ప్రపంచమంతా భయపడేలా.. టర్కీ, సిరియా దేశాల్లో భూకంపం తన ప్రతాపాన్ని చూపించింది. ప్రకృతికి కోపం వస్తే ఇలా ఉంటుంది అన్నట్టుగా టర్కీ, సిరియాను భారీ భూకంపం నాశనం చేసింది. పేక మేడల్లా కూలుతున్న భారీ బిల్డింగ్‌లను చూసి జనాలే భయభ్రాంతులకు లోనవుతున్నారు. ఒకసారి కాదు రెండు సార్లు కాదు.. టర్కీలో 7.8 తీవ్రతతో పలు సార్లు భూకంపం సంభవించడంతో పెద్ద పెద్ద భవనాలన్నీ నేలమట్టం అయ్యాయి. దీంతో వేల మంది మృత్యువాత పడ్డారు. కొందరు శిథిలాల కింద చిక్కుకున్నారు.
ఎక్కడ చూసినా టర్కీ అంతటా శిథిలాలే. వాటి కింద చిక్కున్న ఆర్థనాదాలే వినిపిస్తున్నాయి. టర్కీని ఆదుకోవడం కోసం భారత్ కూడా చేయి కలిపింది. సహాయక సిబ్బందిని, మెడికల్ అసిస్టెన్స్‌ను టర్కీకి పంపించింది. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి.
ఈనేపథ్యంలో టర్కీ భూకంప ధాటికి శిథిలాల్లో చిక్కుకున్న ఇద్దరు చిన్నారుల వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మమ్మల్ని కాపాడండి.. అంటూ శిథిలాల కింద చిక్కుకున్న చిన్నారులు దీనంగా అక్కడున్న సహాయ సిబ్బందిని వేడుకున్న దృశ్యం అందరినీ కంటతడి పెట్టించింది. ఆ చిన్నారులు కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నారు. అమ్మా ఎక్కడున్నావు.. నాన్నా ఎక్కడున్నావు. మాకు నొప్పిగా ఉంది. మేము భరించలేకపోతున్నాం అంటూ ఆ చిన్నారుల వేదన చూసిన ప్రతి ఒక్కరు ఏం చేయలేని నిస్సాయక స్థితిలో ఉన్నారు. ఆ చిన్నారులను రక్షించేందుకు సహాయక సిబ్బంది తమ శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. పైన ఉన్న శిథిలాలను మొత్తం తొలగిస్తే కానీ.. ఆ చిన్నారులు బయటపడే మార్గం లేదు. దేవుడా.. ఎలాగైనా ఆ చిన్నారులు క్షేమంగా బయటపడేలా చూడు.. అంటూ ఆ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ప్రార్థిస్తున్నారు.