదించాలని కోరారు.
SKLM: సీతంపేట ఐటీడీఏ పరిధిలోని భామిని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్లో గెస్ట్ టీచరు పోస్ట్ ఖాళీ ఉందని ఐటీడీఏ పీవో సీ.యశ్వంత్ కుమార్ రెడ్డి ప్రకటనలో తెలిపారు. 2024-25 విద్యా ఏడాదికు PGT-ఎకనామిక్స్ గెస్ట్ టీచర్ అవసరమన్నారు. అభ్యర్థులు ఈ నెల 30వ తేదీన సీతంపేట ఏపీ టీ డబ్ల్యూ ఆర్జేసీ బాలుర పాఠశాలలో సంబంధిత ఒరిజినల్ సర్టిఫికెట్స్తో హాజరవ్వాలన్నారు.