స్పీడుగా రైడ్ చేస్తున్న రెండు బైక్ లను చేయిలతో పట్టుకుని ఆపగలరా? కొంచెం కష్టమే అని చెప్పవచ్చు. కానీ ఓ పోటీలో భాగంగా పంజాబ్ కు చెందిన లవ్‌ప్రీత్ సింగ్ (24) అనే వ్యక్తి ఏకంగా నాలుగు బుల్లెట్ బైక్ లను ఆపాడు. అది కూడా మాములుగా కాదు. తాళ్లను నాలుగు ద్విచక్రవాహనాలకు కట్టి బైకర్లు వాటిని ముందుకు రైడ్ చేస్తుండగా లవ్ దీప్ చేతులతో పట్టుకుని ముందుకు వెళ్లనీయకుండా ఆపేశాడు. పంజాబ్ లుథియానా జిల్లాలోని రాయ్ పూర్లో గ్రామీణ క్రీడాపోటీల్లో భాగంగా అతను ఈ ఫిట్ ను సాధించాడు. లవ్ దీప్ గత కొన్ని ఏళ్లుగా ఈ క్రీడా పోటీల్లో పాల్గొంటున్నట్లు తెలిపాడు. అంతేకాదు తాను ఇప్పటివరకు జిమ్ కు వెళ్లలేదని ఇంటిదగ్గరే స్థానికంగా దొరికే ఆహారం తీసుకుంటూ సాధన చేసినట్లు చెప్పాడు.
మరోవైపు ఇదే క్రీడల్లో జగదీప్ సింగ్(36) అనే వ్యక్తి కారుకు తాళ్లు కట్టి నోటి పళ్లతో కొంచెం దూరం లాగేసి ఔరా అనిపించుకున్నాడు. అయితే ఆ మారుతి కారులో ప్రయాణికులతో కలిపి మొత్తం 500 కేజీలు ఉండటం విశేషం. పలువురు యువత డ్రగ్స్ కు బానిస అవుతున్నారని, అలాంటి అలవాట్లను విరమించి మంచి ఆహారం తీసుకోవాలని జగదీప్ సూచించాడు.