»Kcr Target Maharashtra Brs Party Next Meeting At Kandhar Loha On March 26
BRS Party మహారాష్ట్రలో కేసీఆర్ మరో పోలికేక.. 26న భారీ సభ
ఇప్పటికే ఆ రాష్ట్రం నుంచి పెద్ద ఎత్తున చేరికలు జరుగుతున్నాయి. నాందేడ్ సభతో మరాఠ్వాడలో సంచలనం రేపిన కేసీఆర్ కాందార్ లోహ బహిరంగ సభతో ఇకపై ప్రత్యక్ష రాజకీయాలు మహారాష్ట్రలో మొదలుపెట్టనున్నారు. ఈ సభ ద్వారా మహారాష్ట్రలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీలోకి దిగుతుందని సమాచారం.
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్ పార్టీ) (Bharat Rashtra Samithi)ని మహారాష్ట్రలో విస్తృతం చేసేందుకు ఆ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (K Chandrashekar Rao) భావిస్తున్నారు. ప్రధానంగా మరాఠ గడ్డపైనే పూర్తి దృష్టి సారించారు. ఈ సందర్భంగా మహారాష్ట్రకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు, వివిధ పార్టీల ప్రతినిధులను పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. తొలిసారి నాందేడ్ (Nanded)లో నిర్వహించిన భారీ బహిరంగ సభతో మహారాష్ట్ర (Maharashtra)లో సంచలనం రేపిన కేసీఆర్ మరో భారీ బహిరంగ సభ మహారాష్ట్రలో నిర్వహించనున్నాడు. తన తదుపరి లక్ష్యం మరాఠ్వాడననే చెప్పకనే చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఈనెల 26వ తేదీన మహారాష్ట్రలో రెండో బహిరంగ సభ బీఆర్ఎస్ (BRS Party) నిర్వహించనుంది. ఈ మేరకు మంగళవారం ప్రగతి భవన్ (Pragati Bhavan) లో మహారాష్ట్రకు చెందిన పలువురు నాయకులు బీఆర్ఎస్ లో చేరారు.
మహారాష్ట్ర సీనియర్ రాజకీయ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే, ఎన్సీపీ కిసాన్ సెల్ అధ్యక్షుడు శంకరన్న ధోంగే, మాజీ ఎమ్మెల్యే నాగనాథ్ గిసేవాడ్, ఎన్సీపీ నాందేడ్ జిల్లా అధ్యక్షుడు దత్తా పవార్ తదితరులు కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా వేసుకున్నారు. అనంతరం మహారాష్ట్ర నాయకులతో కేసీఆర్ చర్చించారు. ఈ క్రమంలో మరో భారీ బహిరంగ సభ నిర్వహించాలని మరాఠా నాయకులు కోరారు. వారి విజ్ణప్తి మేరకు మార్చి 26న నాందేడ్ జిల్లా (Nanded District)లోని కాందార్ లోహ (Kandhar Loha)లో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు కేసీఆర్ అంగీకరించారు. ఆ సభలో మహారాష్ట్రకు చెందిన మరింత మంది కీలక నాయకులు బీఆర్ఎస్ లో చేరుతారని తెలుస్తున్నది. కాగా మహారాష్ట్రలో పార్టీ బాధ్యతలపై కొన్ని కమిటీలను వేసిన విషయం తెలిసిందే. పార్టీ బాధ్యులు బహిరంగ సభ ఏర్పాట్లు చూడనున్నారు.
కాగా గులాబీ పార్టీ నాందేడ్ సభ విజయవంతంతో మహారాష్ట్రపై ఉత్సాహంగా ఉంది. మరాఠా గడ్డలో పార్టీని పటిష్టం చేసేందుకు వ్యూహం రచిస్తున్నది. ఇప్పటికే ఆ రాష్ట్రం నుంచి పెద్ద ఎత్తున చేరికలు జరుగుతున్నాయి. నాందేడ్ సభతో మరాఠ్వాడలో సంచలనం రేపిన కేసీఆర్ కాందార్ లోహ బహిరంగ సభతో ఇకపై ప్రత్యక్ష రాజకీయాలు మహారాష్ట్రలో మొదలుపెట్టనున్నారు. ఈ సభ ద్వారా మహారాష్ట్రలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీలోకి దిగుతుందని సమాచారం. ఈ మేరకు కేసీఆర్ ఆ సభలో కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది.
కాగా మంగళవారం బీఆర్ఎస్ పార్టీలో చేరిన మహారాష్ట్ర నాయకులు వీరే.. ఎన్సీపీ యూత్ సెక్రటరీ శివరాజ్ ధోంగే, ఎన్సీపీ నాందేడ్ అధ్యక్షుడు శివదాస్ ధర్మపురికర్, కిసాన్ మోర్చా అధ్యక్షుడు మనోహర్ పాటిల్ భోసికర్, ఎన్సీపీ అధికార ప్రతినిధి డాక్టర్ సునీల్ పాటిల్, ఎన్సీపీ లోహ అధ్యక్షుడు సుభాష్ వాకోరే, ఎన్సీపీ కాందార్ అధ్యక్షుడు దత్తా కరమాంగే, జిల్లా పరిషత్ సభ్యులు అడ్వొకేట్ విజయ్ ధోండగే, ఎన్సీపీ యూత్ ప్రెసిడెంట్ హన్మంత్ కళ్యాంకర్, ప్రవీణ్ జాతేవాడ్, సంతోష్ వార్కాడ్, స్వాప్నిల్ ఖీరే తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ విధివిధానాలు, భవిష్యత్ కార్యాచరణ గురించి సీఎం కేసీఆర్ తో వారు సుదీర్ఘంగా చర్చించారు. భారీ బహిరంగ సభకు పెద్ద ఎత్తున తమ అనుచరులు, కార్యకర్తలు, ప్రజలను తరలించాలని కేసీఆర్ వారికి ఆదేశించారు.