సికింద్రాబాద్ వద్ద షాపింగ్మాల్లో జరిగిన అగ్నిప్రమాద ఘటనకు షార్ట్ సర్య్కూట్ కారణం కాదని విద్యుత్ శాఖ అధికారి శ్రీధర్ వెల్లడించారు. షార్ట్ సర్య్కూట్ జరిగుంటే విద్యుత్ సబ్ స్టేషన్లో ట్రిప్ అయ్యేదని, కానీ అలా జరగలేదని తెలిపారు. గురువారం ఉదయం 11.20 గంటలకు సమాచారం అందగానే విద్యుత్ సరఫరాను నిలిపివేసినట్లు తెలిపారు. చుట్టుపక్కల కాలనీలకు సాయంత్రం 6.30 గంటలకు విద్యుత్ సరఫరా పునరుద్ధరించినట్లుగా వెల్లడించారు. ఘటన జరిగిన భవనానికి మొత్తం 6 మీటర్లు ఉండగా వాటిల్లో సమస్యలు తలెత్తలేదని తెలిపారు. అగ్రిప్రమాదానికి గల కారణం దర్యాప్తులో తేలుతుందని శ్రీధర్ వెల్లడించారు.
డ్రోన్ సాయంతో గాలింపు
అగ్ని ప్రమాద ఘటనలో భవనం పూర్తిగా దెబ్బతిందని, భవనం లోపలి పరిస్థితిని అంచనా వేసేందుకు అగ్నిమాపక శాఖ, జీహెచ్ఎంసీ అధికారులు డ్రోన్ ఉపయోగించినట్లు విద్యుత్ అధికారి శ్రీధర్ తెలిపారు. ప్రమాద సమయంలో దుకాణంలో 17 మంది ఉండగా మంటలు వ్యాపించడాన్ని గుర్తించి వారంతా బయటకు వచ్చేశారు. అయితే తమ సామాన్లు తీసుకునేందుకు జునైద్, జహీర్, వసీం అనే ముగ్గురు లోపలికి వెళ్లినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. వారిని కూడా డ్రోన్ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం ఆ భవనం యజమాని జావేద్ పరారీలో ఉన్నట్లు అధికారులు తెలిపారు.