»9 Members Arrest On Tspsc Question Paper Leakage Case
TSPSC 9 మంది అరెస్ట్.. తమ్ముడి కోసం అక్క ఆరాటం
ఒక తప్పు వారి ఉద్యోగాలు కోల్పోవడంతో పాటు ప్రస్తుతం నేరస్తులుగా జైల్లో మగ్గాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ వ్యవహారం ఓ అభ్యర్థి ద్వారా బహిర్గతం కావడంతో టీఎస్ పీఎస్సీ స్పందించింది.
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్ పీఎస్సీ) TSPSC ప్రశ్నాపత్రాల (Question Paper Leakage) లీకేజీలో కీలక మలుపు చోటుచేసుకుంది. పత్రాన్నీ లీక్ చేసిన వారు 9 మంది ఉండగా వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ అక్క తన తమ్ముడికి ప్రభుత్వ ఉద్యోగం (Govt Job) సాధించేలా చేయడానికి చేసిన ప్రయత్నమే ప్రశ్నాపత్రం లీక్ కు కారణం. అరెస్టయిన వారిలో అక్కా తమ్ముడితో పాటు మిగతా వారు ఉన్నారు. వారి నుంచి 4 పెన్ డ్రైవ్ లు, 3 ల్యాప్ టాప్లు , కంప్యూటర్, 5 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్ (Hyderabad)లోనీ పోలీస్ కమిషనరేట్ (Police Commissionarate) కార్యాలయంలో సోమవారం రాత్రి గోషామహల్ ఏసీపీ సతీశ్ కుమార్, బేగంబజార్ సీఐ శంకర్, టాస్క్ ఫోర్స్ సెంట్రల్ జోన్ ఇన్ స్పెక్టర్ రఘునాథ్, టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావు, సౌత్ వెస్ట్ జోన్ డీసీపీ కిరణ్ ఖరే తదితరులు ఈ పేపర్ లీకేజ్ వ్యవహారంపై వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా నిందితులను మీడియా ముందుకు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఏపీలోని రాజమహేంద్రవరానికి (Rajamahendravaram) చెందిన పులిదిండి ప్రవీణ్ కుమార్ (32) బీటెక్ పూర్తి చేశాడు. అతడి తండ్రి హరిచంద్రరావు ప్రభుత్వ ముద్రణాలయంలో అదనపు ఎస్పీగా (Additional SP) పని చేశారు. ఆకస్మికంగా మరణించడంతో కారుణ్య నియామకం కింద అతడి కుమారుడు ప్రవీణ్ జూనియర్ అసిస్టెంట్ గా టీఎస్ పీఎస్సీలో ఉద్యోగంలో చేరాడు. 2017 నుంచి అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (ఏఎస్ఓ-ASO)గా పని చేస్తున్నాడు. అతడికి మహబూబ్ నగర్ జిల్లా (Mahabub Nagar District) పగిడ్యాల్ పంచగల్ తండాకు చెందిన రేణుక (35) పరిచయమైంది. ఓ దరఖాస్తులో దొర్లిన తప్పులను సరి చేసుకునేందుకు కార్యాలయానికి వచ్చిన సమయంలో ప్రవీణ్ తో మాట కలిసింది. అతడి ఫోన్ నంబర్ తీసుకుని తరచూ మాట్లాడుతుండేది.
ఇదే అదునుగా చూసుకుని రేణుక తన సోదరుడు అభ్యర్థి రాజేశ్వర్ నాయక్ (33) కోసం ప్రశ్నాపత్రాలను దొంగిలించాలని పథకం రచించింది. వికారాబాద్ జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగిగా పని చేస్తున్న తన భర్త ఢాక్య నాయక్ (38)కు రేణుక విషయం చెప్పింది. వారిద్దరూ కలిసి ప్రవీణ్ తో ఒప్పందం చేసుకున్నారు. ఈ ముగ్గురికి టీఎస్ పీఎస్సీలో నెట్ వర్క్ అడ్మిన్ (Network Admin)గా పని చేస్తున్న రాజశేఖర్ రెడ్డి జతయ్యాడు. కమిషన్ కార్యదర్శి వ్యక్తిగత సహాయకుడి (పీఏ-PA)గా పని చేస్తున్న ప్రవీణ్ కార్యదర్శి డైరీ (Diary)లోని ఐపీ అడ్రస్ (IP Address)ను దొంగిలించాడు. రాజశేఖర్ తో కలిసి కార్యాలయం ఇన్ చార్జ్ కంప్యూటర్ నుంచి వివిధ విభాగాల ప్రశ్నాపత్రాల ఫోల్డర్ ను ప్రవీణ్ 4 పెన్ డ్రైవ్ లలోకి కాపీ చేశాడు. అనంతరం అక్కడే కొన్ని ప్రింట్ లు తీసుకున్నాడు. అసిస్టెంట్ ఇంజనీర్ పశ్నాపత్రాలు కూడా తీసుకున్నాడు.
ఇక బయటకు వచ్చాక రేణుక, ఢాక్యా నాయక్ దంపతులతో ప్రవీణ్ రూ.5 లక్షలు తీసుకుని ఆ పత్రాలు వారికి ఇచ్చాడు. అనంతరం తన ఇంట్లోనే రేణుక, ఢాక్యా నాయక్ తో పాటు అభ్యర్థి రాజేశ్వర్ నాయక్ లను బడంగ్ పేట్ లోని తన నివాసంలో ఉంచాడు. ఇక ఈ నెల 5న రాజేశ్వర్ ను దగ్గరుండి పరీక్ష రాయించాడు. ఈ నెల 6న ప్రవీణ్ కు మరో రూ.5 లక్షలు ఇచ్చారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా ఆ దంపతులకు దురాశ కలిగింది. ఆ పేపర్లను విక్రయించాలని సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే మేడ్చల్ కానిస్టేబుల్ శ్రీనివాస్ (30)ని సంప్రదించగా అతడు ఇతర అభ్యర్థుల పేర్లు ఇచ్చాడు. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన నీలేశ్ నాయక్ (28), గోపాల్ నాయక్ (29) సంప్రదించగా వారికి ప్రశ్నాపత్రాలు ఇచ్చేందుకు రూ.13.50 లక్షలకు ఏఈ సివిల్ పశ్నాపత్రాలు ఇచ్చారు.
ఈ వ్యవహారం ఓ అభ్యర్థి ద్వారా బహిర్గతం కావడంతో టీఎస్ పీఎస్సీ స్పందించింది. మొత్తం 9 మంది నిందితులను అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించినట్లు పోలీస్ అధికారులు తెలిపారు. కాగా నేరానికి పాల్పడిన ఐదుగురు ఉద్యోగులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోనుంది. వారిని ఉద్యోగాల నుంచి తొలగించనున్నారు. ఇప్పటికే ప్రవీణ్ కుమార్ పై కమిషన్ వేటు వేసింది. ఒక తప్పు వారి ఉద్యోగాలు కోల్పోవడంతో పాటు ప్రస్తుతం నేరస్తులుగా జైల్లో మగ్గాల్సిన పరిస్థితి ఏర్పడింది.