Chandrababu : ప్రమాణ స్వీకారానికి భారీగా జనం.. ఆ టోల్‌ప్లాజా దగ్గర భారీగా వాహనాలు
చంద్రబాబు నాయుడు ఈ ఉదయం కృష్ణా జిల్లా కేసరపల్లిలో ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో జనం భారీగా తరలి వస్తున్నారు. ఖాజా టోల్ ప్లాజా దగ్గర రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Chandrababu oath ceremony : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ ఉదయం 11.27గంటలకు కృష్ణా జిల్లా కీసరపల్లిలో ఆయన ప్రమాణ స్వీకారోత్సవం(oath ceremony) జరగనుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ మంగళవారం సాయంత్రానికే పూర్తయ్యాయి. ఈ ఉదయం నుంచి విజయవాడ, గన్నవరం రోడ్డు కోలాహలంగా మారింది. భారీ సంఖ్యలో ప్రజలు, టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు తరలివస్తున్నారు.
ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్‌లు ఉండనున్నారు. వీరు సహా మొత్తం 24 మంది మంత్రుల జాబితాను మంగళవారం అర్ధరాత్రి దాటాక ప్రకటించారు. ఒక స్థానాన్ని మాత్రం ఖాళీగా ఉంచారు. జనసేనకు మూడు, బీజేపీకి ఒక పదవిని కేటాయించారు.
ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా సహా పలువురు కేంద్ర మంత్రులు, సీఎంలు, సినీ, రాజకీయ ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరు అవుతున్నారు. ఈ హడావిడి మధ్య ఖాజా టోల్ ప్లాజా దగ్గర రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో అక్కడ ట్రాఫిక్ జాం అయింది. అలాగే ప్రమాణ స్వీకార ప్రాంగణం వద్ద పోలీసుల ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఎక్కడికక్కడ బారికేడ్లు పెట్టడంతో రహదారులన్నీ జనమయం అయ్యాయి. వాహన చోదకులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.