»Tsrtc 10 Percent Discount Telangana Rtc Announced Another Offer To Passengers
TSRTC పెళ్లిళ్లకు బంపరాఫర్.. బంధుమిత్రులు తరలి రండి
దాదాపు మూడు నెలల పాటు పెళ్లిళ్ల సీజన్ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో పేదలు, మధ్య తరగతి ప్రజలకు అద్దె బస్సులను అతి తక్కువ ఖర్చుతో అందుబాటులో ఉంచుతోంది. ఈ ఆఫర్లతో ఆర్టీసీ సేవలను వినియోగించుకునేందుకు ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇలాంటి చర్యలతో నష్టాల్లో ఉన్న సంస్థ లాభాల బాటలోకి పయనిస్తోంది.
వినూత్న పథకాలు, కార్యక్రమాలతో తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ (TSRTC) ప్రజల మనసులు దోచేస్తోంది. క్రిస్మస్, కొత్త సంవత్సరం, సంక్రాంతి పండుగలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ప్రయాణికులకు అన్ని సౌకర్యాలు సమకూర్చింది. దీంతో సజావుగా రాకపోకలు సాగించడంతో ఆర్టీసీ ప్రయాణికులతో ప్రశంసలు అందుకుంది. కాగా ఆర్టీసీ సేవలను మరింత అందుబాటులోకి తీసుకువచ్చేందుకు అధికార యంత్రాంగం మరో సరికొత్త పథకం తీసుకొచ్చింది. ప్రస్తుతం వివాహా కార్యక్రమాలు అధికంగా ఉన్నాయి. దాదాపు మూడు నెలల పాటు పెళ్లిళ్ల సీజన్ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో పేదలు, మధ్య తరగతి ప్రజలకు అద్దె బస్సులను అతి తక్కువ ఖర్చుతో అందుబాటులో ఉంచుతోంది. ఈ మేరకు పది శాతం రాయితీ కల్పిస్తున్నట్లు తెలంగాణ ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ వీసీ సజ్జనార్ ప్రకటించారు.
కార్తీకమాసం, వన భోజనాలు, శబరిమల అయ్యప్ప దర్శనం సందర్భంగా అద్దె బస్సులకు పది శాతం రాయితీ (Discount)ని ఆర్టీసీ కల్పించింది. అయితే ఆ గడువు డిసెంబర్ 31తో ముగిసింది. ప్రస్తుతం శుభకార్యాలు అధికంగా ఉండడంతో ఆ ఆపర్ ను కొనసాగించనున్నట్లు ఆర్టీసీ తెలిపింది. శుభకార్యాల సమయంలో ప్రజలు ఇబ్బందులు పడకుండా అద్దె బస్సులపై 10 శాతం రాయితీ కల్పిస్తున్నట్లు ఆర్టీసీ వివరించింది. ప్రైవేటు వాహనాల కన్నా చాలా తక్కువ ధరకే బస్సులను అద్దెకు ఇస్తున్నట్లు ఎండీ సజ్జనార్ తెలిపారు. ముందస్తుగా ఎలాంటి నగదు డిపాజిట్ లేకుండానే ఈ సదుపాయం కల్పిస్తున్నట్లు వెల్లడించారు. ఈ ఆఫర్ (Offer)ను జూన్ 1వ తేదీ వరకు అమలు చేస్తామని ప్రకటించారు.
అద్దె బస్సును బుక్ చేసుకునేందుకు www.tsrtconline.inలో సంప్రదించవచ్చు. లేకపోతే సమీప ఆర్టీసీ డిపోలో సంప్రదించవచ్చు అని ఆర్టీసీ తెలిపింది. ప్రస్తుతం వేసవి సెలవులు, శుభకార్యాలు ఉండడంతో ఆఫర్ గడువును జూన్ దాకా పెంచారు. దీంతో ప్రజలకు ఆర్టీసీ సేవలు మరింత అందుబాటులోకి రానున్నాయి. కాగా త్వరలోనే మహా శివరాత్రి రాబోతున్నది. శివభక్తుల కోసం శైవ క్షేత్రాల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులను అందుబాటులోకి వచ్చింది. తెలంగాణ నుంచి పెద్ద ఎత్తున శివభక్తులు శ్రీశైలం సందర్శిస్తారు. ఈ నేపథ్యంలో శ్రీశైలానికి ఏకంగా 390 ప్రత్యేక బస్సులను TSRTC ఏర్పాటు చేసింది. ఈ నెల 16 నుంచి 19 వరకు ఈ బస్సులను నడపనుంది. ఎంజీబీఎస్, జేబీఎస్, దిల్సుఖ్నగర్, తదితర ప్రాంతాల నుంచి ఈ బస్సు సేవలు నడుస్తాయి. ముందస్తు రిజర్వేషన్ కోసం http://tsrtconline.inని సందర్శించవచ్చు.
బస్సు సేవలు అత్యధికంగా వినియోగించుకునేలా ఆర్టీసీ ప్రత్యేక ఆఫర్లు ప్రకటిస్తోంది. ప్రస్తుతం ఆర్టీసీలో రాయితీ ఆఫర్లు కొనసాగుతున్నాయి. ముందుస్తు రిజర్వేషన్ చేసుకునే వారికి రాయితీలను ప్రకటించింది. 31 రోజుల నుంచి 45 రోజుల ముందు రిజర్వేషన్ చేసుకుంటే టికెట్లో 5 శాతం రాయితీ కల్పించింది. 46 రోజుల నుంచి 60 రోజుల ముందు చేసుకుంటే 10 శాతం రాయితీని ప్రకటించింది. ఈ ఆఫర్లతో ఆర్టీసీ సేవలను వినియోగించుకునేందుకు ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇలాంటి చర్యలతో నష్టాల్లో ఉన్న సంస్థ లాభాల బాటలోకి పయనిస్తోంది. ప్రయాణికులకు వినోదం అందించేందుకు హైదరాబాద్ బస్సుల్లో రేడియో సదుపాయం కూడా కల్పించిన విషయం తెలిసిందే.