Wrestlers Arrestను ఖండించిన మమత, కేటీఆర్.. సెంగోల్ వంగిందని స్టాలిన్ విమర్శలు
మన చాంపియన్ లతో దుర్మార్గంగా వ్యవహరించడం సిగ్గుచేటు. రెజ్లర్లకు అండగా నిలుస్తా. ఈ ఘటనతో ధర్మానికి ప్రతీక అయిన సెంగోల్ మొదటి రోజే వంగిపోయినట్లు అర్థమవుతోంది.
లైంగిక వేధింపులకు పాల్పడుతున్న భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ (Brij Bhushan Sharan Singh)ను అరెస్ట్ చేయాలని భారత దిగ్గజ రెజ్లర్లు చేస్తున్న పోరాటం తీవ్ర రూపం దాల్చింది. అయితే వారి పోరాటాన్ని పోలీసులు అడ్డుకుంటున్నారు. ఆదివారం కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం సందర్భంగా రెజ్లర్లు (Wrestlers) పార్లమెంట్ ముట్టడికి యత్నించారు. ఈ సమయంలో పోలీసులు అడ్డుకుని రెజ్లర్లపై విచక్షణాపూరితంగా వ్యవహరించారు. మహిళలు అని కూడా చూడకుండా దారుణంగా ప్రవర్తించారు. పోలీసుల తీరుపై తమిళనాడు (Tamil Nadu), పశ్చిమ బెంగాల్ (West Bengal) ముఖ్యమంత్రులు ఎంకే స్టాలిన్ (MK Stalin), మమతా బెనర్జీ (Mamata Banerjee) తోపాటు తెలంగాణ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రెజ్లర్లపై వ్యవహరించిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాగా, దేశ రాజధాని ఢిల్లీలో నెల రోజులుగా సాక్షి మాలిక్, వినేశ్ ఫొగట్, భజరంగ్ పూనియాతో పాటు పెద్ద ఎత్తున రెజ్లర్లు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. బ్రిజ్ భూషణ్ అరెస్ట్ చేయాలని కోరుతూ ఉద్యమం తీవ్రం చేస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం జరిగిన సంఘటనపై పలువురు స్పందించారు. మమత బెనర్జీ స్పందిస్తూ.. ‘సాక్షి మాలిక్ (Sakshi Malik), వినేశ్ ఫొగట్ (Vinesh Phoghat) సహా ఇతర రెజ్లర్లతో ఢిల్లీ పోలీసులు (Delhi Police) అసభ్యకరంగా ప్రవర్తించిన విధానాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. వారిని వెంటనే విడుదల చేయాలి. మన చాంపియన్ లతో దుర్మార్గంగా వ్యవహరించడం సిగ్గుచేటు. రెజ్లర్లకు అండగా నిలుస్తా’ అని మమత ట్వీట్ చేశారు.
‘శాంతియుతగా పార్లమెంట్ (Parliament) వెలుపల నిరసన తెలిపేందుకు వచ్చిన రెజ్లర్లను ఈడ్చుకెళ్లి నిర్బంధించడం ఖండించాల్సిన విషయం. ఈ ఘటనతో ధర్మానికి ప్రతీక అయిన సెంగోల్ (Sengol) మొదటి రోజే వంగిపోయినట్లు అర్థమవుతోంది. రాష్ట్రపతిని పక్కకు తప్పించి, ప్రతిపక్షాల బహిష్కరణల మధ్య కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం రోజున ఇలాంటి దారుణం జరగడం న్యాయమేనా?’ అని స్టాలిన్ ట్విటర్ (Twitter)లో మోదీ ప్రభుత్వాన్ని నిలదీశారు.
ఇక రెజ్లర్లపై పోలీసులు వ్యవహరించిన తీరుపై తెలంగాణ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ (BRS Party) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KT Rama Rao) ఆగ్రహం వ్యక్తం చేశారు. రెజ్లర్ల అరెస్టును ఖండించారు. ‘అంతర్జాతీయ వేదికపై దేశ ఖ్యాతిని చాటిన రెజ్లర్లకు ఇచ్చే గౌరవం ఇదేనా? రెజర్లకు దేశ ప్రజలు మద్దతుగా నిలవాలి. రెజ్లర్లకు మనమందరం గౌరవం ఇవ్వాలి’ అని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.