ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు (MahabubNagar) చెందిన కీలక నాయకుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి (Gillella Chinna Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. తన వనపర్తి (Wanaparthy) నియోజకవర్గంలో రాజీవ్ గాంధీ (Rajiv Gandhi) విగ్రహం తొలగిస్తే తుపాకీతో కాల్చేస్తా అంటూ తీవ్రంగా స్పందించారు. మంత్రి మెప్పు కోసం అధికారులు జాతీయ నాయకులు విగ్రహాలు తొలగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రహదారి విస్తరణ పనుల్లో (Road Expansion Works) విగ్రహం అడ్డంకిగా మారడంతో ఆయన పై వ్యాఖ్యలు చేశారు.
జిల్లా కేంద్రంగా ఉన్న వనపర్తిలో రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే పాత బజార్ లోని దర్గా, ఓ ఆలయ స్వాగత తోరణం తొలగించారు. దీనికి నిరసనగా ఆదివారం కాంగ్రెస్ పార్టీ (Congress Party) ఆందోళన చేపట్టింది. ఈ ధర్నాలో పాల్గొన్న మాజీ మంత్రి చిన్నారెడ్డి మాట్లాడుతూ.. ‘దర్గాలు, ఆలయాలు తొలగించకుండా రహదారి విస్తరణ చేస్తే ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు ఉండవు. చౌరస్తాల్లో జాతీయ నాయకుల విగ్రహాలు తొలగించాలనుకోవడం ఎంతవరకు న్యాయం?’ అని చిన్నారెడ్డి ప్రశ్నించారు.
మంత్రి నిరంజన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. ‘మంత్రి నిరంజన్ రెడ్డి (Singireddy Niranjan Reddy) మెప్పు కోసమే అధికారులు, పోలీసులు పని చేస్తున్నారు. మాజీ ప్రధాని దివంగత రాజీవ్ గాంధీ విగ్రహం తొలగిస్తామని అంటున్నారు. ఆ విగ్రహంపై చేయి వేయండి.. ఒక్కొక్కరిని తుపాకీతో (Gun) కాలుస్తా’ అని చిన్నారెడ్డి హెచ్చరించారు. కాగా, ఈ ఆందోళనకు ప్రతిగా బీఆర్ఎస్ (BRS Party) నాయకులు ఆందోళన చేపట్టారు. దీంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల మధ్య వాగ్వాదం ఏర్పడింది. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి ఇరు వర్గాలను శాంతింపజేశారు.