»Ktr Released Formula E Race Song Composed By Ss Thaman
Formula E రేస్ కు థమన్ దరువు.. అదిరే పాట.. హీరో ఆట
హైదరాబాద్ లో సరికొత్త క్రీడా సంబరం జరుగుతుండడంతో నగరవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచ స్థాయి నగరంగా అడుగులు వేస్తున్న హైదరాబాద్ లో ఇలాంటి క్రీడా ఉత్సవం జరుగడంతో భాగ్యనగరానికి మరో కీర్తి లభించనుంది.
తెలుగు సినీ పరిశ్రమలో ఇప్పుడు ఎస్ఎస్ థమన్ (SS Thaman) హవా నడుస్తోంది. అద్భుతమైన పాటలతో వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ అయిపోయాడు థమన్. సంగీతం కన్నా థమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కు ప్రేక్షకులు ఫిదా అయిపోతున్నారు. భాగమతి సినిమా నుంచి అఖండ, వీర సింహారెడ్డి సినిమా వరకు థమన్ దరువుకు సినీ ప్రజలు పిచ్చెక్కిపోతున్నారు. థమన్ పాటలకు ప్రేక్షకులు ఊగిపోతారు. మరి అలాంటి థమన్ భారతదేశంలోనే తొలిసారిగా హైదరాబాద్ (Hyderabad) గడ్డపై నిర్వహిస్తున్న ఫార్ములా రేస్ కోసం పాట రూపొందించాడు. ఈనెల 11న జరుగనున ఫార్ములా రేసింగ్ (Formula E Race) పోటీలకు థమన్ తో ఓ పాటను రూపొందించారు. ఈ పాటలో సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ మెరిశాడు. థమన్ తో కలిసి తేజ్ చిందులు వేశాడు.
ప్రపంచ ప్రసిద్ధ నగరాల్లో జరిగే ABB FIA ఫార్ములా E ప్రపంచ చాంపియన్ షిప్ రేసింగ్ మన హైదరాబాద్ నడిబొడ్డున జరుగనుంది. తెలంగాణ ప్రభుత్వం, మంత్రి కేటీఆర్ ప్రత్యేక శ్రద్ధతో ఈ రేస్ ను హైదరాబాద్ కు తీసుకొచ్చారు. ఈ రేస్ కు సంబంధించిన సన్నాహాకాలు నవంబర్, డిసెంబర్ లో జరిగిన విషయం తెలిసిందే. హుస్సేన్ సాగర్ ఒడ్డున తెలంగాణ కొత్త సచివాలయం చుట్టూ ట్రాక్ ను సిద్ధం చేశారు. ఈ రేస్ తో ట్యాంక్ బండ్ రూపురేఖలే మారిపోయాయి. ఈ రేస్ టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. దాదాపు 25 వేల మందికిపైగా ప్రేక్షకులు హాజరవుతారని సమాచారం.
అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఫార్ములా ఈ రేస్ కు తెలంగాణ ప్రభుత్వం ప్రచార కార్యక్రమాలను ముమ్మరంగా చేపట్టింది. ఇప్పటికే సినీ, క్రీడా, వ్యాపార ప్రముఖులతో రేసింగ్ పై ప్రచారం చేయించింది. ఆయా ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా ఈ రేస్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ రేస్ కు సంబంధించి ‘హైదరాబాద్ అంథెమ్’ (Hyderabad Anthem) పేరిట ఒక పాటను రూపొందించారు. థమన్ ఆధ్వర్యంలో ‘‘హైదరాబాద్ జాన్ దేఖో ఫార్ములా-ఈ’’ అంటూ సాగుతుంది. థమన్ కంపోజ్ చేసిన ఈ పాటను తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ (KTR) విడుదల చేశారు. భారత సంప్రదాయ భరతనాట్యంతో పాటు హిప్ హప్ డ్యాన్స్ ను జోడిస్తూ ఈ పాటను రూపొందించారు. సాయిధరమ్ తేజ్ అలా వచ్చి సందడి చేస్తాడు. ఈ పాట నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. కొరియోగ్రఫీ యశ్ మాస్టర్ చేశాడు.
గ్రీన్ కో సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ రేస్ కు హైదరాబాద్ ముస్తాబైంది. హుస్సేన్ సాగర్ ఒడ్డున 2.8 కిలోమీటర్ల ట్రాక్ ను సిద్ధం చేశారు. విదేశాలకు చెందిన ప్రముఖ రేసర్లు ఈ రేస్ లో పాల్గొననున్నారు. అందుకు తగ్గట్టు భారీ ఏర్పాట్లు ప్రభుత్వం చేసింది. ఈ రేస్ ను చూసేందుకు పెద్ద ఎత్తున సీటింగ్ సదుపాయం కల్పించారు. హైదరాబాద్ లో సరికొత్త క్రీడా సంబరం జరుగుతుండడంతో నగరవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచ స్థాయి నగరంగా అడుగులు వేస్తున్న హైదరాబాద్ లో ఇలాంటి క్రీడా ఉత్సవం జరుగడంతో భాగ్యనగరానికి మరో కీర్తి లభించనుంది.