»Tn Cm Mk Stalin Sensational Comments On His Government
MK Stalin నా ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర: స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు
ఈసారి కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ అధికారంలోకి రాకూడదని స్పష్టం చేశారు. నరేంద్ర మదీ అప్రజాస్వామిక పాలనను దించేందుకు విపక్షాలన్నీ ఏకం కావాల్సిన అవసరం ఉందని స్టాలిన్ గుర్తు చేశారు.
ప్రజాస్వామ్యంగా ఎన్నికైన ప్రభుత్వాలను కూల్చే పని బీజేపీదని అందరికీ తెలిసిందే. 2014 నుంచి చాలా రాష్ట్రాల్లో అడ్డదారిన అధికారం చేపట్టిన పార్టీ బీజేపీ. అలాంటి పార్టీ తమ ప్రభుత్వాన్ని కూడా కూల్చడానికి కుట్ర చేస్తోందని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ (MK Stalin) సంచలన వ్యాఖ్యలు చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించి తమ ప్రభుత్వాన్ని కూల్చడానికి కుట్ర జరుగుతోందని ఆరోపించారు. తమిళనాడు (Tamil Nadu)లో జరిగిన ఓ కార్యక్రమంలో స్టాలిన్ ఈ వ్యాఖ్యలు చేయడం రాజకీయంగా కలకలం రేపింది.
తమిళనాడులోని నాగర్ కోవిల్ (Nagercoil)లో మంగళవారం మాజీ సీఎం దివంగత కరుణానిధి (M Karunanidhi) విగ్రహాన్ని (Statue) ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో స్టాలిన్ మాట్లాడుతూ.. డీఎంకే (Dravida Munnetra Kazhagam-DMK) అధికారంలోకి వచ్చాక ప్రజల కోసం ఎన్నో పథకాలు అమలు చేస్తున్నాం. ప్రజల అభ్యున్నతి కోసం ద్రవిడ నమూనా అభివృద్ధి సాగుతోంది. ప్రజలు లబ్ధి పొందడం సహించలేని కొన్ని దుష్టశక్తులు ప్రభుత్వాన్ని కూలదోయడానికి కుట్రలు పన్నుతున్నాయి. వారి కలలు ఫలించవు. కొంతమంది చేసే అర్థంపర్ధం లేని విమర్శలు, ఆరోపణలపై తాను స్పందించాల్సిన అవసరం ఏమాత్రం లేదు. దానికి పార్టీ నాయకులు సమాధానం చెబుతారు. ప్రజల మధ్య కుల, మత విద్వేషాలు సృష్టించి వారిని విభజించడానికి ప్రణాళికలు వేస్తున్నారు.
ఇటీవల తమిళనాడులో వలస కార్మికులపై దాడులు జరుగుతున్నట్లు వీడియోలు బయటకు వచ్చాయి. దీంతో అక్కడ కలకలం ఏర్పడింది. అయితే ఆ వీడియోలన్నీ నకిలీవని తేలింది. ఈ విషయం ప్రస్తావిస్తూ పై విధంగా స్టాలిన్ వ్యాఖ్యలు చేశారు. ఈసారి కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ అధికారంలోకి రాకూడదని స్పష్టం చేశారు. నరేంద్ర మదీ అప్రజాస్వామిక పాలనను దించేందుకు విపక్షాలన్నీ ఏకం కావాల్సిన అవసరం ఉందని స్టాలిన్ గుర్తు చేశారు.