»Southwest Monsoon Set To Further Advance Towards Telangana More Rains Expected
TS : రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించిన నైరుతి రుతుపవనాలు.. మూడురోజుల పాటు వర్షాలు
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మూడు రోజుల పాటు వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ చదివేయండి.
Monsoon : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నైరుతీ రుతుపవనాలు(Southwest Monsoon) విస్తరించాయి. ఫలితంగా నేటి నుంచి మూడు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పలు జిల్లాల్లో వానలు పడే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ సైతం జారీ చేసింది. బుధ, గురు, శుక్రవారాల్లో పలు చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షం పడే అవకాశాలు ఉన్నాయని వెల్లడించింది.
వర్షాలతోపాటు గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు భారీగా తగ్గుముఖం పట్టాయి. వేసవి తాపం నుంచి ఇప్పుడిప్పుడే ప్రజలకు కాస్త స్వాంతన లభిస్తోంది. మంగళవారం కూడా తెలంగాణలోని(Telangana) పలు ప్రాంతాల్లో చెదురు మదురుగా వర్షాలు కురిశాయి. గద్వాల్, నారాయణ పేట, వనపర్తి, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, సంగారెడ్డి, రంగారెడ్డి, వికారాబాద్, నల్గొండ, సూర్యాపేట తదితర చోట్ల వర్షాలు కురిశాయి. మరో మూడు రోజుల పాటు ఈ వానలు కొనసాగనున్నాయి.