»Aagainst Minister Niranjan Reddy Wanaparthy Leaders Resignation To Brs Party
Resignation బీఆర్ఎస్ కు భారీ షాక్.. గంపగుత్తగా రాజీనామాలు
తాము చేసిన ఈ ఆరోపణలను నిరూపించేందుకు సిద్ధం’ అని రాజీనామా చేసిన నాయకులు తెలిపారు. ఈ పరిణామంతో వనపర్తి టీఆర్ఎస్ లో కలకలం ఏర్పడింది. ఒక్కసారిగా పార్టీ రెండుగా చీలిపోయింది. అయితే వీరి రాజీనామా వ్యవహారంపై మంత్రి నిరంజన్ రెడ్డి ఇంకా స్పందించలేదు.
గులాబీ పార్టీ (BRS Party)లో అసంతృప్తి జ్వాలలు రగులుతున్నాయి. కారు పార్టీలో లెక్కకు మించి చేరికలు రావడంతో నాయకుల మధ్య ఐక్యత ఉండడం లేదు. ఒక్కో నియోజకవర్గంలో పొట్టు పొట్టు నాయకులు ఉండడంతో వారి మధ్య విబేధాలు కొనసాగుతున్నాయి. ఒక నాడు ప్రత్యర్థులుగా ఉన్న వారు ఇప్పుడు ఒకే పార్టీలో ఉండి కలిసి పని చేయలేకపోతున్నారు. పార్టీ గుర్తింపు ఇవ్వకపోవడం, తమకు ప్రభుత్వం, పార్టీలో ప్రాధాన్యం దక్కకపోవడంతో ఇక ప్రత్యామ్నాయం చూస్తున్నారు. ఇక మంత్రులు (Ministers), ఎమ్మెల్యే (MLAs)ల పెత్తనం అధికం కావడంతో పార్టీని వీడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే వ్యవహారం మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి (Singireddy Niranjan Reddy) సొంత ఇలాకా వనపర్తి (Wanaparthy District)లో మొదలైంది. మంత్రి తీరుకు నిరసనగా బీఆర్ఎస్ పార్టీ (BRS Party)లోని ముఖ్య నాయకత్వమంతా రాజీనామా (Resignation) చేసింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
తమ ఆత్మగౌరవాన్ని మంత్రి నిరంజన్ రెడ్డి దెబ్బ తీశారని ఆరోపిస్తూ వనపర్తి జిల్లా పరిషత్ (Zilla Parishad) చైర్మన్ లోక్ నాథ్ రెడ్డి, పెద్దమందడి, వనపర్తి ఎంపీపీ (MPPs)లు మేఘారెడ్డి, కిచ్చారెడ్డితో పాటు 10 మంది సర్పంచ్ (Sarpanch)లు, 5 మంది ఎంపీటీసీ (MPTC) సభ్యులు, 6 మంది సింగిల్ విండో డైరెక్టర్లతో పాటు మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు ఇలా దాదాపు 100 మంది బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. రాజీనామాలు చేసిన అనంతరం వనపర్తిలో గురువారం విలేకరుల సమావేశం (Press Meet) నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ‘మా ఆత్మగౌరవాన్ని మంత్రి నిరంజన్ రెడ్డి దెబ్బతీశారు. పార్టీలో ఇమడలేక మా సభ్యత్వాలకు రాజీనామా చేస్తున్నాం. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం నుంచి ఎమ్మెల్యేగా నిరంజన్ రెడ్డి గెలుపు కోసం ఎంతో పని చేశాం. అన్ని అధికారాలు మంత్రి తన వద్దనే ఉంచుకుని మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారు. జెడ్పీ చైర్మన్ గా ఎన్నికైన నాటి నుంచి పలు రకాలుగా అవమానాల పాలవుతున్నాం. విలువలు కోల్పోయి, దిగజారి రాజకీయం చేయలేకే పార్టీ నుంచి తప్పుకుంటున్నాం. మా గ్రామాల పరిధిలోని లబ్ధిదారులకు మంత్రి తన క్యాంపు కార్యాలయం బయటే అందించి పంపించేస్తున్నారు. కనీసం మాకు సమాచారం ఇవ్వడం లేదు. రూ.506 కోట్లతో పలు పనులు చేసి బిల్లులు ఎవరు తీసుకున్నారు? గ్రామ స్థాయిలో గ్రూపు రాజకీయాలను మంత్రి ప్రోత్సహిస్తున్నారు. వార్డు సభ్యుడి నుంచి ఎంపీపీ వరకు నిధులను నిరంజన్ రెడ్డి తన ఆధీనంలో ఉంచుకున్నారు. తాము చేసిన ఈ ఆరోపణలను నిరూపించేందుకు సిద్ధం’ అని రాజీనామా చేసిన నాయకులు తెలిపారు. ఈ పరిణామంతో వనపర్తి టీఆర్ఎస్ లో కలకలం ఏర్పడింది. ఒక్కసారిగా పార్టీ రెండుగా చీలిపోయింది. అయితే వీరి రాజీనామా వ్యవహారంపై మంత్రి నిరంజన్ రెడ్డి ఇంకా స్పందించలేదు. పార్టీ అధిష్టానం దృష్టికి ఈ అంశం ఇంకా చేరలేదు.