»New Headache To Telangana Govt On Tspsc Question Paper Leaks
TSPSC Leake తెలంగాణలో ‘ప్రవీణ్ లీక్స్’ చిచ్చు.. ప్రభుత్వానికి తలనొప్పి
అత్యుత్తమంగా ఆధునిక సాంకేతిక పరిజ్ణానంతో సేవలు అందిస్తున్నందుకు అవార్డులు కూడా దక్కాయి. కాగా ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టుకోలేడు అన్నట్టు సొంత కార్యాలయంలో ప్రవీణ్ పశ్నాపత్రాలు లీక్ చేస్తాడని ఎవరూ ఊహించలేదు.
గత ఉగాది సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (K Chandrashekar Rao) భారీగా ఉద్యోగ ప్రకటనలు చేశారు. అసెంబ్లీ వేదికగా 80 వేల ప్రభుత్వ ఉద్యోగాల (80 Thousand Govt Jobs)ను భర్తీ చేస్తామని ప్రకటించారు. దానికి అనుగుణంగా ప్రకటనలు వెలువడి.. కొన్నింటి పరీక్షలు (Exams) జరుగుతున్నాయి. సజావుగా సాగుతున్న ఈ ప్రక్రియలో ప్రవీణ్ లీక్స్ (Praveen Leakes) ఒక్కసారిగా చిచ్చు రేపింది. టీఎస్ పీఎస్సీ (TSPSC)లో పని చేసే ప్రవీణ్ రేణుక అనే ఉపాధ్యాయురాలి (Women Teacher) వలలో పడి అన్ని ప్రవేశ పరీక్షల ప్రశ్నాపత్రాలు (Question Paper) లీక్ చేసినట్లు సమాచారం అందుతోంది. ప్రవీణ్ లీక్స్ తో తెలంగాణ ప్రభుత్వం (Govt Of Telangana) ఇరకాటంలో పడింది. అత్యంత ప్రతిష్టాత్మకంగా ఉద్యోగాల భర్తీ (Employment) చేపడుతుండగా ఆ ప్రతిష్ట అంతా మసక బారినట్టయ్యింది. తాజా లీక్స్ వ్యవహారంతో తెలంగాణ ప్రభుత్వానికి కొత్త తలనొప్పి పట్టుకుంది. ప్రశ్నాపత్రాల లీక్ పై అన్ని విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి.
కమిషన్ కార్యాలయం (TSPSC Office)లో పని చేసే ప్రవీణ్ మహిళ మాయలో పడి అత్యంత భద్రత నడుమ ఉండే ప్రశ్నాపత్రాలను దొంగలించాడు. అలా మొదట టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీస్, వెటర్నరీ అసిస్టెంట్ పరీక్ష పత్రాలు లీక్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో విచారణ చేసిన కొద్దీ ప్రవీణ్ అక్రమాలు, దొంగతనాలు వరుసగా బయటకు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు గ్రూప్ 1 ప్రిలిమ్స్ కూడా లీకయినట్లు తెలుస్తున్నది. టీఎస్ పీఎస్సీ గతంలో నిర్వహించిన పరీక్షలపై కూడా అనుమానాలు మొదలవుతున్నాయి. ఈ వ్యవహారం చినికి చినికి గాలివానగా మారుతోంది. దీంతో ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కాంగ్రెస్, బీజేపీతో పాటు టీడీపీ, కమ్యూనిస్టులు కూడా విద్యార్థుల తరఫున పోరాటానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే టీఎస్ పీఎస్సీ కార్యాలయాన్ని తెలంగాణ జన సమితి, యువజన కాంగ్రెస్, ఏబీవీపీ తదితర సంఘాలు ముట్టడించాయి. కమిషన్ కార్యదర్శి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. గతంలో నిర్వహించిన పరీక్షలన్నీ రద్దు చేయాలని కూడా నిరుద్యోగులు డిమాండ్ చేశారు. వీరి డిమాండ్ కు ఒకప్పటి తెలంగాణ జేఏసీ చైర్మన్, ప్రస్తుత తెలంగాణ జన సమితి పార్టీ అధినేత ప్రొఫెసర్ కోదండ రామ్ డిమాండ్ చేశారు. ఏ పరీక్షల ప్రశ్నాపత్రాలు లీకయ్యాయో తెలియని పరిస్థితిలో గతంలో నిర్వహించిన పరీక్షలన్నిటింని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ లీకేజ్ వ్యవహారంపై ప్రతిపక్షాలు మండిపడుతుండగా అధికార పార్టీ నుంచి ఒక్కరూ నోరు మెదపలేదు. ఈ వ్యవహారంపై మాట్లాడేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు.
కాగా ప్రశ్నాపత్రం లీకేజ్ వ్యవహారాన్ని టీఎస్ పీఎస్సీ తీవ్రంగా భావిస్తున్నది. అత్యంత పారదర్శకంగా ఉద్యోగ నియామకాలు చేపడతామనే పేరు దేశవ్యాప్తంగా ఉంది. అత్యుత్తమంగా ఆధునిక సాంకేతిక పరిజ్ణానంతో సేవలు అందిస్తున్నందుకు అవార్డులు కూడా దక్కాయి. కాగా ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టుకోలేడు అన్నట్టు సొంత కార్యాలయంలో ప్రవీణ్ పశ్నాపత్రాలు లీక్ చేస్తాడని ఎవరూ ఊహించలేదు. దీనిపై వెంటనే కమిషన్ దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టింది. ప్రభుత్వం ఆదేశాలతో కమిషన్ వెంటనే చర్యలు చేపట్టింది. సంస్థాగతంగా విచారణ చేపట్టిన అనంతరం గతంలో జరిగిన పరీక్షలు.. జరగబోయే పరీక్షలపై ఒక ప్రకటన వెలువరించే అవకాశం ఉంది.