»Man Looted Crores Of Rupees Via Cyber Crime In Hyderabad
Cyber crime: ఇంటర్ చదివినోడికే ఇన్ని తెలివితేటలా..? రోజుకి రూ.5కోట్లు టోపీ..!
బాగా చదువుకున్న వారికి ఎక్కువ తెలివితేటలు ఉంటాయని, చదువుకోని వారికి పెద్దగా తెలివి ఉండదు అనుకుంటారు. కానీ, కొందరికి చదువుకు, తెలివితేటలకు అస్సలు సంబంధం ఉండదు. ఓ వ్యక్తి చదివింది కేవలం ఇంటర్ అయినా, మోసం చేసి రూ. కోట్లు కొల్లగొడుతున్నాడు. ప్రతిరోజూ రూ.5 నుంచి రూ.10 కోట్ల లావాదేవీలు చేస్తాడంటే నమ్ముతారా? కానీ ఇది నిజం. హైదరాబాద్(hyderabad)లో సైబర్ మోసాల(cyber crime)కు పాల్పడుతున్న ఓ కేటుగాడిని తాజాగా పోలీసులు అరెస్టు చేశారు. అతను చదివిన చదువుకి, చేస్తున్న మోసాన్ని చూసి పోలీసులే షాకైపోయారు.
పూర్తి వివరాల్లోకి వెళితే…నగరానికి చెందిన దాడి శ్రీనివాసరావు(49) ఇంటర్ వరకు చదివాడు. కానీ ప్రస్తుతం సైబర్ నేరాళ్లో(Cyber crime) ఆరితేరాడు. ఒక్కరోజులోనే అతని బ్యాంక్ ఖాతాలో దాదాపు రూ.5 కోట్లు పడతాయంటే ఎవరూ నమ్మరు. సైబర్ క్రైమ్ ద్వారా ఇప్పటి వరకు ఇతను చాలా మందిని మోసం చేశాడు. కోట్ల సొమ్ము కాజేశాడు. ఇతనిపై దేశవ్యాప్తంగా పోలీసు కేసులు నమోదయ్యాయి.
ఇతడి మోసానికి వేల మంది బలైపోయారు. దేశ వ్యాప్తంగా పలు పోలీసు స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్(hyderabad)లోని ఓ హోటల్లో అతడు ఉన్నట్లు తెలుసుకున్న ముంబై పోలీసులు(police).. బుధవారం అరేస్టు చేశారు. శ్రీనివాసరావుతో పాటు ముఠాలోని మరో నలుగురిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల్లో ఇద్దరు కోల్కతాకు చెందిన వారు కాగా.. మరో ఇద్దరు ఠాణెకు చెందిన వారిగా గుర్తించారు.
శ్రీనివాసరావు ఎక్కువగా మహిళలను టార్గెట్(womens target) చేసి సైబర్ మోసాలకు పాల్పడేవాడు. పోలీసు అధికారులమంటూ వారికి ఫోన్ చేసి.. మీరు పంపిన కొరియర్లో డ్రగ్స్ లేదా వెపన్స్ దొరికాయని బెదిరించేవాడు. కొరియర్ మీది కాదని నిరూపించుకోవాలంటే బ్యాంకు డీటెయిల్స్ పంపాలని అడిగేవాడు. వారు నిజంగా బయపడి బ్యాంక్ డీటైల్స్ పంపడంతో తెలివిగా అందులోని డబ్బును కాజేశాడు.
ఇలా దేశవ్యాప్తంగా వేలమంది నుంచి రోజుకు రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్ల వరకు లావాదేవీలు జరిపేవారని పోలీసుల(police) విచారణలో వెల్లడైంది. ఇలా దోచుకున్న డబ్బును దాడి శ్రీనివాస రావు పలు ఖాతాల్లోకి మళ్లించేవాడు. బ్యాంకు ఖాతాల్లోకి చేరిన డబ్బును క్రిప్టో కరెన్సీలోకి మారుస్తున్నట్లు గుర్తించారు. అతని వద్ద నుంచి రూ.1.5 కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.