కేరళలో కరోనా వైరస్ కేసులు తగ్గుముఖం పడుతున్న తరుణంలో మరో వైరస్ కేసులు పెరుగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా నోరో వైరస్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటి వరకూ ఈ కేసులన్నీ చిన్నారుల్లోనే కనిపించాయి. చిన్నారుల్లో అధిక స్థాయిలో ఇన్ఫెక్షన్ ను గుర్తించడంతో సర్కార్ అప్రమత్తమైంది. ఈ వైరస్ అతిసారం, వాంతులతో సంబంధం కలిగి ఉంటుందని, చికిత్స సులభమే అయినా ఒక్కోసారి ప్రాణాంతకంగా మారే అవకాశం ఉందని పలు అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. తాజాగా ఎర్నాకుళంలోని ఓ పాఠశాలలో 19 మంది విద్యార్థులకు నోరో వైరస్ ఉందని తేలడంతో 50 పాఠశాలలను ముందుగానే మూసివేశారు. చాలా మంది విద్యార్థుల్లో ఈ లక్షణాలు కనిపించగా అధికారులు అప్రమత్తమయ్యారు.
గత ఏడాది జూన్ లో కేరళ రాష్ట్రంలో నోరో వైరస్ కేసులు నమోదయ్యాయి. నోరో వైరస్ మొదటి వ్యాప్తి జూన్ 2021లో అలప్పుజా సమీపంలో అధికారులు గుర్తించారు. అయితే పరిశుభ్రతతో ఈ వైరస్ ను నివారించవచ్చని అధికారులు తెలిపారు. నోరో వైరస్ అనేది అతిసారం, వాంతులతో సంబంధం కలిగి ఉంటుందని, ఇది కలుషితమైన ప్రదేశాలు, కలుషితమైన ఆహారం ద్వారా సోకుతుందని తేలింది. నోరో వైరస్ నే వింటర్ వామిటింగ్ బగ్ అని కూడా పిలుస్తారు. జ్వరం, కండరాల తిమ్మిరి, వాంతులు, కడుపు నొప్పి, విరేచనాలు వంటివి నోరో వైరస్ లక్షణాలని వైద్యులు తెలిపారు.