»Telangana Minister Ktr Welcomed On Faggan Singh Kulaste Vizag Steel Plant Statement
KCR దెబ్బకు Vizag Steel Plantపై కేంద్రం దిగి వచ్చింది: KTR హర్షం
కేసీఆర్ ఏ పని మొదలుపెట్టినా విజయవంతమవుతుందని చెప్పడానికి ఇదొక గొప్ప నిదర్శనమని, కేసీఆర్ కు భయపడి నరేంద్ర మోదీ ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ పై వెనక్కి తగ్గిందని మంత్రులు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు పేర్కొంటున్నారు.
విశాఖ ఉక్కు కర్మాగారంపై కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి ఫగ్గన్ సింగ్ కులస్తే (Faggan Singh Kulaste) చేసిన ప్రకటనతో తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. ‘ఇప్పటికిప్పుడు స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటుపరంగా చేయాలని భావించడం లేదు’ అని కేంద్ర మంత్రి ప్రకటించడంతో బీఆర్ఎస్ పార్టీ (Bharat Rashtra Samithi- BRS Party) తమ విజయంగా పేర్కొంది. కేసీఆర్ దెబ్బ అంటే అట్లుంటది అని పేర్కొన్నాడు. కేంద్ర ప్రభుత్వం (Govt of India) స్టీల్ ప్లాంట్ పై వెనక్కి తగ్గిందని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మంత్రి కేటీఆర్ (KT Rama Rao) హర్షం వ్యక్తం చేశారు.
‘విశాఖ ఉక్కుపై గట్టిగా మాట్లాడిన నాయకుడు కేసీఆర్. ఎట్ల అమ్ముతారో మేం చూస్తాం. అదానీకి ఇచ్చిన బైలదిల్లా ఉక్కు ఫ్యాక్టరీ వల్ల వైజాగ్. అవసరమైతే మా సింగరేణిని పంపి. అధ్యయనం చేస్తామని ప్రకటించారు. దెబ్బ అంటే గట్లుంటది. ఎట్లుంటదంటే అట్లుంటది. కేసీఆర్ ఏ పని మొదలుపెట్టినా అట్లే ఉంటది’ అని కేటీఆర్ పేర్కొన్నారు. ‘విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో కేసీఆర్ వ్యూహానికి దిగొచ్చి.. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయం తాత్కాలికంగా ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించిన మోడీ సర్కార్’ అని బీఆర్ఎస్ పార్టీ తన అధికారిక సోషల్ మీడియాలో (Social Media) ప్రకటన విడుదల చేసింది.
కేంద్ర మంత్రి ప్రకటనతో తెలంగాణ మంత్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఏపీ రాజకీయ నాయకులు ఏం చెబుతారోనని నిలదీస్తున్నారు. కేసీఆర్ ఏ పని మొదలుపెట్టినా విజయవంతమవుతుందని చెప్పడానికి ఇదొక గొప్ప నిదర్శనమని మంత్రి మల్లారెడ్డి (MallaReddy) పేర్కొన్నారు. కేసీఆర్ కు భయపడి నరేంద్ర మోదీ ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ పై వెనక్కి తగ్గిందని మంత్రులు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు. కాగా కేంద్ర మంత్రి ప్రకటనతో విశాఖపట్టణంలోనూ (Visakhapatnam) సంబరాలు నెలకొన్నాయి. కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.