అదానీ గ్రూప్ పై హిండెన్‌బర్గ్ ఇచ్చిన నివేదిక వ్యవహారం సెగ పార్లమెంట్ కు తగిలింది. ఆ వ్యవహారంపై చర్చించాలని ప్రతిపక్ష పార్టీలు ఆందోళన చేశాయి. అదానీ గ్రూపుపై ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై చర్చించాల్సిందేనంటూ విపక్షాలు సభలో పట్టుబట్టాయి. ఈ సందర్భంగా మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ విపక్ష సభ్యులు ఆందోళన చేపట్టారు. వీరి ఆందోళనతో ప్రారంభమైన కొద్దిసేపటికే ఉభయ సభలు వాయిదా పడ్డాయి.
బడ్జెట్ సమావేశాల్లో భాగంగా గురువారం ఉభయ సభలు సమావేశమయ్యాయి. ఉదయం 11 గంటలకు లోక్‌సభ లో స్పీకర్ ఓం బిర్లా ప్రశ్నోత్తరాలు మొదలుపెట్టారు. ఈ సమయంలో అదానీపై హిండెన్‌బర్గ్ నివేదిక విషయమై చర్చించాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. కాంగ్రెస్ తో మరికొన్ని పార్టీలు ఈ విషయంపై వాయిదా తీర్మానాలు ఇచ్చాయి. అయితే వీటికి స్పీకర్ అంగీకరించలేదు. ప్రశ్నోత్తరాలు చాలా ముఖ్యమైనవని.. అంతరాయం కలిగించొద్దని కోరారు. అయినా కూడా ప్రతిపక్ష సభ్యులు ఆందోళన కొనసాగించడంతో స్పీకర్ సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. ఇక రాజ్యసభలోనూ ఇవే పరిణామాలు జరిగాయి. సభ ప్రారంభం కాగానే విపక్ష సభ్యులు ఆందోళన చేపట్టారు. ఎగువ సభ కూడా మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడింది.
హిండెన్‌బర్గ్ నివేదికపై దేశవ్యాప్తంగా వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. అదానీ సంస్థ తన షేర్లలో అవకతవకలకు పాల్పడుతోందని అమెరికాకు చెందిన సంస్థ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదిక విడుదల చేసింది. ఖాతాల్లో మోసాలు చేస్తోందంటూ ఇచ్చిన నివేదిక భారత స్టాక్ మార్కెట్ లో కల్లోలం రేపింది. ఈ ఆరోపణలను అదానీ గ్రూప్ తీవ్రంగా ఖండించింది. తనపై దాడి కాదని.. భారతదేశంపై దాడిగా గౌతమ్ అదానీ అభిప్రాయపడిన విషయం తెలిసిందే.