బీజేపీ పార్లమెంటరీ సమావేశంలో ప్రధాని మోదీ కన్నీళ్లు పెట్టుకున్నారు. రెండు రోజుల క్రితం టర్కీ, సిరియాలలో భారీ భూకంపం సంభవించి వేలల్లో ప్రజలు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. అక్కడ మృతుల సంఖ్య ఇంకా పెరుగుతూనే ఉంది. కాగా… ఈ ఘటన పట్ల ఆయన భావోద్వేగానికి గురయ్యారు. అంతేకాకుండా 2001లో గుజరాత్ లో జరిగిన భూకంపాన్ని తలుచుకొని ఆయన కన్నీళ్లు పెట్టుకోవడం గమనార్హం. ఈ విషయాన్ని బీజేపీ ఎంపీ మనోజ్ తివారి తెలియజేశారు.
కాగా… 2001లో గుజరాత్ లో సంభవించిన భూకంపంలో దాదాపు 13 వేల మంది ప్రాణాలు కోల్పోవడం గమనార్హం. ఈ విషయాన్ని తలుచుకొని మోదీ కన్నీళ్లు పెట్టుకున్నారని మనోజ్ తివారి చెప్పారు. ఆయనకు ఈ బాధ తెలుసు కాబట్టే.. టర్కీ బాధను అర్థం చేసుకున్నారని చెప్పారు.
టర్కీ, సిరియాలను సోమవారం, మంగళవారం వరుస భూకంపాలు కుదిపేశాయి. దీంతో అనేక దేశాలు అత్యవసర సహాయాన్ని పంపిస్తున్నాయి. మన దేశం కూడా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, డాగ్ స్క్వాడ్స్, మందులు, పరికరాలు వంటి వాటిని పంపించింది. ఈ సహాయం మంగళవారం మధ్యాహ్నానికి టర్కీ (Turkey) చేరుకుంది.