»Brs Declares Boycott Of V6 Channel Velugu Newspaper From Covering Party Programmes
V6, Velugu Ban బీఆర్ఎస్ పార్టీ కీలక నిర్ణయం.. ఇకపై వాటికి ప్రవేశం లేదు
మంత్రి కేటీఆర్ విలేకరుల సమావేశంలో సదరు మీడియా సంస్థపై ఆగ్రహం వ్యక్తం చేసిన గంటల్లోనే బీఆర్ఎస్ వాటిపై నిషేధం విధించింది. కాగా ఈ నిర్ణయం వివాదాస్పదమవుతోంది. అధికార పార్టీ తన సమావేశాలకు ఓ మీడియా సంస్థను బహిష్కరించడం ప్రజాస్వామ్య విలువలకు పాతరేసినట్టుగా పేర్కొంటున్నారు.
ప్రజాస్వామ్యంలో మీడియా (Media)కు స్వేచ్ఛ (Freedom) ఉండడం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ గుప్పిట్లో ఉంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. జాతీయ మీడియా (National Media) మొత్తం నరేంద్ర మోదీ (Modi)కి దాసోహమయ్యాయి. దీంతో ప్రజల సమస్యలపై నిలదీసే అవకాశం లేకుండా పోయింది. ప్రజల తరఫున కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించే మీడియా సంస్థలు కరువయ్యాయి. ఇక రాష్ట్రంలో కూడా అదే ధోరణి కొనసాగుతోంది. అయితే ప్రభుత్వ తప్పిదాలను చెబుతున్న వీ6, వెలుగు (V6, Velugu) పత్రికలు బీజేపీకి సొంత సంస్థలా వ్యవహరిస్తోంది. బీజేపీకి ప్రచారం చేస్తూనే తెలంగాణ (Telangana)పై ద్వేషం వెళ్లగక్కుతోంది. తెలంగాణకు వ్యతిరేకంగా ప్రసారాలు, కథనాలు ప్రచురిస్తుండడంతో తెలంగాణ ప్రభుత్వం ఆ సంస్థపై కొన్ని ఆంక్షలు విధించింది. అయితే తాజాగా ఆ మీడియా సంస్థ మరింత రెచ్చిపోతుండడంతో బీఆర్ఎస్ పార్టీ (BRS Party) వీ6, వెలుగుపై నిషేధం విధించింది. తమ పార్టీ కార్యకలాపాలు, సమావేశాలకు సదరు సంస్థకు అనుమతి లేదని బీఆర్ఎస్ స్పష్టం చేసింది. సంబంధిత చానల్, పత్రిక ఇంటర్వ్యూలు, చర్చల్లో ఎవరూ పాల్గొనకూడదని పార్టీ నాయకత్వానికి పిలుపునిచ్చింది.
‘తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను అడుగడుగునా దెబ్బతీస్తూ, భారతీయ జనతా పార్టీకి కొమ్ముకాస్తున్న వీ6 ఛానల్, వెలుగు దినపత్రికలను బహిష్కరించాలని భారత రాష్ట్ర సమితి నిర్ణయం తీసుకుంది. ప్రజాస్వామ్యంలో నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన సదరు మీడియా సంస్థలు భారతీయ జనతా పార్టీ జేబు సంస్థగా మారి అబద్ధాలు, అసత్యాలు, కట్టుకథలతో బీఆర్ఎస్ పార్టీపైన, తెలంగాణ రాష్ట్రంపై విషం చిమ్మడమే ఏకైక అజెండాగా పని చేస్తున్నవి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ మీడియా సమావేశాలకు వీ6, వెలుగు మీడియా సంస్థలను అనుమతించకూడదని పార్టీ నిర్ణయించింది. దీంతోపాటు ఈ సంస్థలు నిర్వహించే చర్చలతో సహ ఎలాంటి కార్యక్రమాల్లోనూ పార్టీ ప్రతినిధులు ఎవరూ పాల్గొనకూడదని నిర్ణయం తీసుకుంది. బీజేపీ గొంతుకగా మారి విశ్వసనీయ కోల్పోయిన ఈ మీడియా సంస్థల అసలు స్వరూపాన్ని, అజెండాను తెలంగాణ ప్రజలు గ్రహించాలని బీఆర్ఎస్ పార్టీ విజ్ణప్తి చేస్తుంది’ అని బీఆర్ఎస్ పార్టీ ఓ లేఖ విడుదల చేసింది.
కాగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ (KT Rama Rao) విలేకరుల సమావేశంలో సదరు మీడియా సంస్థపై ఆగ్రహం వ్యక్తం చేసిన గంటల్లోనే బీఆర్ఎస్ వాటిపై నిషేధం విధించింది. కాగా ఈ నిర్ణయం వివాదాస్పదమవుతోంది. అధికార పార్టీ తన సమావేశాలకు ఓ మీడియా సంస్థను బహిష్కరించడం ప్రజాస్వామ్య విలువలకు పాతరేసినట్టుగా పేర్కొంటున్నారు. మీడియాకు స్వేచ్ఛ లేదని, కేసీఆర్ మీడియా గొంతు నొక్కుతున్నారని సీనియర్ జర్నలిస్టులు, జర్నలిస్టు సంఘాలు ఆరోపిస్తున్నారు. కాగా జాతీయ మీడియా సంస్థలు, మరికొన్ని సంస్థలు కేంద్రంపై నిలదీస్తున్నాయా? అని బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎదురు ప్రశ్నిస్తున్నారు.