»Domestic Telecom Giants Reliance Jio And Airtel Has Shocked The Mobile Users
Jio : జియో ఛార్జీలు 27 శాతం వరకు పెంపు.. ఆ బాటలోనే ఎయిర్టెల్
టెలికాం కంపెనీలు టారిఫ్‌లను పెంచేందుకు సిద్ధమయ్యాయి. జియో తమ టారిఫ్ ఛార్జీలపై పెంపును ప్రకటించగా ఎయిర్టెల్ సైతం అదే బాటలో పయనిస్తోంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ చదివేయండి.
Reliance Jio and Airtel : మన దేశంలో అతి పెద్ద టెలికాం కంపెనీలుగా చలామణీ అవుతున్న రిలయన్స్ జియో(Reliance Jio), ఎయిర్‌టెల్‌లు టారిఫ్ ఛార్జీలను పెంచే పనిలో పడ్డాయి. వినియోగదారులకు షాక్ ఇస్తున్నాయి. గురువారం ఇప్పటికే జియో ఛార్జీలను పెంచుతున్నట్లు ప్రకటించింది. వచ్చే నెల మూడు నుంచి అన్ని రకాల ప్లాన్ల మీదా 12 శాతం నుంచి 27 శాతం పెరుగుదల కనిపిస్తుందని చెప్పింది. ఈ తాజా నిర్ణయంతో 1జీబీ డాటా ప్యాక్ ధర రూ.15 నుంచి రూ.19కి చేరుకుంది.
ఈ విషయమై జియో ఇన్ఫోకామ్ ఛైర్మన్ ఆకాశ్ అంబానీ మాట్లడారు. 5జీ, ఏఐలపై జియో భారీగా పెట్టుబడులు పెడుతోందని చెప్పారు. టెలికాం రంగంలో కొత్త ఆవిష్కరణలు చేయడానికి ఈ పెట్టుబడులు అవసరమని చెప్పుకొచ్చారు. దీంతో కంపెనీ స్థిరమైన వృద్ధి సాధించాలంటే కొత్త టారిఫ్‌లను తీసుకురావాల్సిన అవసరం ఏర్పడిందని చెప్పుకొచ్చారు.
అతిపెద్ద టెలికాం కంపెనీ అయిన ఎయిర్టెల్(Airtel) సైతం జియో అడుగు జాడల్లో నడుస్తోంది. ప్రతి ప్లాన్ పైనా కొత్త ధరల్ని ఫిక్స్ చేసింది. జూలై 3 నుంచి పెంచిన ధరలు అమల్లోకి వస్తాయని వెల్లడించింది. దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని సర్కిళ్లలోనూ ఒకే రకమైన టారిఫ్ ఉండనుందని తెలిపింది. అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్, పోస్ట్ పెయిడ్ పాన్లు, డేటా ప్లాన్లు, డేటా ఏడాన్లు.. ఇలా ప్రతి దాని మీదా కొత్త ధరలు అమల్లోకి వస్తాయని చెప్పుకొచ్చింది. అన్ని ప్లాన్ల పైనా సగటున రోజుకు రూ.70 పైసలు చొప్పున పెంచినట్లు ఎయిర్టెల్ తెలిసింది. భారతీ హెక్సాకామ్ సర్కిళ్లలోనూ ఈ కొత్త టారిఫ్‌లే అమల్లో ఉంటాయని తెలిపింది.