»Huge Fire Accident In Kuwait 41 People Were Burnt Alive
fire accident: కువైట్‌లో భారీ అగ్ని ప్రమాదం.. 41 మంది సజీవ దహనం
కువైట్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 41 మంది భారతీయులు చనిపోయారు. మరో 50 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలిసిన వెంటనే ...కువైట్‌లోని భారత ఎంబసీ అధికారులు రంగంలో దిగారు.
Huge fire accident in Kuwait.. 41 people were burnt alive
fire accident: కువైట్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 41 మంది భారతీయులు చనిపోయారు. మరో 50 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలిసిన వెంటనే …కువైట్‌లోని భారత ఎంబసీ అధికారులు రంగంలో దిగారు. క్షతగాత్రులను పరామర్శించారు. వారికి ధైర్యం చెప్పారు. మరోవైపు కేంద్ర విదేశాంగ శాఖా మంత్రి జై శంకర్ కూడా స్పందించారు. బాధితులందరినీ ఆదుకుంటామని అభయమిచ్చారు. కువైట్‌లోని మంగాఫ్ ప్రాంతంలో ఓ ఆరంతుస్తుల బిల్డింగ్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. ఆ బిల్డింగ్‌లో ఉన్న ఓ కిచెన్‌లో నుంచి వచ్చిన మంటలు.. మొత్తంగా వ్యాపించాయి. అనేక మంది ప్రాణాలను బలి తీసుకున్నాయి. ఆ బిల్డింగ్‌లో మొత్తం 160 మంది ఉన్నట్లు తెలుస్తోంది. దాదాపుగా అందరూ భారత సంతతికి చెందిన వ్యక్తులేనని తెలుస్తోంది. ప్రమాద విషయం తెలిసిన వెంటనే …ఇండియన్ ఎంబసీ రంగంలో దిగింది. సహాయక చర్యలు ప్రారంభించారు. గాయపడిన వారందరినీ సమీపంలోని వివిధ ఆసుపత్రులకు తరలించారు. మరికొందరు అధికారులు ఆసుపత్రుల్లోని క్షతగాత్రులను పరామర్శించారు. వారికి మెరుగైన వైద్యం అందేలా ఏర్పాట్లు చేశారు. వారి బాగోగులు తెలుసుకునేందుకు కొన్ని హెల్ప్‌లైన్ నెంబర్లను కూడా అందుబాటులోకి తీసుకువచ్చారు. బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని అధికారులు భరోసా ఇచ్చారు.
కువైట్ జనాభాలో దాదాపుగా 10 లక్షల మంది భారతీయులే ఉన్నారు. అందులో 9 లక్షల మంది వివిధ సంస్థల్లో పని చేసుకుంటూ జీవిస్తున్నారు. కువైట్‌లో అగ్ని ప్రమాద విషయం తెలియగానే కేంద్ర విదేశాంగ శాఖా మంత్రి జై శంకర్ స్పందించారు. చనిపోయిన వారి కుటుంబీకులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారంతా త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ దుర్ఘటన ద్వారా బాధితులుగా మారిన అందరికీ తాము అండగా ఉంటామని జైశంకర్ అభయమిచ్చారు. మరోవైపు కువైట్ ప్రభుత్వం.. ఈ దుర్ఘటనపై విచారణ ప్రారంభించింది. మంగాఫ్ బిల్డింగ్ యజమానికి వెంటనే అదుపులోకి తీసుకోవాలని కువైట్ మంత్రి షేక్ ఫహద్ ఆదేశించారు. బిల్డింగ్ యజమానుల దురాశ కారణంగా ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుందని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి దుర్ఘటనలు మరోసారి జరగకుండా ఉండేందుకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు.