»Revanth Reddy Defends His Comments On Pragathi Bhavan
Revanth Reddy: జనవరి 1న మేమే, ఆ వ్యాఖ్యలను సమర్థించుకున్న రేవంత్
ప్రగతి భవన్‌ను పేల్చేయాలన్న తన వ్యాఖ్యలను రేవంత్ రెడ్డి (Revanth Reddy) సమర్థించుకున్నారు. తాను తప్పుగా మాట్లాడలేదని, ప్రజల సొమ్ముతో దానిని నిర్మించారని, ఇది అందరికీ అందుబాటులో ఉండాలన్నారు.
జనవరి 1, 2024లో కాంగ్రెస్ పార్టీ (Congress) అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు రేవంత్ రెడ్డి (Revanth Reddy) బుధవారం అన్నారు. తాము అధికారంలోకి రాగానే పోడు భూములకు సంబంధించి పట్టాలు ఇస్తామని, భూనిర్వాసితులకు పరిహారం ఇచ్చే బాధ్యత తమదే అన్నారు. పోలీసు ఉద్యోగులకు వారంలో ఒకరోజు సెలవును ఇస్తామన్నారు. రాష్ట్రంలో ఏ ఒక్కరూ సంతోషంగా లేరన్నారు. ఉద్యోగులు కూడా ఆనందంగా లేరన్నారు. ఎనిమిదో తేదీ వచ్చినా వారికి వేతనాలు పడటం లేదని వాపోయారు. అధికార పార్టీ ప్రజాప్రతినిధులు భూకబ్జాలు చేస్తున్నారన్నారు. ప్రజలకే కాదు.. సాక్ష్యాత్తు కలెక్టర్లకు, కౌన్సిలర్లకే రాష్ట్రంలో రక్షణ లేకుండా పోయిందన్నారు. నకిలీ విత్తనాలతో రైతులను(Farmer) మోసం చేసిన వారిపై పీడీ యాక్ట్ ఎందుకు పెట్టలేదో ప్రభుత్వం చెప్పాలని నిలదీశారు. మళ్లీ కాంగ్రెస్ (Congress) వస్తేనే బాగుపడతామన్నారు. అక్రమాలకు, పార్టీ ఫిరాయింపులకు వేదికగా ప్రగతి భవన్ (Pragathi Bhavan) అడ్డాగా మారిందని ధ్వజమెత్తారు. హాథ్ సే హాథ్ జోడో అభియాన్ యాత్ర మూడో రోజు కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఆయనతో పలువురు సమస్యలు చెప్పుకున్నారు.
ప్రగతి భవన్‌ను పేల్చేయాలన్న తన వ్యాఖ్యలను రేవంత్ రెడ్డి (Revanth Reddy) సమర్థించుకున్నారు. తాను తప్పుగా మాట్లాడలేదని, ప్రజల సొమ్ముతో దానిని నిర్మించారని, ఇది అందరికీ అందుబాటులో ఉండాలన్నారు. కానీ ప్రజలు తమ కష్టం చెప్పుకోవడానికి నిర్మించిన భవనం వల్ల ఉపయోగం లేకుంటే ఏమిటని ప్రశ్నించారు. గతంలో వైయస్ రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు వంటి ముఖ్యమంత్రులు తమ క్యాంప్ కార్యాలయాల్లో ప్రజలను కలిసేవారని గుర్తు చేసారు. కానీ కేసీఆర్ మాత్రం తన కోటను ప్రజల కోసం ఎందుకు తెరవడం లేదో చెప్పాలని నిలదీశారు. ప్రగతి భవన్‌కు ప్రవేశం లేనప్పుడు గేట్లను బద్దలు కొట్టి తెరవాలన్నారు. అవసరమైతే కేసీఆర్ (KCR) బంగ్లాను కూల్చే బాధ్యత కాంగ్రెస్ (Congress) తీసుకుంటుందన్నారు. నక్సలైట్ల అజెండాను అమలు చేస్తానని గతంలో కేసీఆరే (KCR) హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అసలు బీఆర్ఎస్ (BRS) నాయకులు తన వ్యాఖ్యలను తప్పుగా ఎందుకు అర్థం చేసుకుంటున్నారని నిలదీశారు. తాను ప్రజల అభిప్రాయాన్ని చెప్పానని తెలిపారు. ప్రగతి భవన్‌ను పేల్చేయాలన్న వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నాయకులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
మరోవైపు, రేవంత్ రెడ్డి (Revanth Reddy) చేసిన వ్యాఖ్యలపై ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ స్పందించారు. ప్రగతి భవన్‌ను కాల్చేయాలనే వ్యాఖ్యలు సరికాదని, వెంటనే అతనిని అరెస్ట్ చేయాలన్నారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయినప్పటికీ ఆయన తీరు మారలేదన్నారు. వేల కోట్ల రూపాయల లంచం ఇచ్చి పీసీసీ పదవిని తెచ్చుకున్నారని ఆరోపించారు. ఆ పదవి నుండి కాంగ్రెస్ (Congress) అధిష్టానం వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి (Revanth Reddy) పీసీసీ (PCC) పదవికి అనర్హుడని మంత్రి సత్యవతి రాథోడ్ (Satyavathi Rathod) ద్వజమెత్తారు. వ్యవస్థలపై రేవంత్ కు నమ్మకం లేదని వ్యాఖ్యానించారు. నక్సలైట్లను చర్చలకు పిలిచి కాల్చి చంపిన పార్టీ కాంగ్రెస్ అని, రేవంత్ రెడ్డివి అహంకారపు మాటలన్నారు. ప్రజలకు, నక్సలైట్లకు రేవంత్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.