Internet : వరుసగా ఆరో ఏడు ఇంటర్నెట్పై అధికంగా నిషేధం విధించిన దేశంగా భారత్
ఇంటర్నెట్ని అత్యధికసార్లు షట్డౌన్ చేసిన దేశంగా భారత్ అపకీర్తిని మూటగట్టుకుంది. వరుసగా ఆరేళ్లుగా మన దేశమే ఈ విషయంలో మొదటి స్థానంలో ఉండటం గమనించదగ్గ విషయం.
Worst Record : అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ముందున్న మన దేశం ఓ విషయంలో మాత్రం అపకీర్తిని మూటగట్టుకుంది. గత ఏడాది మొత్తంలో ఎక్కువ సార్లు ఇంటర్నెట్ని(Internet) నిషేధించిన మొదటి దేశంగా చెత్త రికార్డును సొంతం చేసుకుంది. గతేడాది భారత్లో వివిధ కారణాల వల్ల ఏకంగా 116 సార్లు ఇంటర్నెట్ను నిషేధించారు. వరుసగా ఆరో సంవత్సరం ఈ విషయంలో మన దేశం ముందుండటం గమనార్హం. ఈ విషయం యాక్సెస్ నౌ స్వచ్ఛంద సంస్థ విడుదల చేసిన నివేదికలో వెల్లడైంది.
గతేడాది అంటే 2023లో ప్రపంచ దేశాలు అన్నింటిలో కలిపి 283 ఇంటర్నెట్ షట్డౌన్ ఘటనలు చోటు చేసుకున్నాయి. అయితే అందులో కేవలం ఒక్క భారత్లోనే 41 శాతం ఇంటర్నెట్ షట్డౌన్లు(Internet Shutdown) చోటు చేసుకున్నాయి. ఇలాంటి ఇంటర్నెట్పై నిషేధాల వల్ల భారత ఆర్థిక వ్యవస్థకు 1.9 బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లిందని ఆ నివేదక తెలిపింది.
ఇలా ఇంటర్నెట్పై(Internet) నిషేధం విధిస్తూ ఉండటం వల్ల 2023 మొదటి రెండు త్రైమాసికాల్లో కలిపి మొత్తం 118 మిలియన్ డాలర్ల విదేశీ పెట్టుబడులను కోల్పోయిందని ఆ నివేదిక వెల్లడించింది. ఇలాంటి షట్డౌన్లు తెలియకుండానే దేశ భవిష్యత్తుపై చాలా ప్రభావాన్ని చూపుతాయని తెలిపింది. ఒక రోజు ఇంటర్నెట్ను నిలిపేస్తే దాదాపుగా 379మంది నిరుద్యోగులుగా మారుతున్నారని విశ్లేషించింది.