సుదీర్ఘ విరామం తర్వాత ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు (Andhra Pradesh Budget Sessions) ప్రారంభమయ్యాయి. ఆలస్యంగా మేల్కొన్న ప్రభుత్వం ఎట్టకేలకు బడ్జెట్ సమావేశాలను ప్రారంభించింది. బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా మంగళవారం శాసనసభ, మండలిని ఉద్దేశించి కొత్త గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ (Justice Syed Abdul Nazeer) ప్రసంగించారు. 2023-24 వార్షిక బడ్జెట్ సందర్భంగా గవర్నర్ కీలక ప్రసంగం చేశారు.
గవర్నర్ ప్రసంగం ఇలా.. ‘5 కోట్ల మంది ప్రజల ఆకాంక్షల కోసం పాలన సాగుతోంది. సమీకృత అభివృద్ధి కోసం పారదర్శక పాలన అందిస్తున్నాం. నవరత్నాలతో సంక్షేమ పాలన జరుగుతోంది. అర్హులైన లబ్ధిదారులందరికీ ఇంటి వద్దకు సంక్షేమ పథకాలు అందిస్తున్నాం. కులాలు, మతాలకతీతంగా సంక్షేమ పథకాలు అందుతున్నాయి. వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగాల్లో అనూహ్య ప్రగతి సాధిస్తున్నాం. 11.43 శాతం వృద్ధి రేటు సాధించాం. ఆర్థికాభివృద్ధి ఏపీ ముందంజంలో ఉంది. 45 నెలల్లో 1.97 లక్షల కోట్ల నగదు ప్రజలకు చేరింది’ అని జస్టిస్ అబ్దుల్ నజీర్ తన ప్రసంగంలో తెలిపారు.
‘లబ్ధిదారుల గుర్తింపు కోసం వాలంటీర్లు, సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చాం. 2020-21లో జీఎస్డీపీ వృద్ధి రేటులో ఏపీ నంబర్-1లో ఉంది. మొత్తంగా 11.43 శాతం అభివృద్ధి సాధించాం. విద్యా ప్రమాణాలు పెంచేందుకు కృషి చేస్తున్నాం. నాడు-నేడుతో పాఠశాలల ఆధునీకరణ, మధ్యాహ్న భోజన పథకం అమల్లోకి తెచ్చాం. రూ.9,900 కోట్లతో 44 లక్షల మంది తల్లులకు అమ్మఒడి అందజేశాం. ప్రతి సంవత్సరం రూ.15 వేలు ఒక్కో లబ్ధిదారుడికి అందిస్తున్నాం’ అని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ తన ప్రసంగంలో వెల్లడించారు.
కాగా ఈ సమావేశాల ద్వారా జగన్ అరాచక పాలనను ఎత్తి చూపాలని తెలుగుదేశం పార్టీ భావిస్తున్నది. విద్యుత్ చార్జీల పెంపు, నిరుద్యోగం, పోలవరం, రైతుల సమస్యలు, రోడ్ల సమస్యలు వంటి వాటిపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సిద్ధమయ్యారు. మొత్తం 15కు పైగా సమస్యలపై ఉభయసభల్లో చర్చలకు పట్టుబట్టాలని పార్టీ అధినేత ఆదేశంతో తెలుగు తమ్ముళ్లు సమావేశాలకు హాజరయ్యారు.
ప్రసంగం అనంతరం స్పీకర్ తమ్మినేని సీతారాం ఆధ్వర్యంలో బీఏసీ సమావేశమైంది. ఈనెల 24వ తేదీ వరకు ఈ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. కనీసం 7, 8 రోజులు ఉండేలా చూసుకుంటోంది. కాగా మంత్రిమండలి సమావేశం కానుంది. అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టే బిల్లులపై మంత్రివర్గం చర్చలు జరిపి ఆమోదం తెలపనుంది. కాగా రూ.2.60 లక్షల కోట్లకు పైగా బడ్జెట్ ఉంటుందని సమాచారం. ఈ సందర్భంగా మంత్రులకు సీఎం జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) కీలక ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉంది.