అంగవైకల్యం ఉన్నా పట్టుదలతో విజయాలు సాధించినవారు చాలా మంది ఉన్నారు. పట్టుదలతో సాధన చేసి అసాధ్యాలను సుసాధ్యం చేసిన వారూ ఉన్నారు. అలాంటి వారిలో జియాన్ క్లార్క్ కూడా ఒకరని చెప్పాలి. జియాన్ క్లార్క్ అంగవైకల్యంతో పుట్టినా ఎప్పుడూ కూడా తన వైకల్యాన్ని చూసి కుంగిపోలేదు. నిత్యం తన చేతులతో సాధన చేస్తూనే ఉన్నాడు. అలా సాధన చేస్తూ అత్యంత వేగంగా పరుగెత్తి గిన్నీస్ రికార్డును సాధించాడు. తాజాగా జియాన్ క్లార్క్ ప్రతిభకు సంబంధించిన వీడియోను గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ వాళ్లు తమ అధికారిక ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు.
అమెరికాలోని ఒహియో స్టేట్ లోని కోలంబస్ ప్రాంతానికి చెందిన క్లార్క్ పుట్టుకతోనే వైకల్యంతో పుట్టాడు. కయుడాల్ రిగ్రెసిస్ సిండ్రోమ్ అనే పరిస్థితి కారణంగా అతని నడుము కింది భాగం లేకుండా పోయింది. దీంతో పుట్టిన వెంటనే అతన్ని తల్లిదండ్రులు వదిలివేశారు. దీంతో క్లార్క్ ఒహియో ఓ ఆశ్రమంలో పెరిగాడు. కొంతకాలానికి అతడ్ని అమెరికన్ స్టాక్ మార్కెట్ నిపుణురాలు అయిన కింబర్లీ హాకిన్స్ దత్తత తీసుకుని పెంచారు. చేతుల సాయంతో హాకిన్స్ అద్భుతాలు చేస్తూ నేడు గిన్నిస్ రికార్డును సాధించాడు. 2021లో క్లార్క్ అత్యంత వేగంగా పరుగెత్తే వ్యక్తిగా రికార్డు నెలకొల్పాడు. 4.78 సెకండల్లో 20 మీటర్ల దూరాన్ని అతను చేతులతోనే పరుగెత్తి గిన్నీస్ వరల్డ్ రికార్డుకెక్కాడు. ప్రస్తుతం అతని వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.