తనపై రాష్ట్ర ప్రభుత్వం వేధింపులు.. కక్ష సాధింపు చర్యలు చేపట్టడంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) నుంచి నెల్లూరు రూరల్ (Nellore Rural) ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (Kotamreddy Sridhar Reddy) బయటకు వచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయనపై ప్రభుత్వం మరింత వేధింపులకు పాల్పడుతోంది. తాజాగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశా (AP Assembly Session) ల్లో కూడా శ్రీధర్ రెడ్డిపై మూకుమ్మడి దాడి మొదలైంది. మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు శ్రీధర్ రెడ్డిపై విమర్శలు పెంచేశారు. నియోజకవర్గ సమస్యలపై అసెంబ్లీలో ఆయన ప్రశ్నిస్తే ‘నమ్మక ద్రోహి’ అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పుట్టగతులు ఉండవని మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu) రెచ్చిపోయి మాట్లాడారు.
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) బడ్జెట్ సమావేశాలు గవర్నర్ ప్రసంగంతో ప్రారంభమైన విషయం తెలిసిందే. తన నియోజకవర్గంపై ప్రభుత్వం వివక్ష చూపిస్తోందని, సమస్యలు పరిష్కరించడం లేదని ఆరోపిస్తూ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అసెంబ్లీ నిరసన వ్యక్తం చేశారు. నాలుగేళ్ల నుంచి సమస్య పరిష్కారం కోసం తిరిగి తిరిగి విసిగిపోవడంతోనే తాను నిరసనకు దిగినట్లు ఎమ్మెల్యే తెలిపారు. అసెంబ్లీలో తనకు మైక్ ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్లకార్డు పట్టుకుని నిరసన వ్యక్తం చేస్తుండగా అతడిని పోలీసులు అడ్డుకున్నారు. నిరసన వ్యక్తం చేసే హక్కు ఒక సభ్యుడికి లేదా అని కోటంరెడ్డి ప్రశ్నించాడు.
సభలో కోటంరెడ్డికి మాట్లాడే అవకాశాన్ని స్పీకర్ (Speaker) ఇవ్వలేదు. స్పీకర్ తీరుకు నిరసనగా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సభలోనే నిరసన వ్యక్తం చేశారు. అతడి నిరసనపై సభా వేదికగా మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ (Buggana Rajendranath), అంబటి రాంబాబు అడ్డుకున్నారు. అసెంబ్లీలో సొంత పార్టీ ఎమ్మెల్యేపైనే ఎదురుదాడికి దిగారు. ‘ఎక్కడ ఏ వేదిక మీద ఎలా ప్రస్తావించాలో తెలుసుకోవాలి’ అని బుగ్గన సూచించాడు. ‘శ్రీధర్ రెడ్డి టీడీపీతో చేతులు కలిపారు. దురుద్దేశంతోనే కోటంరెడ్డి ఆందోళన చేస్తున్నాడు. నైతిక విలువ లేని వ్యక్తి శ్రీధర్ రెడ్డి. చంద్రబాబు, అచ్చెన్నాయుడు మెప్పు కోసం కోటంరెడ్డి మాట్లాడుతున్నాడు. నమ్మక ద్రోహి శ్రీధర్ రెడ్డి. నమ్మక ద్రోహం చేసిన వారికి పుట్టగతులు లేకుండా పోతాయి’ అని తీవ్రస్థాయిలో అంబటి రాంబాబు మండిపడ్డారు. ఈ క్రమంలో శ్రీధర్ రెడ్డికి శాసనసభ ద్వారా బెదిరింపులకు దిగాడు. ఈ వ్యవహారం చర్చనీయాంశమైంది.