»Andhra Pradesh Sdc Server Down Internet It Services Breakdown
AP SDC కుప్పకూలిన ఏపీ నెట్ వర్క్.. అసెంబ్లీ ప్రారంభం రోజే అపశ్రుతి
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన సమయంలోనే ఈ వ్యవస్థ కూలడం రాజకీయంగా తీవ్ర దుమారం రేపింది. జగన్ పాలనలో ఏదీ సక్రమంగా పని చేయదని టీడీపీ ఎమ్మెల్యేలు విమర్శించారు. చేతగాని సీఎం ఉంటే ఇలానే ఉంటుందని ఎద్దేవా చేశారు. వెంటనే పటిష్ట చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో స్టేట్ డేటా సెంటర్ (ఎస్ డీసీ) (State Data Centre -SDC) నెట్ వర్క్ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఐటీ సేవలు (IT Services) నిలిచిపోయాయి. సర్వర్ డౌన్ (Server Down)తో ఉద్యోగుల హాజరు చేసే యాప్ (App), ఇతర వెబ్ సైట్ (Website) ఆధారంగా జరిగే సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రారంభం రోజే ఈ సంఘటన చోటుచేసుకోవడం విశేషం. స్టేట్ డేటా సెంటర్ (ఎస్ డీసీ) మనకు ఫోన్ లో నెట్ వర్క్ ఎలా వస్తుందో.. ప్రభుత్వ శాఖల సేవలన్నింటికీ స్టేట్ డేటా సెంటర్ (ఎస్ డీసీ) ద్వారా నెట్ అందుతుంది. స్టేట్ డేటా సెంటర్ సర్వర్ డౌన్ కావడంతో మంగళవారం ఉదయం నుంచి ప్రభుత్వ సేవలకు (Govt Services) తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రభుత్వ కార్యాలయాల్లో విధులకు హాజరయ్యే ఉద్యోగులు (Employess) తమ హాజరు కూడా నమోదు చేయలేని పరిస్థితి. ఈ సమస్యతో సాంకేతిక నిపుణులు రంగంలోకి దిగారు. సమస్యను పరిష్కరించి డేటా సెంటర్ సేవలను పునరుద్ధరించే పనిలో మునిగారు. కాగా నెట్ వర్క్ వ్యవస్థ కుప్పకూలడంపై ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఎప్పుడూ సేవలు అందుబాటులోకి వస్తాయో తెలియలేదు. దీంతో ఉద్యోగులు విధులు నిర్వహించుకోలేని పరిస్థితి.
ప్రస్తుతం మారుతున్న కాలానికి అనుగుణంగా ఇప్పుడంతా ఆన్ లైన్ సేవలు అయ్యాయి. ఫైల్స్, పత్రాలు అన్ని ఆన్ లైన్ ద్వారా జరుగుతున్నాయి. కాగితం లేకుండా ప్రభుత్వ సేవలు కొనసాగుతున్నాయి. మరి అలాంటి సమయంలో నెట్ వర్క్ ను పటిష్టంగా ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే సర్వర్ డౌన్ వంటి సమస్యలు వాటిల్లి ప్రజా సేవలకు అంతరాయం ఏర్పడుతుంది. కొన్నిసార్లు ఆ ఫైల్స్ అన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. కాగా ఇలాంటి సంఘటన మొదటి సారి సంభవించినట్టు తెలుస్తున్నది. ఈ సంఘటన నుంచి పాఠం నేర్చుకుని వెంటనే నెట్ వర్క్ ను పటిష్టం చేయాలని ప్రతిపక్ష పార్టీలు కోరుతున్నాయి. కాగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన సమయంలోనే ఈ వ్యవస్థ కూలడం రాజకీయంగా తీవ్ర దుమారం రేపింది. జగన్ పాలనలో ఏదీ సక్రమంగా పని చేయదని టీడీపీ ఎమ్మెల్యేలు విమర్శించారు. చేతగాని సీఎం ఉంటే ఇలానే ఉంటుందని ఎద్దేవా చేశారు. వెంటనే పటిష్ట చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.