హైదరాబాద్ నడిబొడ్డున అమెరికాలోని వైట్ హౌస్ మాదిరి నిర్మాణమవుతున్న తెలంగాణ రాష్ట్ర కొత్త సచివాలయంలో మంటలు వ్యాపించడంపై రాజకీయ వివాదం చెలరేగింది. ఈ సంఘటన చెలరేగడం దురదృష్టకరమని ప్రతిపక్ష పార్టీలు తెలిపాయి. ఈ ఘటనపై వెంటనే విచారణ చేసి వాస్తవాలు ప్రజలకు తెలపాలని డిమాండ్ చేశాయి. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ తీరుపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. సీఎం కేసీఆర్ తొందరపాటుతోనే ఈ ప్రమాదం సంభవించిందని ఆరోపించారు. వారి మాటలు ఇలా ఉన్నాయి..
అఖిపక్షాన్ని అనుమతించాలి
కొత్త సచివాలయంలో అగ్ని ప్రమాదాన్ని మాక్ డ్రిల్ పేరుతో మసిపూసి మారేడుకాయ చేయడం తప్పు. కేసీఆర్ జన్మదినం రోజే ప్రారంభించాలన్న ఒత్తిడితో ప్రమాణాలు పాటించడం లేదని తెలుస్తోంది. ఆయన జన్మదినం రోజు ప్రారంభించడానికి ఇదేమైనా రాచరికమా? అగ్నిప్రమాదంపై నిజనిర్ధారణకు అఖిలపక్ష బృందాన్ని అనుమతించాలి’ – రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు, మల్కాజిగిరి ఎంపీ
కొత్త సచివాలయంలో అగ్నిప్రమాదాన్ని మాక్ డ్రిల్ పేరుతో మసిపూసిమారేడుకాయ చేయడం తప్పు
కేసీఆర్ జన్మదినం రోజే ప్రారంభించాలన్న ఒత్తిడితో ప్రమాణాలు పాటించడం లేదని తెలుస్తోంది.ఆయన జన్మదినం రోజు ప్రారంభించడానికి ఇదేమైనా రాచరికమా
పకడ్బందీ చర్యలు తీసుకోవాలి
‘ఆదరాబాదరాగా నాణ్యత లేకుండా పనులు చేస్తుండటంవల్లే ఈ పరిస్థితి. తన పుట్టిన రోజు నాడే సచివాలయాన్ని ప్రారంభించాలనే తొందరపాటులో ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకుంటున్న చర్యలే ఈ పరిస్థితికి కారణం. సీఎం పుట్టిన రోజునే (ఫిబ్రవరి 17న) కొత్త సచివాలయ ప్రారంభించాలనే నిర్ణయాన్ని వాయిదా వేసుకోవాలి. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పుట్టిన రోజున నూతన సచివాలయాన్ని ప్రారంభించాలి. ఫైర్ సేఫ్టీ సహా అన్ని రకాల పనులను చెక్ చేసుకుంటూ ఎలాంటి ప్రమాదాలు తలెత్తకుండా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలి. – బండి సంజయ్ కుమార్, కరీంనగర్ ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు