»Students Protest On Pending Bills With Governor And Tspsc Question Paper Leakage
Raj Bhavan పోటాపోటీ ధర్నాలతో దద్దరిల్లిన హైదరాబాద్
ఉద్యోగాలను అమ్ముకుంటూ నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతోందని మండిపడ్డారు. వెంటనే కమిషన్ చైర్మన్ ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. కాగా వీరి ఆందోళనతో కార్యాలయం వద్ద కొంత ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది.
హైదరాబాద్ (Hyderabad) ధర్నాలతో దద్దరిల్లింది. పలు సమస్యలపై వివిధ సంఘాల నాయకులు ఆందోళన (Protest) చేపడుతూ రోడ్లపైకి వచ్చారు. దీంతో పోలీసులు (Police) వారిని అడ్డగించడంతో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. వారిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ లకు తరలించారు. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రాష్ట్ర ప్రభుత్వం పంపిన బిల్లులను ఆమోదించాలనే డిమాండ్ తో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ విద్యార్థి విభాగం (BRS Vidyarthi vibhagam)తో పాటు వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా రాజ్ భవన్ (Raj Bhavan)ను ముట్టడించారు. ఇక టీఎస్ పీఎస్సీ (TSPSC)లో ప్రశ్నాపత్రాల లీకేజ్ (Question Paper Leakage) వ్యవహారం తీవ్ర దుమారం రేపుతున్నది. లీకేజ్ పై ప్రభుత్వం స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రొఫెసర్ కోదండ రాం స్థాపించిన తెలంగాణ జన సమితి (పార్టీ) (TJS Party) నాయకులు డిమాండ్ చేశారు. కమిషన్ చైర్మన్ జనార్దన్ రెడ్డి రాజీనామా చేయాలని కోరుతూ టీఎస్ పీఎస్సీ కార్యాలయాన్ని ముట్టడించారు. దీంతో రెండు ధర్నాలతో హైదరాబాద్ లో ఉద్రిక్తత పరిస్థితులకు దారి తీసింది.
రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించి పంపిన 10 బిల్లులను గవర్నర్ (Governor) తన వద్దే ఉంచుకున్నారు. బిల్లులను పరిశీలించకుండా.. ఆమోదించకుండా తాత్సారం చేస్తుండడంతో రాష్ట్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. దీనిపై ఇటీవల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీనిపై గవర్నర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ‘ఢిల్లీ కన్నా రాజ్ భవన్ చాలా దగ్గర’ అంటూ కౌంటర్ ఇచ్చారు. అయినా పరిస్థితిలో మార్పు రాలేదు. బిల్లులు ఆమోదం పొందకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని మంత్రులు వాపోతున్నారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ విద్యార్థి సంఘాల నాయకులు మంగళవారం రాజ్ భవన్ ముట్టడించారు. అకస్మాత్తుగా నాయకులు దూసుకురావడంతో వారిని నియంత్రించడం పోలీసులకు కుదరలేదు. తీవ్ర ప్రయత్నంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ.. ‘యూనివర్సిటీ రిక్రూట్ మెంట్ బోర్డు బిల్లును గవర్నర్ పెండింగ్ లో ఉంచడం వలన సుమారు 3 వేల ప్రొఫెసర్ పోస్టులు పెండింగ్ లో ఉన్నాయి. బీజేపీ నాయకులు బండి సంజయ్, కిషన్ రెడ్డి చెప్పినట్లు గవర్నర్ వింటున్నారు. పెండింగ్ బిల్లులు వెంటనే ఆమోదించాలి’ అని డిమాండ్ చేశారు.
ఇక నాంపల్లి (Nampally)లోని టీఎస్ పీఎస్సీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. కార్యాలయాన్ని తెలంగాణ జన సమితి విద్యార్థి విభాగం ముట్టడించింది. నిరుద్యోగులు ఏళ్ల తరబడి కష్టపడి పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతుంటే టీఎస్ పీఎస్సీ మాత్రం ఉద్యోగాలను అమ్ముకుంటూ నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతోందని మండిపడ్డారు. వెంటనే కమిషన్ చైర్మన్ ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. కాగా వీరి ఆందోళనతో కార్యాలయం వద్ద కొంత ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. వెంటనే నిరసనకారులను పోలీసులు అరెస్టు చేసి బేగంబజార్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.