అగ్ని ప్రమాదం కోటిన్నర హవాలా ధనాన్ని పట్టించింది. ఈ ఘటన సికింద్రాబాద్ లో జరిగింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నగదును స్వాధీనం చేసుకున్నారు. సికింద్రాబాద్ రెంజిమెంట్ బజార్ లోని ఓ ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగింది. అగ్నికీలలు ఎగిసిపడుతుండటంతో చుట్టుపక్కల వాళ్లు అగ్నిమాపక కేంద్రానికి, పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు మంటలను ఆర్పారు. అప్పటికే మంటలు చెలరేగి ఆ ప్రాంతం పొగతో నిండిపోయింది.
ఇంట్లో వుడ్ వర్క్ ఎక్కువగా ఉండటంతో మంటలు తొందరగా వ్యాపించినట్లు పోలీసులు తెలిపారు. ఘటన జరిగినప్పుడు ఇంట్లో ఎవరూ లేరు. ఇంటి మొత్తాన్ని పోలీసులు పరిశీలించగా ఓ చోట నోట్ల కుప్ప కనిపించింది. అప్రమత్తమైన పోలీసులు స్థానిక ఐటీ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఈ డబ్బును హవాలా ధనంగా గుర్తిస్తున్నాట్లు చెప్పారు. ఇంటి యజమాని శ్రీనివాస్ ఓ కంపెనీలో డీజీఎంగా పనిచేస్తున్నారు. దీంతో పాటే ప్రభుత్వ విద్యుత్ శాఖలో కాంట్రాక్టు పనులు చేస్తున్నట్లు గుర్తించారు. హావాలా లావాదేవీలను శ్రీనివాస్ నడుపుతున్నాడా అన్న కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.
ఇంట్లో ఎవరూ లేకపోవడం, అగ్నిప్రమాదంలో భారీగా నగదు పట్టుబడటాన్ని చూస్తుంటే… తెలిసిన వారే ఈ పనిని చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మంటలు ఇల్లంతా వ్యాపించడంతో దట్టమైన పొగలు ఇంటిచుట్టూ అలుముకున్నాయి. చుట్టు ప్రక్క పాంతాలకు పొగవ్యాపించడంతో స్థానికులు భయానికి లోనయ్యారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకురావడంతో అందరూ ఉపిరి పీల్చుకున్నారు. అయితే ప్రమాదం జరిగినప్పుడు ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం జరగలేదని పోలీసులు తెలిపారు. కానీ.. ఒక ప్లాన్ ప్రకారమే చేసినట్లు అనుమానిస్తున్నారు.