టర్కీ, సిరియాల్లో సంభవించిన భీకర భూకంపం(Turkey earthquake) దాటికి బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. ఇప్పటివరకు రెండు దేశాల్లో మృతుల సంఖ్య 4,300 దాటేసిందని అక్కడి మీడియా సంస్థలు పేర్కొన్నాయి. టర్కీలో 3000 మందికిపైగా మృతి చెందారని, మరోవైపు సిరియాలో బాధిత మృతుల సంఖ్య 1500కు చేరిందని వెల్లడించారు. ఇంకా శిథిలాల్లో చిక్కుకున్న అనేక మందిని తొలగిస్తున్నారు. మరోవైపు టర్కీ, సిరియాలో సుమారు 19 వేల మంది క్షతగాత్రులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది.
ఫిబ్రవరి 6న రిక్టర్ స్కేలుపై 7.8 తీవ్రతో వచ్చిన భూకంపం దాటికి అనేక ఇళ్లు నెలమట్టం అయ్యాయి. టర్కీలోని గాజియాన్ తెప్ నగర పరిధితోపాటు సిరియాలోని అనేక నగరాల్లో దాదాపు 50కి పైగా శక్తివంతమైన ప్రకంపనలు వచ్చినట్లు అధికారులు తెలిపారు. అయితే ప్రజలు నిద్రిస్తున్న సమయంలో ఈ ఘటనలు జరగడంతో పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరిగింది.
మరోవైపు ఈ భూకంప బాధితులను ఆదుకునేందుకు భారత్ ఎన్డీఆర్ఎఫ్ బృందంతోపాటు ఇతర సామాగ్రిని టర్కీకి పంపింది. దీంతోపాటు టర్కీ, సిరియా ఆదుకునేందుకు అమెరికా, రష్యా, జర్మనీ, తైవాన్ సహా 45 దేశాలు సాయం అందిస్తున్నాయి.