అధికారం కోసం వెంపర్లాడుతున్న భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి ప్రజల ఆదరణ ఎంతమాత్రం ఉందో కానీ పార్టీ నాయకత్వం (Leadership)లో మాత్రం ఆధిపత్యం కొరవడింది. పార్టీ నాయకుల (Leaders) మధ్య విబేధాలు తారస్థాయిలో ఉన్నాయి. పార్టీలో గ్రూపు రాజకీయాలు (Group Politics) తీవ్రమయ్యాయి. ఒకరితో ఒకరికి సంబంధం లేనట్టు వ్యవహారాలు కొనసాగుతున్నాయి. పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay Kumar) వివాదానికి కేంద్రంగా మారాడు. ఇటీవల బీఆర్ఎస్ (BRS Party) ఎమ్మెల్సీ, భారత జాగృతి (Bharath Jagruthi) వ్యవస్థాపకురాలు కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha)పై సంజయ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇతర పార్టీల నాయకులు సంజయ్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేయగా.. తాజాగా సొంత పార్టీ నాయకులే విమర్శిస్తున్నారు. ఆ వ్యాఖ్యలను నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ (Dharmapuri Arvind) తప్పుబట్టడం పార్టీలో కలకలం రేపింది. అరవింద్ తప్పుబట్టడాన్ని ఎమ్మెల్యే రాజా సింగ్ (Raja Singh) ఖండించారు. అరవింద్ వ్యాఖ్యలకు పార్టీ సీనియర్ నాయకుడు పేరాల శేఖర్ రావు (Perala Shekar Rao) మద్దతు తెలిపారు. ఈ విధంగా ఒకరి వ్యాఖ్యలను మరికొరు ఖండిస్తూ పార్టీలోని విబేధాలను బట్టబయలు చేస్తున్నారు.
పార్టీలో ప్రస్తుతం ఐదారు గ్రూపులు ఉన్నాయి. బండి సంజయ్ వర్గం, అరవింద్ వర్గం, ఈటల రాజేందర్ గ్రూపు, విజయశాంతి, వివేక్ గ్రూపు ఇలా పార్టీలో చాలా వర్గాలు ఏర్పడ్డాయి. ఈ వర్గాలకు ఒకరంటే ఒకరు పడరు. పార్టీలో ఆధిపత్యం చెలాయించేందుకు ఈ వర్గాలు ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో ఒక వర్గానికి మరో వర్గానికి పడడం లేదు. గతంలో విజయశాంతి పార్టీ వ్యవహారాలపై ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. తనకు గౌరవం ఇవ్వడం లేదని అలకబూనారు. పెద్దలు కల్పించుకుని శాంతపర్చడంతో ఆమె తిరిగి యాక్టీవ్ అయ్యారు. ప్రస్తుతం దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ పార్టీకి అంటిముట్టనట్లు ఉన్నారు. ఈటల రాజేందర్ కూడా అంతే. పార్టీలో చేరినప్పుడు ఇచ్చిన గౌరవం ఇప్పుడు లేదని గుర్తు చేసుకుంటున్నారు. పార్టీ చేరికల కమిటీ చైర్మన్ గా ఉన్న తనకు పార్టీ నాయకత్వం సహకరించడం లేదని ఈటల ఆగ్రహంతో ఉన్నారు. దీంతోనే పార్టీలో చేరికలకు బ్రేక్ పడింది.
క్రమశిక్షణ కలిగిన పార్టీగా గతంలో బీజేపీ ఉండేది. పార్టీ అధిష్టానం మాటే శాసనంగా ఉండేది. ‘బండి సంజయ్ వ్యాఖ్యలు నేను సమర్ధించను. బీజేపీకి ఆయన వ్యాఖ్యలు సంబంధం లేదు. పార్టీ అధ్యక్ష పదవి అనేది పవర్ సెంటర్ కాదు’ అని అరవింద్ పేర్కొన్నాడు. నియంతృత్వం, అవివేకం, ఒంటెత్తు పోకడలతో సంజయ్ ముందుకు వెళ్తున్నట్లు పార్టీలో చర్చ జరుగుతోంది. అంతర్గత కుమ్ములాటలు కవిత వ్యవహారంతో బయటకు వచ్చాయి.
కాగా సంజయ్ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. నోటీసులు జారీ చేయడాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, పార్టీ సీనియర్ నాయకుడు లక్ష్మణ్, ఈటల రాజేందర్, విజయశాంతి తదితరులు స్పందించలేదు. ఈ విషయాన్ని పేరాల శేఖర్ రావు ప్రస్తావించారు. వారు స్పందించకపోవడంపై తప్పుబట్టారు. ఎన్నికలకు సమయం సమీపిస్తున్న సమయంలో పార్టీలో విబేధాలు రావడం చేటు చేస్తాయని కమలం శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.