Jio : నెట్ రాక యూజర్ల ఇబ్బందులు.. దేశ వ్యాప్తంగా డౌన్ అయిన జియో సర్వర్లు
మంగళవారం దేశ వ్యాప్తంగా రిలయన్స్ జియో సర్వర్లు డౌన్ అయ్యాయి. దీంతో ఇంటర్నెట్ సేవలకు చాలా చోట్ల అంతరాయం కలిగింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
Reliance Jio Down : దేశ వ్యాప్తంగా రిలయన్స్ జియో(RELIANCE JIO) సర్వర్లు మంగళవారం డౌన్ అయ్యాయి. దీంతో చాలా మంది మొబైల్, జియో ఫైబర్ వినియోగదారులు నెట్ రాక ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా వర్క్ ఫ్రం హోం చేసుకునే వారికి నెట్ పని చేయక పోవడంతో పనులన్నీ ఆగిపోయాయి. ఇప్పటి వరకు జియో ఫైబర్‌కు సంబంధించి 38 శాతం మంది, మొబైల్ ఇంటర్నెట్ సేవలకు సంబంధించి 54 శాతం మంది ఫిర్యాదులు చేశారని తెలుస్తోంది.
మంగళవారం దేశ వ్యాప్తంగా సర్వర్లు డౌన్ అయి వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నప్పటికీ రిలయన్స్ జియో(RELIANCE JIO) మాత్రం అధికారికంగా ఈ విషయమై ఎలాంటి ప్రకటనా చేయలేదు. కస్టమర్ కేర్‌కు కాల్ చేసినా ఎవరూ పరిష్కారం చూపడం లేదంటూ పలువురు వినియోగదారులు వాపోతున్నారు. ఈ సర్వీస్ అంతరాయానికి గల కారణం ఇంకా తెలియరాలేదు.
దీనిపై సంస్థ ఇప్పటి వరకు స్పందించకపోవడంతో జియో కస్టమర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాల్లో ఇంటర్నెట్ అంతరాయంపై పలు పోస్ట్‌లు పెడుతున్నారు. ఫిర్యాదులూ చేస్తున్నారు. కస్టర్కేర్కి ఫోన్ చేసి మాట్లాడే ప్రయత్నం చేస్తే వారు కాల్ కట్ చేశారంటూ ఓ యూజర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో కొన్ని గంటల వ్యవధిలోనే జియోను కామెంట్ చేస్తూ మీమ్స్ పుట్టుకొచ్చాయి. ఇతర కంపెనీల హాట్ స్పాట్ సేవలే జియో సేవల కంటే మెరుగ్గా ఉన్నాయంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో జియో సేవల్లో ఎక్కువగా సమస్యలు వస్తున్నాయి. ఫైబర్, మొబైల్ ఇంటర్నెట్ సేవల్లోనే ఇలాంటి అంతరాయాలు ఏర్పడుతుండటం గమనార్హం.