»Mla Raja Singh Escaped In Accident And Bullet Proof Vehicle Tire Slips
Raja Singhకు తృటిలో తప్పిన ప్రమాదం.. ఊడిన కారు చక్రం
నడిరోడ్డుపై వాహనాలు ఆగిపోవడంతో ఎమ్మెల్యే రాజా సింగ్ వాటిని అలాగే వదిలేసి వెళ్లిపోయారు. ఈ వాహనం వెనక్కి తీసుకోవాలని పలుమార్లు ప్రభుత్వానికి విన్నవించినా పట్టించుకోలేదు. దీనిపై నియోజకవర్గ ప్రజలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ ఎమ్మెల్యే ప్రాణానికి ముందే ముప్పు ఉందనే విషయం ప్రభుత్వానికి తెలిసినా కక్షపూరితంగానే పాడైన వాహనాలను పంపిస్తోందని రాజా సింగ్ అనుచరులు ఆరోపిస్తున్నారు.
తనకు కేటాయించిన వాహనాలు (Convoy) మొరాయిస్తున్నాయని రాష్ట్ర ప్రభుత్వానికి చెబుతున్నా పరిస్థితి మారలేదు. దీంతో ప్రమాదకరమైన వాహనాల్లోనే బీజేపీ (BJP) గోషామహల్ (Goshamahal) ఎమ్మెల్యే రాజాసింగ్ రాకపోకలు సాగిస్తున్నాడు. చాలా సార్లు ప్రయాణంలో మధ్యలోనే వాహనాలు ఆగిపోయాయి. ఒకటి రెండు సార్లు కాదు ఎన్నో సార్లు ఇలాంటివి పునరావృతం కావడంతో రాజాసింగ్ వాహనాలను వెనక్కి పంపించాడు. కొన్ని సార్లు రోడ్డు మధ్యలోనే వాహనాలను వదిలేసి వెళ్లిపోయాడు. అయినా ప్రభుత్వం స్పందించలేదు. తాజాగా ఆ వాహనాలతో రాజా సింగ్ ప్రమాదం బారిన పడ్డాడు. కొద్దిలో పెను ప్రమాదం తప్పింది. ప్రయాణం మధ్యలోనే వాహనం చక్రం ఊడిపోయింది.
ఇటీవల ఎమ్మెల్యే రాజా సింగ్ (Raja Singh) వివాదాలకు కేంద్రంగా మారాడు. ఇతర వర్గాలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ జైలు పాలయ్యాడు. ప్రస్తుతం బెయిల్ పై ఉన్న ఎమ్మెల్యే రాజా సింగ్ తన ప్రవర్తనలో ఎలాంటి మార్పు చేసుకోలేదు. అతడి ప్రాణానికి ప్రమాదం ఉండడంతో పాటు ఎమ్మెల్యే కావడంతో అతడికి ప్రభుత్వం బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు సమకూర్చింది. అయితే ఇచ్చిన వాహనాలు డొక్కువి.. పాతవి కావడంతో ఆ వాహనాలు తరచూ మొరయిస్తున్నాయి.
తాజాగా గురువారం అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొన్న అనంతరం ఇంటికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో ఎక్సైజ్ కమిషనర్ ఆఫీస్ కార్యాలయానికి చేరుకోగానే ఓ వాహనంలోని చక్రం బయటకు ఊడి వచ్చింది. అకస్మాత్తుగా జరిగిన ఈ ప్రమాదంతో కాన్వాయ్ ఆగిపోయింది. డ్రైవర్ అప్రమత్తతో ప్రమాదం తప్పింది. ఒకవైపు ఎగ్జిబిషన్ మరోవైపు ఈ కార్ రేసింగ్ తో రోడ్లు రద్దీగా ఉన్నాయి. రోడ్డు మధ్యలో వాహనం ప్రమాదానికి గురైంది. దీంతో కొంత రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది. ఎమ్మెల్యే రాజాసింగ్ ముందు జాగ్రత్తగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది.
అయితే వాహనాల పరిస్థితి బాగా లేకపోవడంతో కొద్ది వేగంతోనే రాకపోకలు సాగిస్తున్నాడు. ప్రమాదానికి ముందు వాహనం శబ్ధంలో మార్పును గమనించిన ఎమ్మెల్యే రాజాసింగ్ మరింత తక్కువ వేగంతో వాహనం నడిపాడు. తక్కువ వేగానికే వాహనంలోని చక్రం బయటకు వచ్చింది. అదే వేగం ఎక్కువగా ఉంటే వాహనంలోని అందరికీ ఘోర ప్రమాదం జరిగి ఉండేది. ఏమాత్రం జాగ్రత్తగా లేకపోయినా తనకే కాక, రోడ్డుపైన ఈ వాహనం కారణంగా ఎంత బీభత్సం జరిగేదోనని ఎమ్మెల్యే రాజా సింగ్ ఆవేదన వ్యక్తం చేశారు.
గతంలో పలుమార్లు ఈ వాహనం పరిస్థితిని ప్రభుత్వానికి తెలియజేసినా పట్టించుకోలేదని ఎమ్మెల్యే రాజా సింగ్ తెలిపాడు. వాహనం వదులుకోవడానికి సిద్ధమని చెప్పినా పదేపదే అదే వాహనాన్ని కేటాయించడం ప్రభుత్వ దుస్థితికి అద్దం పడుతోందని రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఈ వాహనాన్ని ప్రభుత్వం వెనక్కు తీసుకోవాలని తనకు అవసరం లేదని రాజాసింగ్ ప్రకటించారు. కాగా గతంలో పలుమార్లు ఇలాంటి సంఘటనలే జరిగాయి. నడిరోడ్డుపై వాహనాలు ఆగిపోవడంతో ఎమ్మెల్యే రాజా సింగ్ వాటిని అలాగే వదిలేసి వెళ్లిపోయారు. ఈ వాహనం వెనక్కి తీసుకోవాలని పలుమార్లు ప్రభుత్వానికి విన్నవించినా పట్టించుకోలేదు. దీనిపై నియోజకవర్గ ప్రజలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ ఎమ్మెల్యే ప్రాణానికి ముందే ముప్పు ఉందనే విషయం ప్రభుత్వానికి తెలిసినా కక్షపూరితంగానే పాడైన వాహనాలను పంపిస్తోందని రాజా సింగ్ అనుచరులు ఆరోపిస్తున్నారు.