బీజేపీ నేత రాజాసింగ్ ని ఇటీవల పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. మత విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడారనే కారణంతో ఆయనను అరెస్టు చేశారు. ఈ కారణంతో ఆయనను బీజేపీ నుంచి కూడా బహిష్కరించారు. కాగా.. తాజాగా ఆయనకు శ్రీరామ్ సేన మద్దుతగా నిలవడం గమనార్హం.
ప్రస్తుతం చర్లపల్లి జైలులో ఉన్న ఆయనపై పోలీసులు పీడీ యాక్ట్ ప్రయోగించారు. దీనికింద కేసు నమోదైతే ఏడాది వరకు బెయిల్ వచ్చే అవకాశం లేదని న్యాయ నిపుణులు చెబుతున్నారు. అయితే రాజాసింగ్ అరెస్టును వ్యతిరేకిస్తూ అక్కడక్కడా ఆందోళనలు జరుగుతూనే ఉన్నాయి. ఆయనపై కేసులు ఎత్తివేసి వెంటనే విడుదల చేయాలంటూ పలు హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
తాజాగా.. శ్రీరామ్ సేన జాతీయ అధ్యక్షుడు ప్రమోద్ ముతాలిక్.. రాజాసింగ్ అరెస్టు పై సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీరామ్ సేన జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు గంగాధర్ కులకర్ణి, రాష్ట్రీయ శివాజీ సేన అధ్యక్షుడు శ్రీనివాసాచారి, హిందూ జన జాగృతి సమితి రాష్ట్ర సమన్వయకర్త చేతన్‌తో కలిసి మంగళవారం ధూల్‌పేటలోని ఎమ్మెల్యే రాజాసింగ్ కుటుంబసభ్యుల్ని ఆయన పరామర్శించారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ… ‘తెలంగాణ ప్రభుత్వానికి, పోలీసులకు 10 రోజుల గడువు ఇస్తున్నాం.. ఈలోగా ఎమ్మెల్యే రాజాసింగ్‌పై అక్రమంగా పెట్టిన పీడీ యాక్టును ఉపసంహరించుకొని జైలు నుంచి విడుదల చేయాలి.. లేదంటే దేశవ్యాప్తంగా హిందూ సంఘాలతో కలిసి లక్షలాది మందితో ‘చలో హైదరాబాద్’కు పిలుపు ఇచ్చి దిగ్బంధిస్తాం.. ఆ తర్వాత జరిగే పరిణామాలకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుంది’ అని ప్రమోద్ ముతాలిక్ హెచ్చరించారు.