వాతావరణం (Climate)లో అనూహ్య మార్పులు రానున్నాయి. ఇప్పటికే ఉష్ణోగ్రతలు (Temperatures) పెరిగి వాతావరణం (Weather) వేడి (Hot)గా ఉంటోంది. విద్యుత్ అవసరం భారీగా పెరిగింది. ఈ సమయంలో ప్రజలకు చల్లటి కబురు అందింది. మూడు రోజుల పాటు తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉరుము మెరుపులతో వానలు, ఈదురుగాలులు వీస్తాయని వెల్లడించింది. తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి గాలులు వీస్తుండడంతో వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ (Meteorological Department) హైదరాబాద్ (Hyderabad) డైరెక్టర్ k. నాగరత్న (K Nagaratna) వివరించారు.
-15వ తేదీన మధ్యాహ్నం నుంచి ఉత్తర, పశ్చిమ జిల్లాల్లో ఆదిలాబాద్, కుమ్రమ్ భీమ్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, కామారెడ్డి, సిరిసిల్ల, హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన మోస్తరు జల్లులు కురుస్తాయి.
– 16న మధ్యాహ్నం నుంచి ఆదిలాబాద్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో వడగళ్లు పడే అవకాశం ఉంది. ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచించింది.
– 17న నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. కొన్ని చోట్ల గాలి తీవ్రత అధికంగా ఉండవచ్చు.
తూర్పు ఆగ్నేయ దిశల నుంచి పశ్చిమ దిశగా వీచే గాలులు తీవ్రంగా ఉంటాయని, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని డైరెక్టర్ నాగరత్న తెలిపారు. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఆయా జిల్లాల యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రస్తుతం మామిడ పూత నుంచి కాత దశకు చేరుకుంది. అకస్మాత్తుగా కురిసే వర్షాలు, ఈదురుగాలులకు మామిడి కాత దెబ్బతినే ప్రమాదం ఉంది. రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వ అధికారులు సూచిస్తున్నారు.